తొలి వన్డేలో ఇంగ్లండ్ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనను ఇంగ్లండ్ విజయంతో ప్రారంభించింది. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 21 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసింది. స్టోక్స్ (100 బంతుల్లో 101; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేయగా... కెప్టెన్ బట్లర్ (63), డకెట్ (60) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్లలో మొర్తజా, షకీబ్, షఫీయుల్ రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ జట్టు 47.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటయి0ది..
ఓపెనర్ కేయస్ (119 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. షకీబ్ (55 బంతుల్లో 79; 10 ఫోర్లు, 1 సిక్సర్) సంచలన ఇన్నింగ్‌స ఆడాడు. కేయస్, షకీబ్ ఐదో వికెట్‌కు 92 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నంతసేపు బంగ్లా విజయం దిశగా సాగింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని 17 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు తీసి మ్యాచ్‌ను కాపాడుకున్నారు. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన జేక్ బాల్ ఐదు వికెట్లతో చెలరేగిపోగా... రషీద్ నాలుగు వికెట్లు సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.