టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా అతడు భారత జట్టుకు మార్గనిర్దేశనం చేయనున్నాడు.
ఈనెల 27 నుంచి ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో గౌతీ సహాయక సిబ్బంది కూడా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో గంభీర్‌తో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెన్ డష్కాటే టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
దిలీప్ రీఎంట్రీ!
అదే విధంగా.. రాహుల్ ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన టి.దిలీప్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, బౌలింగ్ కోచ్ విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొలిక్కిరానట్లు సమాచారం.
సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ భారత బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనం ప్రచురించింది. బీసీసీఐ సన్నిహిత వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొంది.
కాగా మోర్నే మోర్కెల్ సైతం గంభీర్‌తో గతంలో కలిసి పనిచేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా గౌతీ రెండేళ్లు సేవలు అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోర్నే మోర్కెల్ కూడా లక్నో సిబ్బందిలో ఉండటం గమనార్హం.
ఇక శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుతో గంభీర్‌తో పాటు దిలీప్, నాయర్ కూడా సోమవారం బయల్దేరనున్నట్లు సమాచారం. టెన్ డష్కాటే మాత్రం తర్వాత జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఆరోజే గంభీర్ ప్రెస్‌మీట్
టీ20, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబై నుంచి కొలంబోకు సోమవారం పయనం కానున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ సిరీస్‌తో గంభీర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనుండగా.. లంకకు వెళ్లే ముందు అతడు మీడియా ముందుకు రానున్నాడని తెలిపింది.
టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా టీమిండియా శ్రీలంకతో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 జట్టుకు సూర్య, వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment