ICC ODI World Cup 2023- India Beat Pakistan: వన్డే వరల్డ్‌కప్-2023 మెగా మ్యాచ్‌లో వార్ వన్‌సైడ్ అయింది. చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాకిస్తాన్‌ను మరోసారి చిత్తు చేసింది. సమిష్టి కృషితో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించిది. సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి అభిమానులను ఖుషీ చేసింది.
క్రికెట్ ప్రపంచంలో హై వోల్టేజీ మ్యాచ్‌గా భారత్- పాక్ పోరు ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. దాయాదులు తలపడుతున్నాయంటే ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా అలెర్ట్ అయిపోతారు. మ్యాచ్ ఆసాంతం ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆటగాళ్ల మధుర జ్ఞాపకాలను తమ మనసులో బందించేసుకుంటూ ఉంటారు.
పాక్ బ్యాటర్ల ఆట కట్టించిన టీమిండియా బౌలర్లు
అలాంటిది.. ఈసారి భారత గడ్డపై పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. పటిష్ట పేస్ దళమే తమ బలమన్న పాక్ కనీసం ఈసారైనా ఏదైనా అద్భుతం చేస్తుందా అని ఆ జట్టు అభిమానుల ఆశపడుతున్న వేళ.. టీమిండియా పేసర్లు పాక్ బ్యాటర్ల ఆట కట్టించారు. పాక్ బ్యాటర్లు వర్సెస్ టీమిండియా బౌలర్ల పోరులో వార్ వన్‌సైడ్ చేశారు.
మొదటి దెబ్బ సిరాజ్‌దే
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పొదుపైన బౌలింగ్‌తో ఆరంభం నుంచే ఆకట్టుకుంటే.. మహ్మద్ సిరాజ్ తొలి వికెట్ తీసి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి పునాది వేశాడు. ఇక 50 పరుగులు సాధించి క్రీజులో పాతుకుపోవాలని చూసిన పాక్ సారథి, వన్డే వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ బాబర్ ఆజంను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో అసలు కథ మొదలైంది.
సరైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా
ఆపై.. వరుసగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా సైతం సంచలన స్పెల్‌తో ప్రమాదకారిగా మారుతున్న మహ్మద్ రిజ్వాన్(49)ను బౌల్డ్ చేశాడు. మరుసటి ఓవర్లో షాదాబ్ ఖాన్ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
కుల్దీప్, జడ్డూ తక్కువేం కాదు
మరో స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా హసన్ అలీ(12), హ్యారిస్ రవూఫ్(2)లను అవుట్ చేయడంతో 42.5 ఓవర్లకే పాక్ చాపచుట్టేసింది. 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఫోర్‌తో ఆరంభించాడు.
గిల్ ఇన్నింగ్స్ ముచ్చటేసినా.. ఆనందం కాసేపే
అయితే, పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో షాదాద్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరడం ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ పిచ్‌పై గిల్ పరుగుల వరద పారిస్తాడనుకుంటే.. ఇలా జరిగిందేంటని ఉసూరుమన్నారు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సైతం 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాక్ టూ బ్యాక్ బౌండరీలు బాదిన కోహ్లి కాసేపటికే నిష్క్రమించాడు.
నేనున్నాంటూ బౌండరీలు, సిక్సర్లతో మురిపించిన రోహిత్
ఈ క్రమంలో.. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్‌ను మురిపించాడు. 63 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. సెంచరీతో మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని అభిమానులు కోరుకుంటున్న వేళ షాహిన్ మరోసారి సీన్‌లోకి వచ్చి రోహిత్‌ను అవుట్ చేశాడు.
వార్ వన్‌సైడ్.. కానీ అభిమానులకు ఆ రెండే లోటు
ఇక నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(53), వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(19) కలిసి స్వల్ప లక్ష్య ఛేదనలో చివరి వరకు అజేయంగా నిలిచి భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి మెరుపులు చూడలేకపోవడం, రోహిత్ సెంచరీ మిస్ కావడం ఆయా ఆటగాళ్ల అభిమానులకు తీరని లోటుగా మిగిలి పోయింది.
ఆ రెండూ తప్పితే.. మిగతావన్నీ తీపి జ్ఞాపకాలుగానే మిగిలి పోతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా టీమిండియా తమ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు, రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా దాయాది పాకిస్తాన్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందిన ఈ మ్యాచ్‌లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: Ind Vs Pak: రిజ్వాన్ ‘ఓవరాక్షన్’కు కోహ్లి రియాక్షన్ అదిరింది! ఇంకెంత సేపు..
Comments
Please login to add a commentAdd a comment