
కుమార్తె ఫిట్స్‌తో మృతి చెందడంతో తల్లడిల్లిన అమ్మ హృదయం
బిడ్డ మరణించిన కొద్దిసేపటికే కన్నుమూత
అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో విషాద ఘటన
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): కళ్ల ముందే కన్న కూతురు మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగిపోయింది. అప్పటి వరకు తనతో కలిసి ఉన్న కుమార్తె, భార్య నిముషాల వ్యవధిలో ప్రాణాలు విడవడంతో వారి మృతదేహాల వద్ద కన్నీటిపర్యంతమైన భర్తను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఈ హృదయ విదారక ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం ద్వారకానగర్‌కు చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు మూడేళ్ల కిందట దేవరాపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని అపార్టుమెంట్‌లో భార్య ఉషారాణి (51), మానసిక దివ్యాంగురాలైన కుమార్తె సాయి మేఘన (18)తో నివాసం ఉంటున్నారు. సాయి మేఘన తరచూ ఫిట్స్‌తో బాధపడుతుండేది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం ఉదయం సాయి మేఘనకు ఫిట్స్ రావడంతో ఇంటిలో పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను ఎంత లేపినా లేవకపోవడంతో అనుమానం వచ్చి అదే అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న వైద్యుడిని పిలిచారు. ఆయన వచ్చిచూసి సాయి మేఘన మృతి చెందినట్లు చెప్పారు.
అప్పటి వరకు బాగానే ఉన్న తన కుమార్తె చనిపోయిందన్న విషయం తెలిసి ఆ మాతృమూర్తి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కూతురు మరణవార్తను బంధువులకు ఫోన్‌లో చెబుతూనే ఉషారాణి గుండెపోటుకు గురై పక్కనే ఉన్న సోఫాలో కుప్పకూలిపోయింది. ఈ హటాత్ఫరిణామాన్ని చూసిన వారంతా ఆమె స్పృహ తప్పి పడిపోయిందని భావించి ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఆమె ఎంతకీ లేవకపోవడంతో అనుమానం వచ్చి మరలా వైద్యుడ్ని పిలిచారు. ఆయన వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
భార్య, కుమార్తె తనను ఒంటరి చేసి వెళ్లిపోయారని, తాను ఎవరి కోసం బతకాలని నిమ్మకాయల శ్రీనివాసరావు వారి మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి హృదయాలను కలిచివేసింది. నిముషాల వ్యవధిలోనే తల్లీ కుమార్తె మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సాయ ంత్రం తల్లీ కూతుళ్లకు అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment