సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్‌లో మేఘన నిష్క్రమించింది.
తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్‌గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment