పాక్‌కు చుక్కలు.. ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు! అతడొక్కడే.. | WC 2023 Ind vs Pak: Bowlers Rule Roost India Bundle Out Pakistan For 191 | Sakshi
Sakshi News home page

Ind Vs Pak: పాక్‌ బ్యాటర్లకు చుక్కలు.. వారెవ్వా.. ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు! అతడొక్కడే పాపం..

Published Sat, Oct 14 2023 5:45 PM | Last Updated on Sat, Oct 14 2023 6:24 PM

WC 2023 Ind vs Pak: Bowlers Rule Roost India Bundle Out Pakistan For 191 - Sakshi

ICC ODI World Cup 2023- India vs Pakistan: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా పేసర్లు అదరగొట్టారు. అద్భుత బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు. మొతేరాలో వికెట్ల మోత మోగించారు. ఐసీసీ టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లో దాయాదులు భారత్‌-పాక్‌  తలపడుతున్నాయి.

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. నాయకుడి నమ్మకాన్ని నిలబెడుతూ.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ శుభారంభం అందించాడు.

తొలి వికెట్‌ అందించిన సిరాజ్‌
వరుస ఓవర్లలో మహ్మద్‌ సిరాజ్‌తో కలిసి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్లో పాక్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌(20)ను ఎల్బీడబ్ల్యూ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు.

12.3వ ఓవర్లో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(36)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 24.3వ ఓవర్లో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు అంపైర్‌ కాల్‌తో లైఫ్‌ లభించగా.. అతడు 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఒకే ఓవర్లో కుల్దీప్‌ యాదవ్‌కు రెండు వికెట్లు
అయితే, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత మూడో బంతికి సిరాజ్‌.. బాబర్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసి టీమిండియాకు మూడో వికెట్‌ అందించాడు. అనంతరం చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 33వ ఓవర్లో అద్భుతం చేశాడు. రెండో బంతికి సౌద్‌ షకీల్‌(6)ను ఎల్బీడబ్ల్యూ చేసిన కుల్దీప్‌.. ఆఖరి బాల్‌కు ఇఫ్తికర్‌ అహ్మద్‌(4)ను బౌల్డ్‌ చేశాడు.

బుమ్రా వరుస ఓవర్లలో ఆ ఇద్దరినీ బౌల్డ్‌ చేసి
ఇక 34 ఓవరల్లో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 49వ పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. బుమ్రా సంచలన రీతిలో అతడిని బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ మరుసటి ఓవర్లో షాదాబ్‌ ఖాన్‌ను కూడా బౌల్డ్‌ చేసి పారేశాడు.

మనబౌలర్ల దెబ్బ మామూలుగా లేదు
ఇలా వరుస వికెట్ల క్రమంలో హార్దిక్‌ పాండ్యా మహ్మద్‌ నవాజ్‌(4)ను.. రవీంద్ర జడేజా హసన్‌ అలీ(12), హ్యారిస్‌ రవూఫ్‌(ఎల్బీడబ్ల్యూ- 2)లను పెవిలియన్‌కు పంపడంతో పాకిస్తాన్‌ కథ 42.5 ఓవర్లకే ముగిసిపోయింది.

ఐదుగురూ సరిసమానంగా.. అతడొక్కడే పాపం
టీమిండియా బౌలర్లలో పేసర్లు సిరాజ్‌, బుమ్రా, పాండ్యా.. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు తీసి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనంలో ఐదుగురు సరిసమానంగా పంచుకున్నారు. 2 ఓవర్ల బౌలింగ్‌ వేసిన పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రం ఒట్టిచేతులతో మిగిలిపోయాడు. 36 పరుగుల తేడాలో పాక్‌ 8 వికెట్లు కోల్పోయిందంటే మన బౌలర్ల ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆల్‌ ది బెస్ట్‌
సంచలన స్పెల్స్‌తో పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో టీమిండియా బౌలర్లపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 192 పరుగుల విజయ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో పాక్‌పై ఎనిమిదో విజయం నమోదు చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

చదవండి: న్యూజిలాండ్‌కు బిగ్‌.. కేన్‌ మామ వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement