
కౌలాలంపూర్: ఫైనల్లో అది ఫైనల్ ఓవర్... బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. బంగ్లా చేతిలో 5 వికెట్లున్నా... భారత బౌలర్ల ప్రదర్శన దృష్ట్యా బంగ్లాదేశ్‌కు కష్టతరమే. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్వయంగా బౌలింగ్‌కు దిగింది. తొలి మూడు బంతుల్లో 1, 4, 1లతో ఆరు పరుగులిచ్చింది. ఇక 3 బంతుల్లో 3. చాలా ఈజీ. అయితే అప్పుడే కౌర్ మ్యాజిక్ మొదలైంది. నాలుగో బంతికి సంజిదా ఇస్లామ్‌ను ఔట్ చేసింది. ఐదో బంతికి రుమానా అహ్మద్ రనౌటైంది. ఒక పరుగొచ్చింది. దీంతో ఒక్కసారిగా భారత్ శిబిరంలో ఎక్కడలేని ఆనందం. కానీ చివరి బంతికి జహనార ఆలమ్ (2 నాటౌట్) మిడ్‌వికెట్‌లో షాట్ కొట్టింది. దీప్తి శర్మ త్రో వేసేలోపు జహనార, కెప్టెన్ సల్మా ఖాతూన్ డైవ్ చేసి మరీ రెండో పరుగు పూర్తిచేయడంతో భారత ఆనందం ఆవిరైంది. బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ఆసియా కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. చిత్రంగా ఈ టి20 టోర్నమెంట్‌లో భారత్... పాకిస్తాన్, శ్రీలంకలను అవలీలగానే ఓడించింది. కానీ బంగ్లాదేశ్ చేతిలో వారం వ్యవధిలోనే రెండుసార్లు (లీగ్, ఫైనల్స్) ఓడింది. ఈసారి ట్రోఫీనే మూల్యంగా చెల్లించుకుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులే చేసింది. సీనియర్ స్టార్ మిథాలీ రాజ్ (11) సహా, స్మృతి మంధాన (7), దీప్తి శర్మ (4) అంతా విఫలమయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (42 బంతుల్లో 56; 7 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. తానియా భాటియా (3), వేద (11), జులన్ (10) ఎవరూ కుదురుగా ఆడలేకపోయారు. ఖదీజా, రుమానా రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాను లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/9) ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో ట్రాక్‌లో పడిన భారత్ పట్టుబిగించింది. కానీ అనుభవజ్ఞురాలైన జులన్ 2 ఓవర్లలోనే 20 పరుగులిచ్చుకుంది. నిగర్ సుల్తానా (24 బంతుల్లో 27; 4 ఫోర్లు), రుమానా అహ్మద్ (22 బంతుల్లో 23; ఫోర్) ఓర్పుగా ఆడటంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment