మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో | Smriti Mandhana Gifts Phone To Special Fan After Ind vs Pak Match: Video | Sakshi
Sakshi News home page

మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో

Published Sat, Jul 20 2024 8:09 PM | Last Updated on Sat, Jul 20 2024 8:24 PM

Smriti Mandhana Gifts Phone To Special Fan After Ind vs Pak Match: Video

భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన గొప్ప మనసు చాటుకుంది. తన చిన్నారి అభిమానిని సంతోష పెట్టేందుకు బహుమతినిచ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక ‍క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా వుమెన్స్‌ ఆసియా టీ20 కప్‌ ఆడేందుకు భారత మహిళా క్రికెట్‌ జట్టు శ్రీలంకకు వెళ్లిన విషయం తెలిసిందే.

శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలి మ్యాచ్‌లోనే గెలుపు నమోదు చేసింది.

పాక్‌ను చిత్తు చేసిన భారత్‌
పాకిస్తాన్‌ విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(29 బంతుల్లో 40), స్మృతి మంధాన (31 బంతుల్లో 45) రాణించారు.

ఇక పాక్‌ను 108 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్‌ బౌలర్‌ దీప్తి శర్మ(3/20)కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

స్పెషల్‌ ఫ్యాన్‌
ఇదిలా ఉంటే.. డంబుల్లా వేదికగా జరిగిన భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ను చూసేందుకు ఓ ‘ప్రత్యేకమైన’ చిన్నారి స్టేడియానికి వచ్చింది. ఆమె పేరు ఆదీషా హెరాత్‌.

ఆదీషాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అలాగే భారత క్రికెటర్‌ స్మృతి మంధాన అంటే మరీ ఇష్టం. అందుకే తన అభిమాన ప్లేయర్‌ను కలుసుకునేందుకు ఆదీషా తల్లి సాయంతో మ్యాచ్‌ వేదిక వద్దకు వచ్చింది.

స్పెషల్‌ ఏబుల్డ్‌ చైల్డ్‌ అయినా ఆదీషాను తన తల్లి వీల్‌చైర్‌లో తీసుకువచ్చారు. ఈ ​క్రమంలో మ్యాచ్‌ అనంతరం స్మృతి మంధాన ఆదీషా దగ్గరికి వెళ్లి పలకరించింది. అంతేకాదు తనకు మొబైల్‌ ఫోన్‌ను బహుమతిగా అందించింది.

సంతోషంగా ఉంది
ఈ విషయంపై స్పందించిన ఆదీషా తల్లి మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మ్యాచ్‌ కచ్చితంగా చూడాలంటూ నా కూతురు పట్టుబట్టింది. భారత జట్టు క్రికెటర్‌ మంధానను కలిశాం.

ఆమె నా కూతురికి ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. తనలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి బహుమతి మేము అస్సలు ఊహించలేదు. నిజంగా ఈ విషయంలో నా కూతురు అదృష్టవంతురాలే’’ అని హర్షం వ్యక్తం చేశారు. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా భారత్‌ తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జట్టుతో తలపడనుంది.

చదవండి: IND Vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?.. నాకైతే అర్థం కావడం లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement