పెర్త్: టి20 వరల్డ్ కప్‌ను మాజీ చాంపియన్ ఇంగ్లండ్ విజయంతో మొదలు పెట్టింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కొంత తడబడినా, చివరకు లక్ష్యాన్ని చేరింది. శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన ‘సూపర్ 12’ గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీమ్ జద్రాన్ (32 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఘని (30 బంతుల్లో 30; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు.
పేసర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (5/10) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టి20ల్లో ఇంగ్లండ్ తరఫున ఒక బౌలర్ 5 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. స్టోక్స్, మార్క్ వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. బట్లర్ (18), హేల్స్ (19) ప్రభావం చూపలేకపోగా...ఆ తర్వాత తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. అయితే లివింగ్‌స్టోన్ (21 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి జట్టును ఒడ్డున పడేశాడు.
Comments
Please login to add a commentAdd a comment