ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2017లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తన కెరీర్‌లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1074, 1450, 1892 పరుగులు సాధించాడు.
అరంగేట్రంలోనే అదరగొట్టి
టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో ఆరు, టీ20లలో ఒక సెంచరీ సాయంతో ఈ మేర డేవిడ్ మలన్ పరుగులు స్కోరు చేశాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన మలన్.. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లిష్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు జోస్ బట్లర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
ఇక పొట్టి ఫార్మాట్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన డేవిడ్ మలన్.. అగ్ర బ్యాటర్‌గా నిలిచాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ విధ్వంసకర వీరుడు కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు.
ఫాస్టెస్ట్ 1000
అంతేకాదు.. న్యూజిలాండ్‌తో టీ20లో 48 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని సత్తా చాటాడు. ఈ క్రమంలో 2020 సెప్టెంబరులో ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచాడు డేవిడ్ మలన్.
అంతేకాదు.. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి బ్యాటర్‌గా డేవిడ్ మలన్ రికార్డు సాధించాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 గెలిచిన జట్టులోనూ డేవిడ్ మలన్ సభ్యుడు.
ప్రపంచకప్‌లో శతక్కొట్టి
వన్డేల్లోనూ మలన్ తన మార్కును చూపించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న అతడు 2022లో కేవలం 15 ఇన్నింగ్స్ వ్యవధిలోనే ఐదు సెంచరీలు బాది తనదైన ముద్ర వేశాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
జేసన్ రాయ్ స్థానంలో ఇంగ్లండ్ తుదిజట్టులో స్థానం పొందిన డేవిడ్ మలన్.. బంగ్లాదేశ్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి తన బ్యాట్ పవర్ చూపించాడు. అయితే, ప్రపంచకప్ టోర్నీ తర్వాత అతడికి జట్టులో చోటు కరువైంది. ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ సెలక్టర్లు మలన్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలుకుతున్నట్లు బుధవారం ప్రకటన విడుదల చేశాడు 37 ఏళ్ల డేవిడ్ మలన్.
చదవండి: శ్రేయస్ అయ్యర్ బౌలింగ్.. భారీ సిక్సర్ బాదిన బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment