India Vs Pakistan, Asia Cup 2022 Super 4: Pakistan Beat India By Five Wickets In Dubai - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: మన పోరాటం సరిపోలేదు

Published Mon, Sep 5 2022 4:31 AM | Last Updated on Mon, Sep 5 2022 12:05 PM

Asia Cup 2022 Super 4: Pakistan beats India by 5 wickets - Sakshi

టీమిండియా మంచి స్కోరే చేసింది. తన పనైపోయిందనుకున్న విమర్శకుల నోళ్లను కోహ్లి బ్యాట్‌తో, చిరుతను తలపించే పరుగుతో మూయించాడు. 182 పరుగుల లక్ష్యం పాక్‌కు కష్టమైందే. కానీ ప్రధాన బౌలర్లు భువనేశ్వర్, హార్దిక్‌ పాండ్యా, చహల్‌ ముగ్గురు 40 పైచిలుకు పరుగులు సమర్పించుకోవడం, 18వ ఓవర్లో, పట్టుబిగించే దశలో ఆసిఫ్‌ అలీ క్యాచ్‌ను అర్ష్‌దీప్‌ నేలపాలు చేయడం, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌ వైడ్లకు గేట్లు ఎత్తేయడంతో టీమిండియా మ్యాచ్‌నే మూల్యంగా చెల్లించుకుంది.   

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీలో భారత్‌ జోరుకు ‘సూపర్‌–4’లో పాకిస్తాన్‌ కళ్లెం వేసింది. గెలిచేందుకు అవసరమైన లక్ష్యం నిర్దేశించినా... పసలేని బౌలింగ్, పేలవమైన ఫీల్డింగ్‌తో రోహిత్‌ శర్మ బృందం ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

తర్వాత పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఒడ్డున పడేసే ఇన్నింగ్స్‌ ఆడాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ నవాజ్‌ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావవంతమైన బౌలింగ్‌ చేయలేకపోయారు. నేడు విశ్రాంతి దినం. రేపు సూపర్‌–4 రెండో లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ ఆడుతుంది. ఫైనల్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకపై భారత్‌ గెలవాల్సి ఉంటుంది.  

ధనాధన్‌గా మొదలై...
టి20 మెరుపులకు తగ్గట్లే దాటిగా భారత్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది. తొలి ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కవర్స్‌లో ఫోర్, మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదాడు. ఇదే జోరుతో ‘హిట్‌మ్యాన్‌’ రెండో ఓవర్లో మరో బౌండరీని మిడాఫ్‌ దిశగా తరలించాడు. ఇక మూడో ఓవర్లో రాహుల్‌ ఆట మొదలైంది. తొలి బంతిని చక్కని డ్రైవ్‌తో లాంగాఫ్‌లో సిక్స్‌ కొట్టిన తను ఆఖరి బంతిని నేరుగా బౌలర్‌ ఎండ్‌లోని సైట్‌ స్క్రీన్‌కు ముద్దాడించాడు. 3 ఓవర్లలో 34/0 స్కోరు... వెంటనే రవూఫ్‌ను రంగంలోకి దించితే తొలి రెండు బంతుల్ని రోహిత్‌ 4, 6గా మళ్లీ బౌండరీ లైన్‌ను దాటించాడు. ఐదో ఓవర్‌ రెండో బంతిని రాహుల్‌ ఫోర్‌ కొట్టడంతో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది.

దెబ్బ మీద దెబ్బ
ఐదు ఓవర్ల దాకా 54/0 స్కోరుతో బాగానే ఉంది. పవర్‌ ప్లేకు ఇంకో ఓవర్‌ మిగిలుంది. ఇంకేం మన ఓపెనర్లు ఇంకో రెండు మూడైనా తగిలిస్తారనుకుంటే రవూఫ్‌ తన రెండో ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 6వ)లో గట్టి దెబ్బే తీశాడు. రోహిత్‌ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీషాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా బంతికాస్తా బ్యాట్‌ అంచును తాకి అక్కడే గాల్లోకి లేచింది. ఫఖర్‌ జమాన్, ఖుష్‌దిల్‌ల మధ్య క్యాచ్‌ చేజారుతుందనుకుంటే... జమాన్‌ చేతులకి అందని బంతిని ఖుష్‌దిల్‌ చక్కగా ఒడిసి పట్టుకున్నాడు. తర్వాత షాదాబ్‌ బౌలింగ్‌కు దిగిన తొలిబంతికే రాహుల్‌ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను బోల్తా కొట్టించాడు. లాంగాన్‌లో నవాజ్‌ క్యాచ్‌ అందుకోవడంతో 62 పరుగుల వద్ద రెండో వికెట్‌ కూలింది. కోహ్లికి జతయిన సూర్యకుమార్‌ (13) కూడా ఎక్కువసేపు నిలువలేదు. దీంతో భారత్‌ సగం ఓవర్లు ముగిసేసరికి 93/3 స్కోరు చేసింది.  

రాణించిన కోహ్లి
తర్వాత క్రీజులోకి హార్డ్‌ హిట్టర్‌ రిషభ్‌ పంత్‌ (14) వచ్చినప్పటికీ స్కోరు, జోరు రెండూ తగ్గాయి. 11వ ఓవర్లో టీమిండియా 100 పరుగులు దాటింది. తన వికెట్‌ ప్రాధాన్యం దృష్ట్యా కోహ్లి చూసుకొని ఆడగా, పంత్‌ కాస్త ఆలస్యంగా తానెదుర్కొన్న 8వ బంతికి ఫోర్‌ కొట్టాడు. మరుసటి ఓవర్లో మరో బౌండరీ కొట్టిన పంత్‌ అత్యుత్సాహానికి పోయి మూల్యం చెల్లించుకున్నాడు. షాదాబ్‌ గూగ్లీని రివర్స్‌స్వీప్‌ ఆడి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న ఆసిఫ్‌ అలీ చేతుల్లో పెట్టాడు. ఆఖర్లో శివమెత్తే హార్దిక్‌ పాండ్యా (0) చెత్త షాట్‌ ఆడి డకౌటయ్యాడు.

ఓ రకంగా స్లాగ్‌ ఓవర్లలో భారీషాట్లతో విరుచుకుపడే బ్యాటర్స్‌ను కోల్పోయిన భారత్‌ను కోహ్లి ఆదుకున్నాడు. దీపక్‌ హుడా (11 బంతుల్లో 16; 2 ఫోర్లు)తో కలిసి పటిష్టమైన స్కోరుకు బాటవేశాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో బౌండరీల రూపంలో వచ్చినవి 22 పరుగులే అయినా యువ ఆటగాళ్లకు కూడా సాధ్యంకానీ రీతిలో చకచకా సింగిల్స్, డబుల్స్‌ పిండుకున్నాడు. 36 బంతుల్లోనే (4ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ చేసిన కోహ్లి ఆఖరి ఓవర్లో రనౌటయ్యాడు. రవి బిష్ణోయ్‌ (2 బంతుల్లో 8 నాటౌట్‌;) చివరి 2 బంతుల్ని బౌండరీలకు తరలించాడు. పాక్‌ బౌలర్లు నసీమ్‌ షా, హస్‌నైన్, రవూఫ్, నవాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

గెలిపించిన రిజ్వాన్‌
భారీ లక్ష్యం ఛేదించే క్రమంలో పాక్‌ ఆరంభంలోనే కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (14) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత ఓపెనర్‌ రిజ్వాన్, ఫఖర్‌ జమాన్‌ (15)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఏడో ఓవర్లలో పాక్‌ 50 పరుగులను చేరుకుంది. 9వ ఓవర్లో చహల్‌... ఫఖర్‌ను పెవిలియన్‌ చేర్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ 76/2 స్కోరు చేసింది. గెలిచేందుకు ఇంకా వందకు పైగా పరుగులు చేయాల్సిన స్థితి! అయితే 11వ ఓవర్‌ నుంచి 15వ ఓవర్‌దాకా పాక్‌ బ్యాటింగ్‌లో వేగం పుంజుకుంది. ఇటు రిజ్వాన్, అటు నవాజ్‌ చెలరేగడంతో ఈ ఐదు ఓవర్లలో 10 పరుగులకు తక్కువ కాకుండా ఓవరాల్‌గా 59 పరుగులు రావడమే జట్టును గెలుపు మలుపు తిప్పింది.

రిజ్వాన్‌ 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ కూడా పూర్తి చేశాడు. ఇక ఆఖరి 30 బంతుల్లో 47 పరుగుల సమీకరణం పాక్‌కే అనుకూలంగా మారింది. అయితే వరుస ఓవర్లలో దంచేస్తున్న నవాజ్‌ను భువీ, పాతుకుపోయిన రిజ్వాన్‌ను హార్దిక్‌ అవుట్‌ చేయడంతో ఆశలు రేగాయి. బిష్ణోయ్‌ 18వ ఓవర్లో ఏకంగా 3 వైడ్లు వేసి 8 పరుగులిచ్చాడు. అయినప్పటికీ 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం టీమిండియా విజయంపై ఆశల్ని పెంచింది. కానీ అనుభవజ్ఞుడైన భువీ కూడా 2 వైడ్లు వేసి సిక్స్, 2 బౌండరీలు సమర్పించుకోవడంతో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్లో ఆసిఫ్‌ అలీ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎల్బీగా వెనుదిరిగినా ఇంకో బంతి మిగిలుండగానే పాక్‌ గెలిచింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) నవాజ్‌ (బి) షాదాబ్‌ 28; రోహిత్‌ (సి) ఖుష్‌దిల్‌ (బి) రవూఫ్‌ 28; కోహ్లి (రనౌట్‌) 60; సూర్యకుమార్‌ (సి) ఆసిఫ్‌ అలీ (బి) నవాజ్‌ 13; పంత్‌ (సి) ఆసిఫ్‌ అలీ (బి) షాదాబ్‌ 14; పాండ్యా (సి) నవాజ్‌ (బి) హస్‌నైన్‌ 0; దీపక్‌ హుడా (సి) నవాజ్‌ (బి) నసీమ్‌ షా 16; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 0; బిష్ణోయ్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181.
వికెట్ల పతనం: 1–54, 2–62, 3–91, 4–126, 5–131, 6–168, 7–173.
బౌలింగ్‌: నసీమ్‌ షా 4–0–45–1, హస్‌నైన్‌ 4–0–38–1, రవూఫ్‌ 4–0–38–1, నవాజ్‌ 4–0–25–1, షాదాబ్‌ 4–0–31–2.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) పాండ్యా 71; బాబర్‌ ఆజమ్‌ (సి) రోహిత్‌ (బి) బిష్ణోయ్‌ 14; ఫఖర్‌ (సి) కోహ్లి (బి) చహల్‌ 15; నవాజ్‌ (సి) హుడా (బి) భువనేశ్వర్‌ 42; ఖుష్‌దిల్‌ (నాటౌట్‌) 14; ఆసిఫ్‌ అలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్‌దీప్‌ 16; ఇఫ్తికార్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1–22, 2–63, 3–136, 4–147, 5–180.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–40–1; అర్ష్‌దీప్‌ 3.5–0–27–1, రవి బిష్ణోయ్‌ 4–0–26–1, పాండ్యా 4–0–44–1, చహల్‌ 4–0–43–1.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement