సిల్హెట్: ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. ఈ క్రమంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. ఇలాంటి నేపథ్యంలో నేడు తుది పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
సమష్టి ప్రదర్శనతో...
లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడం మినహా ఓవరాల్‌గా టోర్నీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అన్ని మ్యాచ్‌లు (7) ఆడిన ముగ్గురు ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ అత్యధిక పరుగులు (215) సాధించగా, దీప్తి శర్మ అత్యధిక వికెట్లు (13) తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. షఫాలీ వర్మ కూడా ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు సానుకూలాంశం. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (4 ఇన్నింగ్స్‌లలో కలిపి 83 పరుగులు) మాత్రం ఆశించిన రీతిలో ఆడలేకపోయినా, ఫైనల్లోనైనా చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. దీప్తి శర్మతో పాటు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌ల స్పిన్ ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగలదు. దీప్తి సూపర్ ఫామ్‌లో ఉండటంతో ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు. భారత్‌తో పోలిస్తే చమరి అటపట్టు కెప్టెన్సీలోని శ్రీలంక జట్టు బలహీనమనేది వాస్తవం. అయితే పాక్‌తో సెమీఫైనల్లో ఆ జట్టు చివరి బంతి వరకు కనబర్చిన స్ఫూర్తిదాయక ప్రదర్శన చూస్తే తేలిగ్గా ఓటమిని అంగీకరించే తరహా టీమ్ మాత్రం కాదని తెలుస్తోంది. తుది పోరులో ఆ జట్టు పోరాటం ఎంత వరకు సఫలం అవుతుందనేది చెప్పలేం.
Women Asia Cup 2022: ఏడో టైటిల్ వేటలో భారత్
Published Sat, Oct 15 2022 6:32 AM | Last Updated on Sat, Oct 15 2022 11:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment