ఆయుష్ బదోనీ మెరుపులు
శుక్రవారం సెమీస్‌లో అఫ్గానిస్తాన్‌తో ‘ఢీ’
మస్కట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది.
ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్ నదీమ్ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్ సింగ్, సాయికిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment