Asia Cup T20
-
మలింగ సూపర్ యార్కర్.. నోరెళ్లబెట్టిన పాక్ కెప్టెన్! వీడియో
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో పాకిస్తాన్-ఎ కథ ముగిసింది. అల్ అమెరత్ వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. 136 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో ఊదిపడేసింది.లంక బ్యాటర్లలో అహన్ విక్రమసింఘే(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లహిరు ఉదరా(43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్, అబ్బాస్ అఫ్రిది తలా వికెట్ మాత్రమే సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులకే విఫలమైంది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ యూసఫ్(68) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో స్పిన్నర్ హేమంత 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. ఇషాన్ మలింగ, రన్షిక తలా రెండు వికెట్లు పడగొట్టారు.మలింగ సూపర్ యార్కర్..అయితే ఈ మ్యాచ్‌లో లంక స్పీడ్ స్టార్ ఇషాన్ మలింగ సంచలన బంతితో మెరిశాడు. పాక్ కెప్టెన్ మహ్మద్ హ్యారీస్‌ను అద్భుతమైన యార్కర్‌తో మలింగ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ 6 ఓవర్లో మలింగ ఆఖరి బంతిని వేసే క్రమంలో హ్యారీస్ ముందుగానే తన కుడి వైపునకు వెళ్లి ర్యాంప్ షాట్ ఆడాలనకున్నాడు.ఇది గమనించిన ఎషాన్ మలింగ చాలా తెలివిగా మిడిల్ అండ్ లెగ్‌పై అద్భుతమైన యార్కర్‌ను బౌల్ చేశాడు. బుల్లెట్లా దూసుకు వచ్చిన బంతిని కనక్ట్ చేయడంలో పాక్ కెప్టెన్ విఫలమయ్యాడు. దీంతో బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Ehsan Malinga gets the big fish with a peach of a delivery 🫡@OfficialSLC#MensT20EmergingTeamsAsiaCup2024 #SLvPAK #ACC pic.twitter.com/SK54SWEbdY— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024 -
భారత్ ‘ఎ’ హ్యాట్రిక్ గెలుపు
మస్కట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్ నదీమ్ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్ సింగ్, సాయికిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
ఎనిమిదో టైటిల్ లక్ష్యంగా...
దంబుల్లా (శ్రీలంక): మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోరీ్న లో ఎదురు లేకుండా సాగుతున్న భారత జట్టు.. నేడు తుది సమరానికి సిద్ధమైంది. టోరీ్నలో ఎదురైన ప్రత్యరి్థనల్లా చిత్తుచేసిన టీమిండియా.. ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. ఇప్పటికే ఎనిమిదిసార్లు (వన్డే, టి20 పార్మాట్లలో కలిపి) ఆసియాకప్ ఫైనల్ ఆడి అందులో ఏడింట విజేతగా నిలిచిన టీమిండియా.. ఎనిమిదోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ బృందం.. దాయాది పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ జట్లపై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి తుదిపోరుకు చేరింది. ఇటీవలి కాలంలో హర్మన్‌ప్రీత్ బృందం జోరు చూస్తుంటే.. కప్ ఖాయంగానే కనిపిస్తోంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంటే... బౌలింగ్‌లో రేణుక సింగ్, రాధ యాదవ్, దీప్తి శర్మ అదరగొడుతున్నారు. హర్మన్, జెమీమాకు ఈ టోరీ్నలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా... సమయం వస్తే సత్తా చాటడం ఖాయమనే మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌లు నెగ్గిన లంక... పాకిస్తాన్‌తో హోరాహోరీ సెమీఫైనల్లో ఒత్తిడిని జయించి ఫైనల్‌కు అర్హత సాధించింది. కెప్టెన్ చమరి అటపట్టుపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో 243 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న చమరి రాణిస్తేనే టీమిండియాకు లంక పోటీనివ్వగలదు. -
మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గొప్ప మనసు చాటుకుంది. తన చిన్నారి అభిమానిని సంతోష పెట్టేందుకు బహుమతినిచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వుమెన్స్ ఆసియా టీ20 కప్ ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లిన విషయం తెలిసిందే.శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలి మ్యాచ్‌లోనే గెలుపు నమోదు చేసింది.పాక్‌ను చిత్తు చేసిన భారత్‌పాకిస్తాన్ విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(29 బంతుల్లో 40), స్మృతి మంధాన (31 బంతుల్లో 45) రాణించారు.ఇక పాక్‌ను 108 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్ బౌలర్ దీప్తి శర్మ(3/20)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.స్పెషల్ ఫ్యాన్ఇదిలా ఉంటే.. డంబుల్లా వేదికగా జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు ఓ ‘ప్రత్యేకమైన’ చిన్నారి స్టేడియానికి వచ్చింది. ఆమె పేరు ఆదీషా హెరాత్.ఆదీషాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే భారత క్రికెటర్ స్మృతి మంధాన అంటే మరీ ఇష్టం. అందుకే తన అభిమాన ప్లేయర్‌ను కలుసుకునేందుకు ఆదీషా తల్లి సాయంతో మ్యాచ్ వేదిక వద్దకు వచ్చింది.స్పెషల్ ఏబుల్డ్ చైల్డ్ అయినా ఆదీషాను తన తల్లి వీల్‌చైర్‌లో తీసుకువచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన ఆదీషా దగ్గరికి వెళ్లి పలకరించింది. అంతేకాదు తనకు మొబైల్ ఫోన్‌ను బహుమతిగా అందించింది.సంతోషంగా ఉందిఈ విషయంపై స్పందించిన ఆదీషా తల్లి మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మ్యాచ్ కచ్చితంగా చూడాలంటూ నా కూతురు పట్టుబట్టింది. భారత జట్టు క్రికెటర్ మంధానను కలిశాం.ఆమె నా కూతురికి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తనలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి బహుమతి మేము అస్సలు ఊహించలేదు. నిజంగా ఈ విషయంలో నా కూతురు అదృష్టవంతురాలే’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత్ తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో తలపడనుంది.చదవండి: IND Vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?.. నాకైతే అర్థం కావడం లేదుAdeesha Herath's love for cricket brought her to the stadium, despite all the challenges. The highlight of her day? A surprise encounter with her favorite cricketer, Smriti Mandhana, who handed her a mobile phone as a token of appreciation 🥺𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐬 𝐥𝐢𝐤𝐞 𝐭𝐡𝐞𝐬𝐞… pic.twitter.com/iqgL2RNE9v— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 20, 2024 -
ఏడో టైటిల్ వేటలో భారత్
సిల్హెట్: ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. ఇలాంటి నేపథ్యంలో నేడు తుది పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సమష్టి ప్రదర్శనతో... లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం మినహా ఓవరాల్‌గా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అన్ని మ్యాచ్‌లు (7) ఆడిన ముగ్గురు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు (215) సాధించగా, దీప్తి శర్మ అత్యధిక వికెట్లు (13) తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. షఫాలీ వర్మ కూడా ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూలాంశం. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (4 ఇన్నింగ్స్‌లలో కలిపి 83 పరుగులు) మాత్రం ఆశించిన రీతిలో ఆడలేకపోయినా, ఫైనల్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌ల స్పిన్ ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలదు. దీప్తి సూపర్ ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. భారత్‌తో పోలిస్తే చమరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు బలహీనమనేది వాస్తవం. అయితే పాక్‌తో సెమీఫైనల్లో ఆ జట్టు చివరి బంతి వరకు కనబర్చిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే తేలిగ్గా ఓటమిని అంగీకరించే తరహా టీమ్ మాత్రం కాదని తెలుస్తోంది. తుది పోరులో ఆ జట్టు పోరాటం ఎంత వరకు సఫలం అవుతుందనేది చెప్పలేం. -
Womens Asia Cup 2022: మేఘన మెరిసె...
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్‌లో మేఘన నిష్క్రమించింది. తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్‌గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది. -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచింది. -
Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
మార్పుల్లేకుండా ఆసియా కప్ టోర్నీకి...
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో పాల్గొనే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో ఇటీవల ఇంగ్లండ్‌తో ఆడిన టి20 సిరీస్‌లో ఎలాంటి మార్పులు లేకుండా టీమ్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే 15 మందితో పాటు అదనంగా మరో ఇద్దరు ప్లేయర్లు తానియా భాటియా, సిమ్రన్ బహదూర్‌లకు స్టాండ్‌బైగా అవకాశం లభించింది.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆడిన ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ అక్టోబర్ 1 నుంచి 15 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. అక్టోబర్ 1న జరిగే తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత మహిళల బృందం తలపడుతుంది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్, స్నేహ్ రాణా, హేమలత, మేఘనా సింగ్, రేణుక సింగ్, పూజ వస్త్రకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కిరణ్ నవ్‌గిరే. స్టాండ్‌బై: తానియా భాటియా, సిమ్రన్ బహదూర్ . -
Asia Cup 2022: లంకకు ఎదురుందా!
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ‘అండర్ డాగ్’గా బరిలోకి దిగి అదరగొట్టిన శ్రీలంక ఇప్పుడు టైటిల్‌పైనే కన్నేసింది. ‘సూపర్–4’లో అజేయంగా నిలిచిన సింహళ జట్టు ఇప్పుడు ఫైనల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సూపర్–4లో తడబడుతూ తుదిపోరుకు చేరిన పాకిస్తాన్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. భారత్‌తో బాగా ఆడిన పాకిస్తాన్ తర్వాత క్రికెట్ కూన అఫ్గానిస్తాన్‌తో చచ్చిచెడీ చివరి ఓవర్లో ఆఖరి వికెట్‌తో గట్టెక్కింది. గత మ్యాచ్‌లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ ఆజమ్ మినహా ఇంకెవ రూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యా టింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌ ట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. దుర్భేద్యంగా షనక బృందం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్, రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ కంటే 8వ ర్యాంకులో ఉన్న లంక జట్టే ఈ టోర్నీలో అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌లతో పాటు భానుక రాజపక్స బ్యాట్‌తో చెలరేగుతున్నారు. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్‌లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్‌లో హసరంగ తన స్పిన్ ఉచ్చులో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్‌కు కష్టమే! జట్లు (అంచనా) శ్రీలంక: షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్, దనుష్క గుణతిలక, ధనంజయ, కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, మదుషన్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, ఇఫ్తికార్, ఖుష్దిల్, షాదాబ్, నవాజ్, ఆసిఫ్ అలీ, హారిస్ రవూఫ్, హస్నైన్, నసీమ్ షా. ► పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 22 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, 9 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ► ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నీ 14 సార్లు జరిగింది. శ్రీలంక ఐదు సార్లు... పాకిస్తాన్ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచాయి. భారత్ ఏడుసార్లు విజేతగా నిలిచింది. -
Asia Cup 2022: మన పోరాటం సరిపోలేదు
టీమిండియా మంచి స్కోరే చేసింది. తన పనైపోయిందనుకున్న విమర్శకుల నోళ్లను కోహ్లి బ్యాట్‌తో, చిరుతను తలపించే పరుగుతో మూయించాడు. 182 పరుగుల లక్ష్యం పాక్‌కు కష్టమైందే. కానీ ప్రధాన బౌలర్లు భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, చహల్ ముగ్గురు 40 పైచిలుకు పరుగులు సమర్పించుకోవడం, 18వ ఓవర్లో, పట్టుబిగించే దశలో ఆసిఫ్ అలీ క్యాచ్‌ను అర్ష్‌దీప్ నేలపాలు చేయడం, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ వైడ్లకు గేట్లు ఎత్తేయడంతో టీమిండియా మ్యాచ్‌నే మూల్యంగా చెల్లించుకుంది. దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్ జోరుకు ‘సూపర్–4’లో పాకిస్తాన్ కళ్లెం వేసింది. గెలిచేందుకు అవసరమైన లక్ష్యం నిర్దేశించినా... పసలేని బౌలింగ్, పేలవమైన ఫీల్డింగ్‌తో రోహిత్ శర్మ బృందం ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రిజ్వాన్ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఒడ్డున పడేసే ఇన్నింగ్స్ ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావవంతమైన బౌలింగ్ చేయలేకపోయారు. నేడు విశ్రాంతి దినం. రేపు సూపర్–4 రెండో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకపై భారత్ గెలవాల్సి ఉంటుంది. ధనాధన్‌గా మొదలై... టి20 మెరుపులకు తగ్గట్లే దాటిగా భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ కవర్స్‌లో ఫోర్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. ఇదే జోరుతో ‘హిట్‌మ్యాన్’ రెండో ఓవర్లో మరో బౌండరీని మిడాఫ్ దిశగా తరలించాడు. ఇక మూడో ఓవర్లో రాహుల్ ఆట మొదలైంది. తొలి బంతిని చక్కని డ్రైవ్‌తో లాంగాఫ్‌లో సిక్స్ కొట్టిన తను ఆఖరి బంతిని నేరుగా బౌలర్ ఎండ్‌లోని సైట్ స్క్రీన్కు ముద్దాడించాడు. 3 ఓవర్లలో 34/0 స్కోరు... వెంటనే రవూఫ్‌ను రంగంలోకి దించితే తొలి రెండు బంతుల్ని రోహిత్ 4, 6గా మళ్లీ బౌండరీ లైన్‌ను దాటించాడు. ఐదో ఓవర్ రెండో బంతిని రాహుల్ ఫోర్ కొట్టడంతో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. దెబ్బ మీద దెబ్బ ఐదు ఓవర్ల దాకా 54/0 స్కోరుతో బాగానే ఉంది. పవర్ ప్లేకు ఇంకో ఓవర్ మిగిలుంది. ఇంకేం మన ఓపెనర్లు ఇంకో రెండు మూడైనా తగిలిస్తారనుకుంటే రవూఫ్ తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 6వ)లో గట్టి దెబ్బే తీశాడు. రోహిత్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీషాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతికాస్తా బ్యాట్ అంచును తాకి అక్కడే గాల్లోకి లేచింది. ఫఖర్ జమాన్, ఖుష్దిల్ల మధ్య క్యాచ్ చేజారుతుందనుకుంటే... జమాన్ చేతులకి అందని బంతిని ఖుష్దిల్ చక్కగా ఒడిసి పట్టుకున్నాడు. తర్వాత షాదాబ్ బౌలింగ్‌కు దిగిన తొలిబంతికే రాహుల్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను బోల్తా కొట్టించాడు. లాంగాన్‌లో నవాజ్ క్యాచ్ అందుకోవడంతో 62 పరుగుల వద్ద రెండో వికెట్ కూలింది. కోహ్లికి జతయిన సూర్యకుమార్ (13) కూడా ఎక్కువసేపు నిలువలేదు. దీంతో భారత్ సగం ఓవర్లు ముగిసేసరికి 93/3 స్కోరు చేసింది. రాణించిన కోహ్లి తర్వాత క్రీజులోకి హార్డ్ హిట్టర్ రిషభ్ పంత్ (14) వచ్చినప్పటికీ స్కోరు, జోరు రెండూ తగ్గాయి. 11వ ఓవర్లో టీమిండియా 100 పరుగులు దాటింది. తన వికెట్ ప్రాధాన్యం దృష్ట్యా కోహ్లి చూసుకొని ఆడగా, పంత్ కాస్త ఆలస్యంగా తానెదుర్కొన్న 8వ బంతికి ఫోర్ కొట్టాడు. మరుసటి ఓవర్లో మరో బౌండరీ కొట్టిన పంత్ అత్యుత్సాహానికి పోయి మూల్యం చెల్లించుకున్నాడు. షాదాబ్ గూగ్లీని రివర్స్‌స్వీప్ ఆడి బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఆసిఫ్ అలీ చేతుల్లో పెట్టాడు. ఆఖర్లో శివమెత్తే హార్దిక్ పాండ్యా (0) చెత్త షాట్ ఆడి డకౌటయ్యాడు. ఓ రకంగా స్లాగ్ ఓవర్లలో భారీషాట్లతో విరుచుకుపడే బ్యాటర్స్‌ను కోల్పోయిన భారత్‌ను కోహ్లి ఆదుకున్నాడు. దీపక్ హుడా (11 బంతుల్లో 16; 2 ఫోర్లు)తో కలిసి పటిష్టమైన స్కోరుకు బాటవేశాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో బౌండరీల రూపంలో వచ్చినవి 22 పరుగులే అయినా యువ ఆటగాళ్లకు కూడా సాధ్యంకానీ రీతిలో చకచకా సింగిల్స్, డబుల్స్ పిండుకున్నాడు. 36 బంతుల్లోనే (4ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ చేసిన కోహ్లి ఆఖరి ఓవర్లో రనౌటయ్యాడు. రవి బిష్ణోయ్ (2 బంతుల్లో 8 నాటౌట్;) చివరి 2 బంతుల్ని బౌండరీలకు తరలించాడు. పాక్ బౌలర్లు నసీమ్ షా, హస్నైన్, రవూఫ్, నవాజ్ తలా ఒక వికెట్ తీశారు. గెలిపించిన రిజ్వాన్ భారీ లక్ష్యం ఛేదించే క్రమంలో పాక్ ఆరంభంలోనే కెప్టెన్ బాబర్ ఆజమ్ (14) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత ఓపెనర్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ (15)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఏడో ఓవర్లలో పాక్ 50 పరుగులను చేరుకుంది. 9వ ఓవర్లో చహల్... ఫఖర్‌ను పెవిలియన్ చేర్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికి పాక్ 76/2 స్కోరు చేసింది. గెలిచేందుకు ఇంకా వందకు పైగా పరుగులు చేయాల్సిన స్థితి! అయితే 11వ ఓవర్ నుంచి 15వ ఓవర్‌దాకా పాక్ బ్యాటింగ్‌లో వేగం పుంజుకుంది. ఇటు రిజ్వాన్, అటు నవాజ్ చెలరేగడంతో ఈ ఐదు ఓవర్లలో 10 పరుగులకు తక్కువ కాకుండా ఓవరాల్‌గా 59 పరుగులు రావడమే జట్టును గెలుపు మలుపు తిప్పింది. రిజ్వాన్ 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ కూడా పూర్తి చేశాడు. ఇక ఆఖరి 30 బంతుల్లో 47 పరుగుల సమీకరణం పాక్‌కే అనుకూలంగా మారింది. అయితే వరుస ఓవర్లలో దంచేస్తున్న నవాజ్‌ను భువీ, పాతుకుపోయిన రిజ్వాన్‌ను హార్దిక్ అవుట్ చేయడంతో ఆశలు రేగాయి. బిష్ణోయ్ 18వ ఓవర్లో ఏకంగా 3 వైడ్లు వేసి 8 పరుగులిచ్చాడు. అయినప్పటికీ 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం టీమిండియా విజయంపై ఆశల్ని పెంచింది. కానీ అనుభవజ్ఞుడైన భువీ కూడా 2 వైడ్లు వేసి సిక్స్, 2 బౌండరీలు సమర్పించుకోవడంతో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్లో ఆసిఫ్ అలీ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎల్బీగా వెనుదిరిగినా ఇంకో బంతి మిగిలుండగానే పాక్ గెలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) నవాజ్ (బి) షాదాబ్ 28; రోహిత్ (సి) ఖుష్దిల్ (బి) రవూఫ్ 28; కోహ్లి (రనౌట్) 60; సూర్యకుమార్ (సి) ఆసిఫ్ అలీ (బి) నవాజ్ 13; పంత్ (సి) ఆసిఫ్ అలీ (బి) షాదాబ్ 14; పాండ్యా (సి) నవాజ్ (బి) హస్నైన్ 0; దీపక్ హుడా (సి) నవాజ్ (బి) నసీమ్ షా 16; భువనేశ్వర్ (నాటౌట్) 0; బిష్ణోయ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–54, 2–62, 3–91, 4–126, 5–131, 6–168, 7–173. బౌలింగ్: నసీమ్ షా 4–0–45–1, హస్నైన్ 4–0–38–1, రవూఫ్ 4–0–38–1, నవాజ్ 4–0–25–1, షాదాబ్ 4–0–31–2. పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 71; బాబర్ ఆజమ్ (సి) రోహిత్ (బి) బిష్ణోయ్ 14; ఫఖర్ (సి) కోహ్లి (బి) చహల్ 15; నవాజ్ (సి) హుడా (బి) భువనేశ్వర్ 42; ఖుష్దిల్ (నాటౌట్) 14; ఆసిఫ్ అలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్‌దీప్ 16; ఇఫ్తికార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–22, 2–63, 3–136, 4–147, 5–180. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–40–1; అర్ష్‌దీప్ 3.5–0–27–1, రవి బిష్ణోయ్ 4–0–26–1, పాండ్యా 4–0–44–1, చహల్ 4–0–43–1. -
'ఆసియా కప్ నిర్వహించలేం.. వేదికను మార్చండి'
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు మండిపోతుండగా.. పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటింది. తీవ్ర సంక్షోభంతో అక్కడి జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో లంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృశ్యా ఆసియా కప్‌ను నిర్వహించలేమని.. వేదికను మార్చాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏసీసీ అధ్యక్షుడు జై షాకు లంక క్రికెట్ బోర్డు వినతిపత్రం సమర్పించింది. కాగా జై షా సహా బీసీసీఐ అధికారులతో పాటు లంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉన్నారు. ఇవాళ(మే 29) ఐపీఎల్ ఫైనల్ జరగనుండడంతో మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో జై షా నేతృత్వంలో ఆసియా కప్ నిర్వహణకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేశారు. లంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమని ఆ దేశ బోర్డు వివరించగా.. అందుకు మెజారిటీ ఏసీసీ సభ్యులు పాజిటివ్‌గా స్పందించారు. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమైతే యూఏఈకి తరలించడమో లేక బంగ్లాదేశ్ వేదికగా టోర్నీని నిర్వహించాలని ఏసీసీ భావించింది. ఇదే నిజమైతే ఆసియా కప్ యూఏఈ లేదా బంగ్లాదేశ్‌లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, యూఏఈలు తలపడనున్నాయి. టి20 ఫార్మాట్లో టోర్నీని నిర్వహించనున్నారు. ఆసియా కప్ చివరిసారి 2018లో యూఏఈలో జరగ్గా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన టీమిండియా ఏడోసారి కప్‌ను కైవసం చేసుకుంది. చదవండి: కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్ -
వరల్డ్‌కప్‌కు ముందే భారత్- పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
భారత అభిమానులకు గుడ్ న్యూస్. దాయాదుల పోరుకు మరో సారి రంగం సిద్దం కానుంది. ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్‌లు మరో సారి తలపడనున్నాయి. దీనికి శ్రీలంక వేదిక కానుంది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఈ నిర్ణయాన్ని వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్యక్షుడిగా జైషా ఉన్నారు. ఇక ఈ సారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. అదే విధంగా ఈ టోర్నమెంట్లో మొత్తం 6 జట్లు పాల్గోనున్నాయి. కాగా 2020లో జరగాల్సిన ఆసియాకప్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆసియాకప్ చివరసారిగా 2018లో జరిగింది. 2018 ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక భారత్-పాక్ దేశాల నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇప్పటిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు. దీంతో క్రికెట్ అభిమానులు ఐసీసీ ఈవెంట్లు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్లోను ఇరు దేశాలు తలపడనున్నాయి. చదవండి: Yastika Bhatia: 'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా' -
టీమిండియాకు పాకిస్తాన్ అల్టిమేటం
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం రోజున సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో తాము కూడా ఆడేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తామని వస్తున్న వార్తలను వసీమ్ ఖండించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం తాము ఆసియా కప్ నిర్వహించడానికి రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే పాకిస్తాన్లో ఆడాలా, లేదా అనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్లో తీవ్రవాదులను కట్టడిచేశాకనే ఆ దేశంతో క్రికెట్ ఆడతామని భారత్ చెప్పిన విషయం తెలిసిందే. 2020 సెప్టెంబరులో ఆసియా కప్‌ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే టీ20 వరల్డ్ కప్ 2021 భారత్‌లో జరగనుంది. -
బంగ్లా విజయం వెనుక భారత క్రికెటర్!
కౌలలాంపుర్ : ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ టైటిల్ నెగ్గి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పసికూన బంగ్లా ఆరు సార్లు చాంపియన్ అయిన భారత జట్టును అనూహ్యంగా ఓడించింది. అయితే బంగ్లా మహిళల విజయం వెనుక మరో భారత మహిళా క్రికెటర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత మాజీ క్రికెటర్ అంజూ జైన్ బంగ్లాకోచ్‌గా ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. గత నెల దక్షిణాఫ్రికాలో పర్యటించిన బంగ్లాదేశ్ దారుణ ఓటములను మూటగట్టుకుంది. వన్డే (5-0), టీ20 (3-0)లతో క్లీన్‌స్వీప్ అయి వెనుదిరిగింది. ఈ పరాజయాలను తీవ్రంగా పరిగణించిన ఆ దేశ బోర్డు వెంటనే కోచ్‌ను మార్చేసింది. అప్పటి కోచ్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ కాపెల్‌ను తొలిగించి భారత మాజీ వికెట్ కీపర్ అంజూ జైన్ నియమించింది. ఈ పరిస్థితిల్లో బంగ్లా ఆసియాకప్‌లో రాణిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అంజూ జైన్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా టైటిల్ గెలిచేలా చేశారు. బంగ్లా మహిళా జట్టు కోచ్, భారత మాజీ క్రికెటర్ అంజూ జైన్ ఈ విజయానంతరం ఆమె మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాను. దీన్ని ఓ పెద్ద సవాల్‌గా స్వీకరించాను. ఆ సమయంలో బంగ్లా జట్టు చాలా దారుణ స్థితిలో ఉంది. నేను కేవలం వారిలో ఉత్సహాన్ని నింపే ప్రయత్నం చేశాను. ఈ విజయం జట్టుకు, వ్యక్తిగతంగా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం నేను జట్టులోని బలహీనతలను గుర్తించాను. దానికి అనుగుణంగా నా ప్రణాళికలను అమలు చేశాను. ఫైనల్ గెలవడంలో ఎలాంటి మంత్రం లేదు. ప్రతి మ్యాచ్‌లో మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశాం. ఎవరూ కూడా భారత్‌తో లక్కీగా గెలిచారని అనవద్దు అని ఈ మ్యాచ్‌కు మందు ప్రతి క్రికెటర్‌కు చెప్పా.. అని ఈ భారత మాజీ క్రికెటర్ తెలిపారు. ఒత్తిడితోనే భారత్ చిత్తు.. ఆరుసార్లు చాంపియన్, టోర్నీలో బంగ్లాపై ఓటమి చెందడంతో భారత్ ఒత్తిడికి లోనైందన్నారు. తమ జట్టుకు ఇది తొలి ఫైనల్ అయినప్పటికీ తమ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా రాణించారని తెలిపారు. ఇక అంజూ జైన్ 2012 టీ20 , 2013 వన్డే ప్రపంచకప్ టోర్నీలకు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించారు. భారత్ తరపున ఆమె 65 వన్డేలు, 8 టెస్ట్‌లకు ప్రాతినిథ్యం వహించి 2005లో రిటైర్మెంట్ ప్రకటించారు. -
భారత మహిళల జట్టుకు భంగపాటు
కౌలాలంపూర్: ఫైనల్లో అది ఫైనల్ ఓవర్... బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. బంగ్లా చేతిలో 5 వికెట్లున్నా... భారత బౌలర్ల ప్రదర్శన దృష్ట్యా బంగ్లాదేశ్‌కు కష్టతరమే. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్వయంగా బౌలింగ్‌కు దిగింది. తొలి మూడు బంతుల్లో 1, 4, 1లతో ఆరు పరుగులిచ్చింది. ఇక 3 బంతుల్లో 3. చాలా ఈజీ. అయితే అప్పుడే కౌర్ మ్యాజిక్ మొదలైంది. నాలుగో బంతికి సంజిదా ఇస్లామ్‌ను ఔట్ చేసింది. ఐదో బంతికి రుమానా అహ్మద్ రనౌటైంది. ఒక పరుగొచ్చింది. దీంతో ఒక్కసారిగా భారత్ శిబిరంలో ఎక్కడలేని ఆనందం. కానీ చివరి బంతికి జహనార ఆలమ్ (2 నాటౌట్) మిడ్వికెట్లో షాట్ కొట్టింది. దీప్తి శర్మ త్రో వేసేలోపు జహనార, కెప్టెన్ సల్మా ఖాతూన్ డైవ్ చేసి మరీ రెండో పరుగు పూర్తిచేయడంతో భారత ఆనందం ఆవిరైంది. బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ఆసియా కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. చిత్రంగా ఈ టి20 టోర్నమెంట్లో భారత్... పాకిస్తాన్, శ్రీలంకలను అవలీలగానే ఓడించింది. కానీ బంగ్లాదేశ్ చేతిలో వారం వ్యవధిలోనే రెండుసార్లు (లీగ్, ఫైనల్స్) ఓడింది. ఈసారి ట్రోఫీనే మూల్యంగా చెల్లించుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులే చేసింది. సీనియర్ స్టార్ మిథాలీ రాజ్ (11) సహా, స్మృతి మంధాన (7), దీప్తి శర్మ (4) అంతా విఫలమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 56; 7 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. తానియా భాటియా (3), వేద (11), జులన్ (10) ఎవరూ కుదురుగా ఆడలేకపోయారు. ఖదీజా, రుమానా రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాను లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/9) ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో ట్రాక్‌లో పడిన భారత్ పట్టుబిగించింది. కానీ అనుభవజ్ఞురాలైన జులన్ 2 ఓవర్లలోనే 20 పరుగులిచ్చుకుంది. నిగర్ సుల్తానా (24 బంతుల్లో 27; 4 ఫోర్లు), రుమానా అహ్మద్ (22 బంతుల్లో 23; ఫోర్) ఓర్పుగా ఆడటంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి గెలిచింది. -
భారత్ మరో ఘనవిజయం
కౌలాలంపూర్: మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత్ మరో ఘనవిజయాన్ని సాధించింది. ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ గ్యాంగ్.. సోమవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు సాధించారు. భారత ఓపెనర్లు మోనా మెష్రామ్(32), స్మృతీ మంధాన(29) శుభారంభాన్నివ్వగా, అనుజా పటేల్(22), హర్మన్‌ప్రీత్ కౌర్(27 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. దాంతో భారత జట్టు 133 పరుగుల లక్ష్యాన్ని థాయ్‌లాండ్‌కు నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో థాయ్‌లాండ్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 66 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. థాయ్‌లాండ్ క్రీడాకారిణుల్లో నటయా బూచాథామ్(21)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆ తర్వాత చాయ్‌వాయ్(14), సుధిరువాంగ్(12)లే రెండంకెల స్కోరును దాటారు. భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు వికెట్లతో రాణించగా, దీప్తిశర్మ రెండు వికెట్లు సాధించారు. పూనమ్ యాదవ్, పూజా వస్త్రాకర్‌లకు తలో వికెట్ దక్కింది. -
టీమిండియాతో మ్యాచ్; 27 పరుగులకు ఆలౌట్
కౌలాలంపూర్:మహిళల ఆసియా కప్‌లో భాగంగా మలేసియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా భారీ విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ కిన్రారా అకాడమీ ఓవల్ మైదానంలో ఆతిథ్య మలేసియాతో జరిగిన టీ20లో భారత మహిళలు 142 పరుగుల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ గ్యాంగ్ నిర్ణీతో 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మంధాన(2) నిరాశపరిచినా, మరో ఓపెనర్ మిథాలీ రాజ్(97 నాటౌట్; 69 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్(32; 23 బంతుల్లో 4 ఫోర్లు), దీప్తి శర్మ(18 నాటౌట్;12 బంతుల్లో 2ఫోర్లు)లు బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మలేసియా జట్టు 13.4 ఓవర్లలో 27 పరుగులకే చాపచుట్టేసింది. భారత మహిళలు చెలరేగి బౌలింగ్ చేయడంతో మలేసియా ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకుండా వరుస వికెట్లను చేజార్చుకుని ఘోర ఓటమిని చవిచూసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ మూడు వికెట్లతో రాణించగా, అనుజా పటేల్, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లతో మెరిశారు. శిఖా పాండేకు వికెట్‌కు వికెట్ దక్కింది. మలేసియా మహిళల్లో సషా ఆజ్మీ(9)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆరుగురు డకౌట్లగా నిష్క్రమించారు. -
దాయాదిపై దుమ్మురేపింది ఈ యంగ్‌స్టర్సే!
మీర్పూర్: ఆస్ట్రేలియాతో మూడు అంతర్జాతీయ ట్వీ-20 మ్యాచుల సందర్భంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు జస్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా. ఆసిస్ పోరులో టీమిండియాలో చోటు సంపాదించిన ఈ యంగ్‌స్టర్స్ సరిగ్గా నెల తిరిగే సరికి తమ సత్తా ఏమిటో చాటారు. సహజంగా ఎంతో ఒత్తిడి ఉండే దాయాదితో ట్వీ-20 మ్యాచులో ఈ యువ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తమ బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా తమ కెరీర్లో బిగ్గెస్ట్ గేమ్ ఆడారు బుమ్రా, పాండ్యా. జట్టులో సీనియర్ మోస్ట్ ఆటగాడైన ఆశిష్ నెహ్రాకు సరైన సమయంలో తగిన సహకారం అందించడం ద్వారా బూమ్రా, పాండ్యా పాక్ బ్యాటింగ్ లైనప్‌ను ముట్టించడంలో సఫలమయ్యారు. ఆసియా కప్ లో భాగంగా శనివారం జరిగిన టీ-20 మ్యాచులో భారత్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 83 పరుగులకే చాప చుట్టేసిన సంగతి తెలిసిందే. మరో ఆల్‌రౌండర్ దొరికినట్టే! పేస్ బౌలర్ అయిన బూమ్రా పాక్ మ్యాచులో తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లలో అతను ఎనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బూమ్రా విసిరిన 18 బంతుల్లో 16 బంతులు డాట్ బాల్స్ కావడం గమనార్హం. ఇక పాండ్యా మూడు వికెట్లతో ఈ మ్యాచులో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్‌గా నిలిచాడు. మూడు ఓవర్లలో అతను 8 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీశాడు. ఈ ఇద్దరి ఎకానమీ రేటు ఓవర్‌కు మూడు పరుగుల కన్నా తక్కువగా ఉండటం విశేషం. ప్రధానంగా బౌలింగ్ ప్రదర్శనతో ఆద్యంతం ఉత్కంఠ రేపిన మీర్పూర్ ట్వీ-20 మ్యాచులో అసలు హీరోలుగా బౌలర్లే నిలిచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తక్కువ స్కోరుకే పాక్‌ను నిలువరించడంతో టీమిండియా విజయం సులువైంది. ఒకవేళ టార్గెట్ భారీగా ఉండి ఉంటే.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాక్ ను ఎదుర్కోవడంలో ధోనీ బృందానికి ఇబ్బంది పడాల్సి వచ్చేదని ఛేజింగ్ జరిగిన తీరును బట్టి చెప్పొచ్చు. బూమ్రా పేస్ ఆటాక్తో ఆకట్టుకున్నప్పటికీ అందరి దృష్టి ప్రధానంగా పాండ్యా మీదనే నిలిచింది. ఈ బ్యాట్స్‌మన్ తనలో బౌలింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని ఈ మ్యాచ్ ద్వారా చాటాడు. మొత్తంగా టీమిండియాకు తానొక ఆల్‌రౌండర్ కానున్నాడన్న సంకేతాలు ఇచ్చాడు. పిచ్ పేస్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్ ఆశ్విన్‌ను పక్కనబెట్టి నెహ్రా, బూమ్రా, పాండ్యాతో బరిలోకి దిగడం ధోనీ టీమ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోయినా దాయాది పోరులో రాణించిన తీరును బట్టి.. భవిష్యత్తు మరింత మంచి క్రికెట్ వీరి నుంచి ఆశించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఆమిర్ ను ఫీల్డ్ లోనే అభినందించా: కోహ్లీ
మిర్పూర్: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో మూడేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై, క్లీన్ చిట్ తో రీ ఎంట్రీ ఇచ్చి సత్తాచాటుతోన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ కు ఎల్లడలా అభినందనలు లభిస్తున్నాయి. భారత్ తో శనివారం నాటి మ్యాచ్ లో అద్భుత మైన బౌలింగ్ చేసిన ఈ యువ సంచలనం.. కొద్దిసేపు భారత అభిమానులను కంగారు పెట్టాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా ఆమిర్ పై ప్రశంసల జల్లు కురుపించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకునేందుకు వేదికపైకొచ్చిన కోహ్లీ.. వ్యాఖ్యాతతో మాట్లాడుతూ 'అద్భుతంగా బౌలింగ్ చేసిన మొహమ్మద్ ఆమిర్ కు నా అభినందనలు. ఇవాళ అతను బాల్ విసిరిన తీరు నిజంగా అద్భుతం. నిజానికి ఫీల్డ్ లో ఉన్నప్పుడే నేనతన్ని అభినందించా' అని చెప్పాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలం కావటం బాధనిపించిందని, అందుకే ఈ మ్యాచ్ లో కసితీరా ఆడానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై పరుగులు రాబట్టడం అంత సులువేమీకాదని, అయితే కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నించానని వివరించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. పాకిస్థాన్ ను 83 పరుగులకే ఆలౌట్ చేయగా, 15.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసిన భారత్.. పాక్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 బంతుల్లో 49 పరుగులు చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నాలుగు ఓవర్లు వేసిన ఆమిర్ కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. -
పాక్ జట్టు కంటే ధోనీసేనే బెటర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో పోలిస్తే టీమిండియా మెరుగ్గా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ఆసియా కప్‌లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో వికెట్ బౌలింగ్‌కు అనుకూలిస్తే.. ధోనీసేన 170 పరుగులు చేయాల్సిన అవసరం లేదని 130 చాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. '1980ల్లో పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారింది. గత 15 ఏళ్లుగా భారత్ అన్ని ఫార్మాట్లలో బలోపేతమైంది. పాక్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా భారత టి-20 జట్టే మెరుగైనది. ఢాకా మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్లకు వికెట్ అనుకూలించి, బౌన్స్ లభిస్తే.. భారత బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఆడాలి. పాక్ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ధోనీసేన భారీ స్కోరు చేయాల్సిన అవసరం లేదు. 130 పరుగులు చాలు' అని కపిల్ దేవ్ అన్నాడు. -
ప్రాక్టీస్‌కు ధోనీ దూరం
ఢాకా: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు రోజు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గైర్హాజరయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ విశ్రాంతి తీసుకున్నాడు. ధోనీతో పాటు సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా కూడా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్ ఆరంభానికి ముందే ధోనీ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కీపర్/బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ధోనీ పూర్తిగా కోలుకోకున్నా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆడాడు. అయితే పాక్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఆడుతాడా లేదా అనేది కచ్చితంగా తెలియరాలేదు. ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైతే అతని స్థానంలో పార్థివ్ తుది జట్టులోకి రానున్నాడు. శనివారం రాత్రి 7 గంటల నుంచి భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. -
ధోనీ, యువీ.. మధ్యలో కోహ్లీ
ఢాకా: ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో బ్రేకప్.. ఈ మధ్య శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నభారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ.. మళ్లీ జట్టుతో చేరాడు. బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌లో ఆడేందుకు భారత జట్టుతో కలసి కోహ్లీ ఢాకా వెళ్లాడు. ఈ ఈవెంట్లో బుధవారం జరిగే ఆరంభ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఢాకాకు విమానంలో వెళ్తున్నప్పటి ఫొటోను విరాట్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మధ్యలో కూర్చుని కోహ్లీ ఫోజిచ్చాడు. లెజెండర్లతో కలసి ఢాకా వెళ్తున్నానంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆసియా కప్‌తో పాటు వచ్చే నెలలో జరిగే టి-20 ప్రపంచ కప్‌లో ఈ ముగ్గురు క్రికెటర్లు కీలకం. పొట్టి క్రికెట్లో ఇటీవల టీమిండియా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడు టి-20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ధోనీసేన.. ఆ వెంటనే శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.