Meghna
-
బిడ్డ మరణం తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): కళ్ల ముందే కన్న కూతురు మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగిపోయింది. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న కుమార్తె, భార్య నిముషాల వ్యవధిలో ప్రాణాలు విడవడంతో వారి మృతదేహాల వద్ద కన్నీటిపర్యంతమైన భర్తను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఈ హృదయ విదారక ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం ద్వారకానగర్‌కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మూడేళ్ల కిందట దేవరాపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని అపార్టుమెంట్లో భార్య ఉషారాణి (51), మానసిక దివ్యాంగురాలైన కుమార్తె సాయి మేఘన (18)తో నివాసం ఉంటున్నారు. సాయి మేఘన తరచూ ఫిట్స్‌తో బాధపడుతుండేది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఉదయం సాయి మేఘనకు ఫిట్స్ రావడంతో ఇంటిలో పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి అదే అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చిచూసి సాయి మేఘన మృతి చెందినట్లు చెప్పారు. అప్పటి వరకు బాగానే ఉన్న తన కుమార్తె చనిపోయిందన్న విషయం తెలిసి ఆ మాతృమూర్తి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కూతురు మరణవార్తను బంధువులకు ఫోన్లో చెబుతూనే ఉషారాణి గుండెపోటుకు గురై పక్కనే ఉన్న సోఫాలో కుప్పకూలిపోయింది. ఈ హటాత్ఫరిణామాన్ని చూసిన వారంతా ఆమె స్పృహ తప్పి పడిపోయిందని భావించి ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఆమె ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి మరలా వైద్యుడ్ని పిలిచారు. ఆయన వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య, కుమార్తె తనను ఒంటరి చేసి వెళ్లిపోయారని, తాను ఎవరి కోసం బతకాలని నిమ్మకాయల శ్రీనివాసరావు వారి మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి హృదయాలను కలిచివేసింది. నిముషాల వ్యవధిలోనే తల్లీ కుమార్తె మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సాయ ంత్రం తల్లీ కూతుళ్లకు అంత్యక్రియలు నిర్వహించారు. -
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్‌ఫుల్‌గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
ISSF Junior World Cup 2023 : గురి తప్పలేదు!
చిన్నప్పుడు విల్లు ఎక్కుపెట్టింది... లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు పిస్టల్ గురిపెట్టింది... వరుసగా పతకాలు సాధిస్తోంది. ఆ మధ్యలో రైఫిల్‌తో కూడా సాధన చేసింది... మేఘన సాదుల. ‘నాన్న దగ్గర వెపన్ చూస్తూ పెరిగాను మరి’... అంటూ... షూటింగ్ ప్రాక్టీస్... సాధించిన పతకాల గురించి చెప్పింది. హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్న మేఘన సాదుల... అంతర్జాతీయ క్రీడాకారిణి. లక్ష్యానికి గురి పెట్టిందంటే పతకం తోనే వెనుదిరుగుతుంది. గడచిన జూన్‌లో సూల్ (జర్మనీ)లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది. అంతకంటే ముందు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్, భోపాల్‌లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్‌లోనూ పతకాలు సాధించింది, ఖేలో ఇండియా స్కీమ్‌కి కూడా ఎంపికైంది. ఈ నెలలో సౌత్‌కొరియాలో జరిగే పోటీల్లో పాల్గొననుంది. షూటింగ్లో బుల్లెట్లా దూసుకుపోతున్న మేఘన షూటింగ్ విషయాలతోపాటు తన ఇష్టాలు, అభిరుచులను సాక్షితో పంచుకుంది. నాన్నే నాకు ఆదర్శం మా నాన్న సారంగపాణి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతస్థాయి అధికారి. నాన్నే నా రోల్‌మోడల్. నాకు నాన్న వెపన్ మీద క్రేజ్ ఉండేది. కానీ యూనిఫామ్ సర్వీస్‌లోకి రావాలనే ఆసక్తి పెద్దగా కలగలేదు. బుల్లెట్ ఎలా లోడ్ చేస్తారు, ఎలా ఎయిమ్ చేస్తారనే ఆసక్తి పిల్లలకు సహజంగానే ఉంటుంది. అయితే నాకు సిక్స్త్ క్లాస్‌లో ఆర్చరీ (విలువిద్య) ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. ఖమ్మం ఆర్చరీ అసోసియేషన్‌లో పుట్టా శంకరయ్య నా మెంటార్. టెన్త్‌క్లాస్ వరకు కంటిన్యూ చేశాను. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ట్వెల్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్న షూటింగ్ రేంజ్లో రైఫిల్ ప్రాక్టీస్ చేశాను. కానీ అదంత సీరియస్ ప్రాక్టీస్ కాదు. రోజూ పది నిమిషాలకంటే అవకాశం ఉండేది కాదు. సీరియస్‌గా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టింది మాత్రం కరోనా టైమ్‌లోనే. కలా... నిజమా! కరోనా టైమ్‌లో క్లాసులు ఆన్లైన్లో జరిగేవి. ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది. అప్పుడు మా కోచ్ ప్రసన్న కుమార్ సూచనతో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నేను పూర్తిస్థాయిలో పిస్టల్ షూటింగ్ ప్రారంభించిన నాటికి మూడు వారాల్లో రాష్ట్రస్థాయి పోటీలున్నాయి. ఆ పోటీల్లో పాల్గొనడం, గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అదే ఏడాది రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు రావడంతో నా మీద నాకు నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాను. ఉస్మానియా తరఫున ఆల్ ఇండియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. మనదేశం తరఫున ఆడటం గర్వంగా ఉంది. సాంత్వన అమ్మ ఫోన్‌తోనే! ఖేలో ఇండియా క్యాంప్‌లో మాకు సౌకర్యాలు చాలా బాగుంటాయి. నిపుణులు సూచించిన ఆహారం, ప్రాక్టీస్‌కు అనువైన వాతావరణం ఉంటుంది. నేను ఏమాత్రం షూటింగ్లో సరిగ్గా రాణించనట్లు అనిపించినా, మొదట చేసే పని అమ్మకు ఫోన్ చేయడమే. అమ్మ ఇచ్చే కౌన్సెలింగ్ నన్ను తిరిగి నా లక్ష్యం మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. నా ప్రతి మూమెంట్లో మా అమ్మానాన్న, అన్నయ్య ఉంటారు. అన్నయ్య స్పెయిన్‌లో చదువుకుంటున్నాడు. పోటీల్లో పాల్గొనడం ఒకవైపు... ఇంజినీరింగ్‌లో క్లాసులు మరోవైపు... ఈ రెండింటినీ బాలెన్స్ చేయడం కష్టమవుతోంది. అందుకే బీటెక్‌లో ఓ ఏడాది విరామం తీసుకుని ప్రాక్టీస్ మీదనే దృష్టి పెట్టాను. షూటింగ్ లో అత్యున్నత స్థాయికి చేరాలనేది నా ఆకాంక్ష. ఆ తర్వాత బీటెక్ మైనింగ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, సివిల్ లేదా మైనింగ్ ఫీల్డ్‌లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనేది నా ఆశయం. ఇప్పటికైతే ఇదే, ఆ తర్వాత అభిప్రాయం మారవచ్చేమో’’ అని నవ్వేసింది మేఘన. సంగీతంతో స్నేహం ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఉంది. రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాను. మధ్యాహ్న భోజనం తర్వాత రెండు–మూడు గంటల విరామం. సాయంత్రం ఫిట్నెస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఏకాగ్రత సాధన కోసం మెడిటేషన్ చేస్తాను. ఉదయం షూటింగ్ తగ్గినప్పుడు సాయంత్రం ఓ గంట– రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్‌లో బాగా రాణించినప్పటికీ ఒక్కోసారి పోటీల్లో రాణించలేకపోవచ్చు. నాకూ కొన్ని అనుభవాలున్నాయి. అందుకు నాకు నేనుగా ఆలోచించుకుని ఒక రొటీన్‌ని డిజైన్ చేసుకున్నాను. ఇంట్లో ఎలాగైతే షూటింగ్ తర్వాత మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతానో, కాంపిటీషన్లకు వెళ్లినప్పుడు కూడా అదే రొటీన్‌ని కొనసాగించాలనుకున్నాను. ఈ గేమ్‌లో లక్ష్యాన్ని ఛేదించడానికి మెదడును చాలా కండిషన్ చేసుకుంటాం. మైండ్ అదే కండిషన్లో కొనసాగకూడదు, తప్పనిసరిగా రిలాక్స్ కావాలి. అలా నాకు మ్యూజిక్ ఒత్తిడిని తగ్గించే బెస్ట్ ఫ్రెండ్. సినిమాలు బాగా చూస్తాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
లండన్: బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్–ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ నియమితులయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు. భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో యూరోగైనకాలజీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఎన్హెచ్ఎస్ ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, వార్విక్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా చేశారు. -
Womens Asia Cup 2022: మేఘన మెరిసె...
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్‌లో మేఘన నిష్క్రమించింది. తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్‌గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది. -
నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం
ఈ ఏడాది 1 మిలియన్ డాలర్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు మన దేశం నుంచి ఇద్దరు టీచర్లు టాప్–50 షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బీహార్‌వాసి సత్యం మిశ్రా కాగా మరొకరు హైదరాబాద్ టీచర్ మేఘనా ముసునూరి. ఈ సందర్భంగా ‘సాక్షి’ మేఘన ముసునూరితో ముచ్చటించింది. ‘‘వాస్తవాన్ని పిల్లలకు చిన్ననాటి నుంచే పరిచయం చేస్తే వారిలో జీవన నైపుణ్యాలు పెరిగి, కోరుకున్నదాంట్లో విజయం సాధిస్తారు’’ అంటూ తను నేర్చుకున్న విషయాలు, పిల్లలకు నేర్పుతున్న నైపుణ్యాల గురించి వివరించారు ఈ టీచర్. ‘‘మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు పిల్లలకు పరిచయం చేయాల్సింది. మన దేశ చారిత్రక, సాంస్కృతిక గొప్పదనం అన్ని దేశాలకన్నా ఎంత ఘనమైనదో తెలియజేయాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం వృద్ధి చెందుతుంది. అదే నేను ఇప్పుడు చేస్తున్న పని. అందులో భాగంగా విద్యావిధానంలో నేను తీసుకు వచ్చిన మార్పులు, చేస్తున్న టీచింగ్ పద్ధతులు గ్లోబల్ టీచర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యేలా చేసింది. 121 దేశాల నుంచి వచ్చిన 8 వేల దరఖాస్తులలో నేను టాప్‌లిస్ట్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా మాచవరం అనే పల్లెటూరులో. చిన్ననాటి నుంచి స్కూల్లో వచ్చిన రకరకాల సందేహాలకు సరైన సమాధాలు దొరికేవి కావు. సమాధానాలు వెతికే ఉద్దేశ్యంతోనే, పిల్లలంతా నాలాగే ఆలోచిస్తారు, వాటిని ఎప్పటికైనా నివృత్తి చేయాలంటే టీచర్ని అవాలనుకునేదాన్ని. నాదైన ప్రత్యేకత తో పిల్లలను తీర్చిదిద్దాలనుకునేదాన్ని. అందుకే, బీఈడీ చేశాను. ప్రత్యేక శిక్షణ పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాం. అక్కడ కూడా పిల్లల సైకాలజీకి సంబంధించిన రకరకాల కోర్సులు పూర్తి చేశాను. శిక్షణ తీసుకున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి అందులోనూ శిక్షణ తీసుకున్నాను. పిల్లలకు తొలి గురువు తల్లే అవుతుంది. అందుకే, పిల్లలు చంటిబిడ్డలుగా ఉన్ననాటి నుంచే వారిని ఎలా పెంచాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పిల్లలను కనాలనుకున్నాను. మా ఇద్దరు కూతుళ్లను పెంచడానికి తీసుకున్న శిక్షణ నన్ను తిరిగి ఇండియా వచ్చేలా చేసింది. 2007 లో కుటుంబంతో పాటు ఇండియాకు వచ్చి మియాపూర్‌లో ‘ఫౌంటెయిన్‌హెడ్ గ్లోబల్ స్కూల్’ పేరుతో ప్లే స్కూల్ ప్రారంభించాను. ప్రత్యేక సిలబస్.. మనమింకా ఎప్పటివో పాత బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాము. భవిష్యత్తు తరాలు చాలా ముందుండాలి. అందుకే, నేను నేర్చుకున్న శిక్షణతో పిల్లలకు నాకు నేనుగా ప్రత్యేక సిలబస్ రూపొందించాను. మొదట నా ఇద్దరు పిల్లలే నా స్కూల్లో విద్యార్థులు. ఆ తర్వాత ఒకరొకరుగా వచ్చి చేరారు. చాలా మంది తల్లిదండ్రులకు నా బోధనా పద్ధతులు నచ్చలేదు. తిరిగి వెళ్లిపోయారు కూడా. అయినా వెనకంజ వేయదలుచుకోలేదు. తీసుకున్న టీచర్లకు నేనకున్న విధంగా శిక్షణ ఇచ్చాను. వాస్తవం తప్పనిసరి ‘భయం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు’ అనేది కూడా నా సిలబస్‌లో భాగమే. స్కూల్లో ఒకే తరహా సిలబస్ కన్నా జీవన నైపుణ్యాలకే ప్రాధాన్యత ఎక్కువ. రోజువారీ జీవన విధానంలో ఉండే ప్రతీ అవసరం తెలియజేసేందుకు కృషి చేస్తాం. పిల్లల కమిటీల ద్వారా గ్రూప్ డిస్కషన్లు ఏర్పాటు చేస్తుంటాం. ఉదాహరణకు.. కూరగాయల సంతను స్కూల్లోనే ఏర్పాటు చేసి, వాటిద్వారా అమ్మడం కొనడమనే ప్రక్రియలు తెలియజేయడం, అలా సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో చెప్పడం, వారు సంపాదించిన మొత్తానికి స్కూల్ నుంచి అంతే డబ్బును జత చేసి, అవసరమైన వారికి దానం చేయడం. ఇలాంటివన్నీ వాస్తవ పద్ధతులతో బోధన చేస్తుంటాం. మొదట ఇంగ్లిషు, గణితం చెప్పేదాన్ని. నాలుగేళ్ల క్రితం పిల్లలకు చైల్డ్ రైట్స్ గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు సోషల్ స్టడీస్ వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఇంగ్లిషు, గణితం, సోషల్ టీచర్ని నేనే. పిల్లలు బాగు చేసిన చెరువు... పర్యావరణం గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టమే అయ్యింది. మొక్కలు, పక్షులు, జంతుజాలమే కాదు. ఒక చెరువును కూడా చూపిస్తే బాగుంటుందనుకున్నాను. మేముండే ప్రాంతం మియాపూర్‌లో ‘మీదికుంట’ చెరువు ఏ మాత్రం అనువుగా లేదని, పిల్లలకు అర్థమయ్యేలా చెబితే, అంత చిన్నపిల్లలు చెరువును శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు. అంత చిన్నపిల్లల్లో సమాజం పట్ల అవగాహన కలిగించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ చెరువు శుభ్రతకు అందరం కలిసి పాటుపడిన సంఘటనలను ఎప్పటికీ మరవలేం. మా పెద్దమ్మాయి ఇంటర్మీడియెట్‌కు వచ్చే సమయానికి జూనియర్ కాలేజీ కూడా ఈ స్కూల్లోనే ఏర్పాటు చేశాను. ప్రతి యేటా దేశంలో 30 రాష్ట్రాల నుంచి సంవత్సరానికి ఒకసారి సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో బోధనా పద్ధతుల గురించి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ప్రక్రియలపైనా చర్చలు జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనవాడు గురువు. భవిష్యత్తు తరాలను తీర్చేదిద్దాలన్న సంకల్పంతోనే ఈ వృత్తిలోకి వచ్చాను. ఇక ముందూ నా బోధనలో ఇదే విధానాన్ని కొనసాగిస్తాను’’ అని వివరించారు ఈ గ్లోబల్ టీచర్. – నిర్మలారెడ్డి -
ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో హైదరాబాదీ!
లండన్: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్‌లిస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్ సత్యం మిశ్రా ఈ ఏడాది ప్రైజ్ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఛైర్ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు. -
టైటిల్ వెరైటీగా ఉంది: పూరీ జగన్నాథ్
పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్ వెరైటీగా ఉంది. ట్రైలర్ బాగుంది. హీరో హీరోయిన్లుగా పవన్, మేఘన బాగా కనిపిస్తున్నారు. అభిరామ్ డైరెక్షన్ బాగుంది. నిర్మాత రాజేష్‌కు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలి’’ అని అన్నారు. ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. -
వెండి తెరపైకి లక్ష్మి అగర్వాల్ జీవితం
లక్ష్మి అగర్వాల్.. ఈ పేరు వినే ఉంటారు. ప్రేమను తిరస్కరించినందుకు ఓ దుర్మార్గుడు జరిపిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి, ఎన్నో ఆపరేషన్ల తర్వాత మామూలు స్థాయికి వచ్చిన అమ్మాయి లక్ష్మి అగర్వాల్. తనకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకుండా ఉండేందుకు, యాసిడ్ దాడి బాధితురాలకు అండగా నిలిచేందుకు ఉద్యమిస్తోంది లక్ష్మి అగర్వాల్. తాజాగా ఈమె బయోపిక్ వెండి తెరపైకి రాబోతుంది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్, లక్ష్మి అగర్వాల్ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. ఈ బయోపిక్‌లో లక్ష్మి అగర్వాల్‌గా, యాసిడ్ దాడి బాధితురాలిగా దీపికా పదుకొనే నటించబోతున్నారట. ‘పద్మావత్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దీపికా పదుకొనే ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలిసింది. దీపికా ఈ చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలిగా నటించడమే కాకుండా.. ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీపికా కూడా ఈ ప్రాజెక్ట్‌ను ధృవీకరించింది. ‘ఈ స్టోరీ విన్నప్పుడు, ఇది కేవలం హింస మాత్రమే కాదు. బలం, ధైర్యం, ఆశ, విజయం అని లోతుగా విశ్లేషిస్తే అర్థమైంది. వ్యక్తిగతంగా, సృజనాత్మకంగా ఈ ప్రాజెక్ట్ నాపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా ఏదో చేయాలనిపించి, నిర్మాతగా కూడా మారాను’ అని దీపికా అన్నారు. ఈ సినిమాతో లక్ష్మి అగర్వాల్ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, యాసిడ్ దాడి తర్వాత ఆమె జీవితం ఎలా మారింది. ఏ మాత్రం అధైర్యపడకుండా.. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఆమె ఉద్యమిస్తున్న తీరు.. అన్నీ వెండితెరపై మెరవనున్నాయి. ప్రేమను తిరస్కరించినందుకు 15 ఏళ్ల వయసులోనే యాసిడ్ దాడికి గురై, చిత్రవధకు గురయ్యారు లక్ష్మి అగర్వాల్. గత కొన్నేళ్లుగా ఆమె యాసిడ్ దాడులు ఆపాలంటూ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 2014లో మెచెల్లీ ఒబామా చేతుల మీదుగా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు సైతం అందుకున్నారు. అప్పటి నుంచి పలు టీవీ షోల్లో కూడా పాల్గొంటున్నారు. 2016 లండన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి ప్రపంచమంతా ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకునేలా చేసుకున్నారు. ప్రస్తుతం బిగ్ స్క్రీన్‌పైకి వస్తున్న లక్ష్మి అగర్వాల్‌లో దీపికా కనిపించబోతుండటంతో, చిత్ర పరిశ్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
టోపీ ఎందుకు పెట్టుకున్నారు?
ప్రస్తుతం పరమత ద్వేషానికి సంబంధించిన అంశాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. దేశ ఔన్నత్యాన్ని పెంచే అనేక అంశాలను కథలుగా ప్రచారంలోకి తీసుకువెళ్లడం వల్ల పరమత సహనం అలవడుతుందని తన అనుభవాన్ని మేఘన అత్వానీ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టింగ్‌ను వినూ మాథ్యూ ఫేస్బుక్లో గత వారం తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ వైరల్ అవుతోంది. ఫేస్బుక్ పోస్టింగ్... ‘ముస్లిములు తల మీద టోపీ ఎందుకు పెట్టుకున్నారు?’ అని కుమార్తె అడిగిన ప్రశ్నకు ఆ తల్లి చెప్పిన చక్కని సమాధానం...నేను ఢిల్లీలో ఊబర్ పూల్‌లో ప్రయాణిస్తున్నాను. ఆ క్యాబ్‌లో అందరి కంటె ముందుగా నేనే ఎక్కాను. నా తరవాత ఒక యువతి తన చిన్న కుమార్తెతో క్యాబ్ ఎక్కారు. మరో కిలో మీటరు ప్రయాణించాక ఒక ముస్లిం యువకుడు క్యాబ్‌లో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్నాడు. తల మీద సంప్రదాయ టోపీ ధరించాడు ఆ యువకుడు. అది చూసి ‘‘అమ్మా, ఈ అంకుల్ టోపీ ఎందుకు పెట్టుకున్నారు? బయట కూడా ఎండ లేదు కదా!’’ అని అడిగింది. అప్పటివరకు క్యాబ్‌లో ఎఫ్ ఎం రేడియో సన్నగా వినిపిస్తోంది. ఆ ముస్లిం యువకుడు డ్రైవర్‌తో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. నేను పుస్తక పఠనంలో మునిగిపోయాను. ఈ ప్రశ్న వినగానే ఒక్కసారిగా నా కళ్లు పుస్తకం నుంచి బయటకు వచ్చాయి. ముస్లిం యువకుడితో డ్రైవర్‌తో మాటలు ఆపేసి, రేడియో వాల్యూమ్ తగ్గించాడు. ఆ పాపకు నేను ఏదో సమాధానం చెప్పబోయాను. అప్పటికే సమాధానంతో సిద్ధంగా ఉన్న ఆ పాప తల్లి ‘‘నేను గుడికి వెళ్లినప్పుడు, మనింటికి పెద్దలు వచ్చినప్పుడు, తాతయ్య వాళ్ల కాళ్లకు నమస్కారం చేసేటప్పుడు తల మీద ముసుగు వేసుకుంటాను కదా! ఇతరుల పట్ల మనం చూపించే గౌరవానికి ప్రతీక’’ అని చెప్పింది తల్లి. ఆ మాటలు బాగానే అనిపించాయి. అంతలోనే మరో సందేహం కలిగి, ‘‘ఈ అంకుల్ ఎవరి పట్ల మర్యాద చూపిస్తున్నాడు. ఇక్కడ గుడి లేదు, అంకుల్ ఎవరి కాళ్లకి నమస్కారం పెట్టట్లేదు, పెద్దలు ఎవ్వరూ లేరు కదా’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు కూడా తల్లి ఎంతో నెమ్మదిగా, ‘‘పెద్దలు కనపడగానే నమస్కారం చేయాలని నేను నీకు నేర్పించాను కదా, అదేవిధంగా అందరి పట్ల గౌరవంగా ఉండమని వాళ్ల పేరెంట్స్ నేర్పించారు అంకుల్‌కి. అంకుల్‌తో పాటు మనమందరం ఉన్నాం కదా’’ అంది తల్లి.ఇంతటి సంస్కారవంతమైన సమాధానం ఎవ్వరూ ఊహించలేదు. ఆ ముస్లిం యువకుడు కూడా ఇటువంటి సమాధానం వస్తుందని అనుకుని ఉండడు. క్యాబ్ ముందుగా నేను ఎక్కడం వల్ల నా డ్రాపింగ్ ముందే వచ్చింది. ఆ తల్లి చెప్పిన సమాధానం గురించి ఆలోచిస్తూ క్యాబ్ దిగేశాను. తోటి వారి గురించి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించాలి. ప్రతి ఇంట్లోను పిల్లలకు తల్లిదండ్రుల ఈ విధంగా బోధించాలి. ఈ తరం పిల్లలకు ఇటువంటివి అలవడాలి అనుకున్నాను. (మేఘనా అత్వానీకి కృతజ్ఞతలతో) – రోహిణి ఆ షేర్ క్యాబ్‌లో తల్లికూతుళ్లు, మేఘన, ఒక ముస్లిం యువకుడు ప్రయాణిస్తున్నారు. ఆ యువకుడు తల మీద ధరించిన తెల్ల టోపీని చూసిన ఆ చిన్నారి తల్లితో, ‘‘సాయంత్రం వేళ ఈ అంకుల్ టోపీ ఎందుకు పెట్టుకున్నారు? ఎండగా కూడా లేదు కదా!’’ అని అడిగింది. ఆ చిన్నారి అమాయకంగా అడిగిన ప్రశ్నకు తల్లి చెప్పిన సమాధానం విన్నాక ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా, మానవత్వానికి ప్రతీకగా అనిపించింది. – వినూ మాథ్యూస్ ఒక్కో నీటి బిందువు కలిస్తేనే సముద్రం అయినట్లు, పరమత సహనం అలవర్చుకోవాలనే విత్తనాన్ని పిల్లలలో నాటితే, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండాలనే ఆలోచన చిగుళ్లు వేసి మహావృక్షం అవుతుంది. పరమత సహనం అలవడుతుంది. దేశంలో పెద్ద పెద్ద మార్పులకు కారణం అవుతాయి. – మేఘన అత్వానీ -
మేఘన డబుల్ ధమాకా
బరేలీ: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి మేఘన జక్కంపూడి సత్తా చాటింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మేఘన– పూర్విషా రామ్ (ఆర్బీఐ) ద్వయం 21–19, 21–14తో మూడో సీడ్ వైష్ణవి భాలే– అనురా ప్రభుదేశాయ్ జంటపై గెలుపొందింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌పోరులో మేఘన– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 22–10, 21–10తో పొదిలె శ్రీ కృష్ణ సాయి కుమార్– రుతుపర్ణ పాండా జోడీని ఓడించింది. సెమీస్‌లో సాయివిష్ణు ఓటమి... గుల్బర్గా: ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల సాయివిష్ణు పోరాటం సెమీస్‌లో ముగిసింది. అండర్–15 బాలుర సింగిల్స్ సెమీస్‌లో మూడోసీడ్ సాయివిష్ణు 16–21, 9–21తో శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరో తెలుగు కుర్రాడు ప్రణవ్‌రావు గంధం ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో టాప్‌సీడ్ ప్రణవ్‌రావు 21–15, 21–12తో ప్రణవ్ కట్టపై గెలుపొందాడు. -
మద్ది అంజన్న సేవలో బుల్లితెర నటులు
జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్లితెర నటులు దర్శించుకున్నారు. శతమానం భవతి సీరియల్, కల్యాణ వైభోగమే తెలుగు ధారావాహికలో నటిస్తున్న శ్రీరామ్, ప్రముఖ నటి మేఘనలు శుక్రవారం దర్శించుకున్నారు. పాపికొండల పరివాహక ప్రాంతంలో జరుగుతున్న కల్యాణ వైభోగమే సీరియల్ చిత్రీకరణకు వచ్చిన వారు అంజన్నను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆశ్వీరచనాలు అందించారు. స్వామిని దర్శించుకున్న ఆర్డీఓ స్వామి వారిని కొత్తగా బాధ్యతలు చేపట్టిన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్ కుమార్ దర్శించుకున్నారు. ఆర్డీఓకు ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించారు. స్వామి వారిచిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. నేడు తమలపాకుల పూజ కార్తీకమాసం మూడో శనివారం కావడంతో స్వామికి లక్ష తమలపాకులతో పూజ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. తొలుత స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం అనంతరం తమలపాకుల పూజ చేస్తామని పేర్కొన్నారు. -
దెయ్యాలున్నాయి జాగ్రత్త!
‘‘ఈ సృష్టిలో దేవుళ్లు ఉన్నది నిజమైతే.. దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం’ అనే అంశంతో ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్‌బిడి) తెరకెక్కించాం. హారర్ – థ్రిల్లర్‌లా సాగుతుందీ చిత్రం’’ అన్నారు దర్శకుడు కృష్ణకార్తీక్. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్. వై ఈ చిత్రం నిర్మించారు. మహిమదన్ యం.యం. సంగీతం అందించిన పాటల సీడీలను మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘కృష్ణకార్తీక్ పక్కా ప్లానింగ్ వల్ల సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి’’ అని నిర్మాత తెలిపారు. మహిమదన్, నిర్మాత లయన్ సాయివెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్ గౌడ్. వై. -
దెయ్యం హ్యాక్ చేస్తే?
సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను హ్యాక్ చేయడం కామన్.. కానీ, దెయ్యాలు హ్యాక్ చేస్తే? ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’. మేఘన, సంతోషి, సల్మాన్ ముఖ్య పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ వై. నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత రామసత్యనారాయణ రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టెక్నికల్ విభాగంలో పని చేసిన నన్ను, నా కథను నమ్మి ఉదయ్‌భాస్కర్ నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు నిర్మిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జనవరి 1న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ఉదయ్‌భాస్కర్ చెప్పారు.. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమేరా: కన్నాకోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్‌గౌడ్ .వై -
సెమీస్‌లో మేఘన, సామియా
ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ హైదరాబాద్: ఆలిండియా సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మేఘన, సామియా ఇమాద్ ఫరూఖీ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. కర్నూలులో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో శుక్రవారం జరిగిన అండర్-13 బాలికల క్వార్టర్స్‌లో మేఘనా రెడ్డి (తెలంగాణ) 14-21, 21-19, 21-14తో విజేత హరీశ్ (కర్నాటక)పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో తస్నీమ్ మీర్ (గుజరాత్) 21-11, 21-9తో అవంతిక పాండే (ఉత్తరప్రదేశ్)పై, అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరప్రదేశ్) 21-14, 21-15తో రీతూ షా (కర్నాటక)పై, శ్రద్ధా హెగ్డే (కర్నాటక) 20-22, 21-16, 21-18తో ఆయేషా సింగ్ (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించారు. అండర్-15 బాలికల క్వార్టర్స్‌లో సామియా ఇమాద్ ఫరూఖీ (తెలంగాణ) 21-9, 21-16తో భార్గవి (తెలంగాణ)పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో రిచా ముక్తిబోధ్ (కర్నాటక) 21-16, 24-22తో అదితి భట్ (ఢిల్లీ)పై, మేధ (కర్నాటక) 21-15, 21-15తో కేయూర (తెలంగాణ)పై, మహేశ్వరి 23-21, 21-14తో మేఘన (తెలంగాణ)పై నెగ్గారు. అండర్-15 బాలుర రెండో రౌండ్ మ్యాచ్‌లో యశ్వంత్ రామ్ (తెలంగాణ) 20-22, 21-10, 21-10తో శ్రీధర్ శ్రీకుమార్ (కేరళ)పై విజయం సాధించాడు. ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు అండర్-13 బాలుర సింగిల్స్: ప్రణవ్ రావు (తెలంగాణ) 21-13, 21-8, 21-4తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై, శశాంక్ (తెలంగాణ) 21-16,7-21, 21-18తో నిఖిల్ ఛత్రిపై, వంశీకృష్ణ (ఏపీ) 19-21, 21-16, 21-12తో అతుల్ జాన్ మాథ్యూ (కేరళ)పై, ఉనీత్ కృష్ణ (తెలంగాణ) 21-12, 21-12తో సంతృప్త్పై గెలుపొందారు. -
బాలిక కిడ్నాప్.. విడుదల
నల్లజర్ల రూరల్ :రాజమండ్రికి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు నల్లజర్ల మండ లం ప్రకాశరావుపాలెం వద్ద వదలి వెళ్లిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అనంతపల్లి ఎస్సై ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం... రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్‌లోని శ్రీహర్షవర్ధన ఇంగ్లిష్ మీడియం స్కూల్లో నర్సరీ చదువుతున్న పందిరి మోహన కృష్ణశ్రీ అలియూస్ మేఘన (4) బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో మేఘనను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లి శ్రీదేవి కాన్వెంట్కు చేరుకోగా, అప్పటికే బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు తాము మేఘన మేనమావలమని చెప్పి బాలికను ఎత్తుకుపోయూరు. సాయంత్రం బాలిక తండ్రికి ఫోన్‌చేసిన దుండగులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. సొమ్మును గౌతమి ఘాట్ వద్దకు తీసుకురావాలని, పోలీసులకు చెబితే పిల్లను చంపేస్తామని బెదిరించారు. ఆ తల్లిదండ్రులు సాహసించి పోలీసులను ఆశ్రయించారు. విషయం వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో తమ పన్నాగం బట్టబయలయ్యే ప్రమాదం ఉందని భావించిన కిడ్నాపర్లు బాలికను తాడేపల్లిగూడెం-నల్లజర్ల రహదారిలో ప్రకాశరావుపాలెం హైస్కూల్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఇదే విషయూన్ని వారి తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతపల్లి ఎస్సై రఘు అక్కడికి వెళ్లి బాలి కను తీసుకొచ్చారు. బాలిక తల్లి శ్రీదేవిది నల్లజర్ల మండలం శింగరాజుపాలెం. ఆమె అక్క నవరాగిణి నల్లజర్లలోని ఓ షాపులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తెలుసున్న వ్యక్తులే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక తండ్రి సాంబశివమూర్తి సీతానగరంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. -
నేల రాలిన విద్యా సుమం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం ఓ విద్యార్థిని బలి తీసుకుంది. మరో బాలికకు తీవ్రగాయల య్యాయి. ఇద్దరు విద్యార్థినులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వివరాలిలా ఉన్నా యి. పాత మధురవాడ ప్రాంతానికి చెందిన పాలవలస మేఘన, చంద్రంపాలెంకు చెందిన ప్రీతి, హనుమాన్ నగర్‌కు చెందిన ప్రత్యూషా, ఉషా ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాల్లో 8 వ తరగతి విద్యార్థులు. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని రాజీవ్‌గృహకల్ప కాలనీలో ఉంటున్న స్వప్నకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆ నలుగురు సైకిళ్లపై వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా కొమ్మాది జంక్షన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరు సైకిళ్లు నడిపించుకుంటూ వస్తున్న సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఒకటి ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ మేఘన సైకిల్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో మేఘన అక్కడికక్కడే మృతి చెందగా , ప్రీతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉషా, ప్రత్యూషలు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ చిన్నారులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్వప్న లబోదిబోమంటూ విలపించింది. తనకు శుభాకాంక్షలు చెప్పడానికి రాకుంటే ఈ సంఘటన జరిగి ఉండేదికాదని రోదించింది. ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ వేగంతో నడపడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు పలువురు ఆరోపించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ కెవి బాలకృష్ణ , ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేపట్టారు. తీరని వేదన: అల్లారుముద్దుగా పెంచుకున్న మేఘన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లితండ్రులు కళ, చిన్నంనాయుడు చేస్తున్న రోదన వర్ణనాతీతం. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ సమీపంలోని దేవుదల గ్రామానికి చెందిన వీరు ఇరవై ఏళ్ల క్రితమే పొట్టకూటి కోసం ఇక్కడికి తరలివచ్చారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఉషారాణి పదో తరగతి, చిన్న కూతురు మేఘన 8 వ తరగతి చదువుతోంది. ఇద్దరు ఆడపిల్లలు ఆటపాటల్లో మంచి ప్రతిభను కనబరుస్తుండటంతో ఆ తల్లితండ్రులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తాము కూలీనాలీ చేసుకుంటున్న తమ పిల్లల ప్రతిభ గలవారని గర్వపడేవారు. కాని ఆ విధికి మా పిల్లలను చూసి కన్నుకుట్టిందో ఏమోగాని చిన్నారి మేఘనను దూరం చేశాడని కళ, చిన్నంనాయుడు వాపోయారు. హెచ్ఎమ్ దిగ్భ్రాంతి: మేఘన మృతిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎమ్ రాజబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంగ్లిషు మీడియం విద్యార్థి అయిన మేఘనఎంతో చలాకీ ఉండేదని ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని ఆవేదన చెందారు.