శ్రీలంకలో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరుపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని సెలక్టర్ల విధానాన్ని విమర్శించాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో గెలిచింది.
ఇక ఈ టూర్ ద్వారానే ఐపీఎల్ వీరులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి వాళ్లు అరంగేట్రం చేశారు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అభిషేక్ సెంచరీతో మెరవగా.. రియాన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
ఇదిలా ఉంటే.. జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 27 నుంచి మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ నేపథ్యంలో గురువారం టీ20, వన్డే జట్లను ప్రకటించారు. ఇందులో అనూహ్యంగా రియాన్ పరాగ్ రెండు జట్లలో చోటు దక్కించుకోగా.. అభిషేక్ శర్మకు మాత్రం స్థానం దక్కలేదు.
సెంచరీలు చేసినా పట్టించుకోరా?
అదే విధంగా.. సంజూ శాంసన్‌కు వన్డేల్లో చోటివ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు మేటి స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కూడా పక్కనపెట్టేశారు.
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘శ్రీలంకతో సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో యుజీ చహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు భాగం కాలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ షాకింగ్ ఎమోజీ జతచేశాడు భజ్జీ.
కాగా సంజూ శాంసన్ జింబాబ్వేతో సిరీస్‌లో ఆడగా.. లంకతో టీ20 జట్టులో మాత్రమే చోటు లభించింది. ఇక వన్డేల విషయానికొస్తే చివరగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు.
ఖేల్ ఖతమేనా?
పర్ల్ వేదికగా గతేడాది డిసెంబరులో ఆడిన తన చివరి వన్డేలో సంజూ సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయం అందించాడు. అయినప్పటికీ ఈ కేరళ బ్యాటర్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపడం గమనార్హం.
దీనిని బట్టి అతడిని చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా పరిగణనలోకి తీసుకోరని సంకేతాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌కు ముందు టీమిండియా లంక, ఇంగ్లండ్‌లతో వన్డే సిరీస్‌లు ఆడనుంది.
చదవండి: Ind vs SL: టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా వాళ్లిద్దరు.. దిలీప్ రీఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment