ICC ODI World Cup 2023- India vs Pakistan: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య శనివారం మ్యాచ్ ఆరంభమైంది. అహ్మదాబాద్ వేదికగా దాయాదులు పోటీకి దిగగా.. లక్ష్య సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం నీలి వర్ణంతో నిండిపోయింది.
రోహిత్ సేనకు మద్దతుగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. టీమిండియాను చీర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్,ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. తొలి ఓవర్లో పాక్ కేవలం 4 పరుగులు మాత్రమే రాబట్టలిగింది.
బుమ్రా పొదుపుగా
అయితే, రెండో ఓవర్లో మరో పేసర్ మహ్మద్ సిరాజ్ 16 పరుగులిచ్చాడు. సిరాజ్ బౌలింగ్లో ఇమామ్ మూడు ఫోర్లు బాదాడు. తదుపరి ఓవర్లో బుమ్రా మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు.
అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన సిరాజ్.. 6 పరుగులివ్వగా.. అనంతరం బుమ్రా 5వ ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కేవలం ఒక్క పరుగుకే పాక్‌ను పరిమితం చేశాడు.
తొలి వికెట్ తీసిన సిరాజ్
ఇక ఆ తర్వాత వరుస ఓవర్లలో సిరాజ్ 5, బుమ్రా 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్.. అబ్దుల్లా షఫీక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. పాక్ తొలి వికెట్ కోల్పోయింది. అప్పటికి పాక్ స్కోరు 41.
తర్వాత హార్దిక్ పాండ్యా ఓవర్లో 7 పరుగులు రాబట్టిన పాకిస్తాన్.. 10వ ఓవరల్లో సిరాజ్ బౌలింగ్‌లో ఒక్క పరుగుకే పరిమితమైంది. ఇలా పవర్ ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేదు.
పాక్ గుండు సున్నా.. రోహిత్ ఒక్కడే
కాగా 2023 ఏడాదిలో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆడిన 18 వన్డేల్లో పవర్ ప్లేలో ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు. మరోవైపు.. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కడే 16 ఇన్నింగ్స్‌లో కలిపి పవర్ ప్లేలో ఏకంగా 27 సిక్సర్లు బాదడం విశేషం.
నెట్టింట హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ సందడి
ఇందుకు సంబంధించిన గణాంకాలను నెట్టింట షేర్ చేస్తూ హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ పాక్ జట్టును టీజ్ చేస్తున్నారు. ‘‘మీరు 0, రోహిత్ ఒక్కడే 27.. ఇదీ మీ లెవల్ వారెవ్వా సిక్సర్ల కింగ్’’ అంటూ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీమిండియా సారథి వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా సిక్సర్ల రారాజుగా రికార్డు సాధించాడు.
గేల్ రికార్డు బద్దలు కొట్టిన రో‘హిట్’
మూడు ఫార్మాట్లలో కలిపి 556 సిక్సర్లు పూర్తి చేసుకుని యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు(553) బద్దలు కొట్టాడు. కాగా అహ్మదాబాద్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో పాకిస్తాన్ 125 పరుగులు స్కోరు చేసింది. సిరాజ్, పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కాయి.
చదవండి: WC 2023: ముష్ఫికర్- షకీబ్ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్- సచిన్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment