టీ20 వరల్డ్ ఛాంపియన్, 2022 పొట్టి ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్‌కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (మార్చి 12) జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో జగజ్జేతను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) ప్రతీకారం తీర్చుకుంది.
ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన బంగ్లా పులులు.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఆఖరి వన్డేలో, తొలి రెండు టీ20ల్లో వరుస విజయాలు సాధించారు. సొంతగడ్డపై ప్రత్యర్ధి ఎంతటి వారైనా తిరుగులేని ఆధిప్యతం ప్రదర్శించే బంగ్లా టైగర్స్..అండర్ డాగ్స్‌గా తమపై ఉన్న ముద్రను కొనసాగించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఇంగ్లండ్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా తంటాలు పడింది. బంగ్లా సంచలన స్పిన్నర్ మెహిది హసన్ మీరజ్ (4-0-12-4) ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. తస్కిన్ అహ్మద్ (1/27), ముస్తాఫిజుర్ (1/19), షకీబ్ అల్ హసన్ (1/13), హసన్ మహమూద్ (1/10) తలో చేయి వేశారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (25), మొయిన్ అలీ (15), బెన్ డక్కెట్ (28), సామ్ కర్రన్ (12), రెహాన్ అహ్మద్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నజ్ముల్ షాంటో (46 నాటౌట్), తౌహిద్ హ్రిదోయ్ (17), మెహిది హసన్ (20) రాణించడంతో సునాయాసంగా విజయతీరాలకు (18.5 ఓవర్లలో 120/6) చేరింది.
స్వల్ప లక్ష్యంగా కావడంతో బంగ్లా టైగర్స్ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడారు. ఫలితంగా మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, మొయిన్ అలీ, రెహాన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన మెహిది హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment