కౌలలాంపుర్ : ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ టైటిల్ నెగ్గి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పసికూన బంగ్లా ఆరు సార్లు చాంపియన్ అయిన భారత జట్టును అనూహ్యంగా ఓడించింది. అయితే బంగ్లా మహిళల విజయం వెనుక మరో భారత మహిళా క్రికెటర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత మాజీ క్రికెటర్ అంజూ జైన్ బంగ్లాకోచ్‌గా ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. గత నెల దక్షిణాఫ్రికాలో పర్యటించిన బంగ్లాదేశ్ దారుణ ఓటములను మూటగట్టుకుంది. వన్డే (5-0), టీ20 (3-0)లతో క్లీన్‌స్వీప్ అయి వెనుదిరిగింది. ఈ పరాజయాలను తీవ్రంగా పరిగణించిన ఆ దేశ బోర్డు వెంటనే కోచ్‌ను మార్చేసింది. అప్పటి కోచ్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ కాపెల్‌ను తొలిగించి భారత మాజీ వికెట్ కీపర్ అంజూ జైన్ నియమించింది. ఈ పరిస్థితిల్లో బంగ్లా ఆసియాకప్‌లో రాణిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అంజూ జైన్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా టైటిల్ గెలిచేలా చేశారు.
బంగ్లా మహిళా జట్టు కోచ్, భారత మాజీ క్రికెటర్ అంజూ జైన్
ఈ విజయానంతరం ఆమె మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాను. దీన్ని ఓ పెద్ద సవాల్‌గా స్వీకరించాను. ఆ సమయంలో బంగ్లా జట్టు చాలా దారుణ స్థితిలో ఉంది. నేను కేవలం వారిలో ఉత్సహాన్ని నింపే ప్రయత్నం చేశాను. ఈ విజయం జట్టుకు, వ్యక్తిగతంగా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం నేను జట్టులోని బలహీనతలను గుర్తించాను. దానికి అనుగుణంగా నా ప్రణాళికలను అమలు చేశాను. ఫైనల్ గెలవడంలో ఎలాంటి మంత్రం లేదు. ప్రతి మ్యాచ్‌లో మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశాం. ఎవరూ కూడా భారత్‌తో లక్కీగా గెలిచారని అనవద్దు అని ఈ మ్యాచ్‌కు మందు ప్రతి క్రికెటర్‌కు చెప్పా.. అని ఈ భారత మాజీ క్రికెటర్ తెలిపారు.
ఒత్తిడితోనే భారత్ చిత్తు..
ఆరుసార్లు చాంపియన్, టోర్నీలో బంగ్లాపై ఓటమి చెందడంతో భారత్ ఒత్తిడికి లోనైందన్నారు. తమ జట్టుకు ఇది తొలి ఫైనల్ అయినప్పటికీ తమ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా రాణించారని తెలిపారు. ఇక అంజూ జైన్ 2012 టీ20 , 2013 వన్డే ప్రపంచకప్ టోర్నీలకు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించారు. భారత్ తరపున ఆమె 65 వన్డేలు, 8 టెస్ట్‌లకు ప్రాతినిథ్యం వహించి 2005లో రిటైర్మెంట్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment