CWC 2023: డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర శతకం.. పలు రికార్డులు నమోదు | CWC 2023, ENG vs BAN: Dawid Malan Scores Hundred | Sakshi
Sakshi News home page

CWC 2023 ENG VS BAN: డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర శతకం.. పలు రికార్డులు నమోదు

Published Tue, Oct 10 2023 1:19 PM | Last Updated on Tue, Oct 10 2023 1:28 PM

CWC 2023 ENG VS BAN: Dawid Malan Scores Hundred - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్‌ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు.సెంచరీ తర్వాత గేర్‌ మార్చిన మలాన్‌.. మెహిది హసన్‌ మీరజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 33వ ఓవర్‌లో వరుసగా 4,6,6,4 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ను భారీ స్కోర్‌ దిశగా పరుగులు పెట్టిస్తున్నాడు.

మలాన్‌కు జతగా మరో ఎండ్‌లో జో రూట్‌ (45) ఉన్నారు. 33 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 221 పరుగులు చేసింది. కెరీర్‌లో 100వ మ్యాచ్‌ ఆడుతున్న ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేసి షకీబ్‌ ఉల్‌ హసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఇంగ్లండ్‌.. బంగ్లాదేశ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు చేస్తుంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీతో మలాన్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న మలాన్‌ వన్డేల్లో వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మలాన్‌ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు చేయగా.. పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 27 ఇన్నింగ్స్‌ల్లో 6 శతకాలు బాది మలాన్‌ వెనుక ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు మలాన్‌ మరో ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు (4) చేసిన ఇంగ్లండ్‌ ఆటగాడిగా డేవిడ్‌ గోవర్‌ (1983), జానీ బెయిర్‌స్టో (2018)ల సరసన నిలిచాడు.

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 14 పరుగులకే ఔటైన మలాన్‌.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ తర్వాత మరింతగా చెలరేగిపోతున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఇది ఆరో సెంచరీ. ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర అజేయమైన సెంచరీలతో కదంతొక్కగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు (డికాక్‌, డస్సెన్‌, మార్క్రమ్‌) శతక్కొట్టారు. తాజా శతకంతో మలాన్‌ వీరి సరసన చేరాడు.  35 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 239/1గా ఉంది. మలాన్‌ (128), రూట్‌ (55) క్రీజ్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement