దాయాదిపై దుమ్మురేపింది ఈ యంగ్‌స్టర్సే!
మీర్‌పూర్: ఆస్ట్రేలియాతో మూడు అంతర్జాతీయ ట్వీ-20 మ్యాచుల సందర్భంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు జస్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా. ఆసిస్ పోరులో టీమిండియాలో చోటు సంపాదించిన ఈ యంగ్‌స్టర్స్ సరిగ్గా నెల తిరిగే సరికి తమ సత్తా ఏమిటో చాటారు.
సహజంగా ఎంతో ఒత్తిడి ఉండే దాయాదితో ట్వీ-20 మ్యాచులో ఈ యువ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తమ బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా తమ కెరీర్‌లో బిగ్గెస్ట్ గేమ్ ఆడారు బుమ్రా, పాండ్యా. జట్టులో సీనియర్ మోస్ట్ ఆటగాడైన ఆశిష్ నెహ్రాకు సరైన సమయంలో తగిన సహకారం అందించడం ద్వారా బూమ్రా, పాండ్యా పాక్ బ్యాటింగ్ లైనప్‌ను ముట్టించడంలో సఫలమయ్యారు. ఆసియా కప్ లో భాగంగా శనివారం జరిగిన టీ-20 మ్యాచులో భారత్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 83 పరుగులకే చాప చుట్టేసిన సంగతి తెలిసిందే.
మరో ఆల్‌రౌండర్ దొరికినట్టే!
పేస్ బౌలర్ అయిన బూమ్రా పాక్ మ్యాచులో తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లలో అతను ఎనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బూమ్రా విసిరిన 18 బంతుల్లో 16 బంతులు డాట్ బాల్స్ కావడం గమనార్హం. ఇక పాండ్యా మూడు వికెట్లతో ఈ మ్యాచులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచాడు. మూడు ఓవర్లలో అతను 8 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీశాడు. ఈ ఇద్దరి ఎకానమీ రేటు ఓవర్‌కు మూడు పరుగుల కన్నా తక్కువగా ఉండటం విశేషం.
ప్రధానంగా బౌలింగ్ ప్రదర్శనతో ఆద్యంతం ఉత్కంఠ రేపిన మీర్‌పూర్ ట్వీ-20 మ్యాచులో అసలు హీరోలుగా బౌలర్లే నిలిచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తక్కువ స్కోరుకే పాక్‌ను నిలువరించడంతో టీమిండియా విజయం సులువైంది. ఒకవేళ టార్గెట్ భారీగా ఉండి ఉంటే.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాక్ ను ఎదుర్కోవడంలో ధోనీ బృందానికి ఇబ్బంది పడాల్సి వచ్చేదని ఛేజింగ్ జరిగిన తీరును బట్టి చెప్పొచ్చు.
బూమ్రా పేస్ ఆటాక్‌తో ఆకట్టుకున్నప్పటికీ అందరి దృష్టి ప్రధానంగా పాండ్యా మీదనే నిలిచింది. ఈ బ్యాట్స్‌మన్ తనలో బౌలింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని ఈ మ్యాచ్ ద్వారా చాటాడు. మొత్తంగా టీమిండియాకు తానొక ఆల్‌రౌండర్ కానున్నాడన్న సంకేతాలు ఇచ్చాడు. పిచ్ పేస్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్ ఆశ్విన్‌ను పక్కనబెట్టి నెహ్రా, బూమ్రా, పాండ్యాతో బరిలోకి దిగడం ధోనీ టీమ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోయినా దాయాది పోరులో రాణించిన తీరును బట్టి.. భవిష్యత్తు మరింత మంచి క్రికెట్ వీరి నుంచి ఆశించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.