ఈ ఏడాది 1 మిలియన్ డాలర్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు మన దేశం నుంచి ఇద్దరు టీచర్లు టాప్–50 షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బీహార్‌వాసి సత్యం మిశ్రా కాగా మరొకరు హైదరాబాద్ టీచర్ మేఘనా ముసునూరి. ఈ సందర్భంగా ‘సాక్షి’ మేఘన ముసునూరితో ముచ్చటించింది. ‘‘వాస్తవాన్ని పిల్లలకు చిన్ననాటి నుంచే పరిచయం చేస్తే వారిలో జీవన నైపుణ్యాలు పెరిగి, కోరుకున్నదాంట్లో విజయం సాధిస్తారు’’ అంటూ తను నేర్చుకున్న విషయాలు, పిల్లలకు నేర్పుతున్న నైపుణ్యాల గురించి వివరించారు ఈ టీచర్.
‘‘మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు పిల్లలకు పరిచయం చేయాల్సింది. మన దేశ చారిత్రక, సాంస్కృతిక గొప్పదనం అన్ని దేశాలకన్నా ఎంత ఘనమైనదో తెలియజేయాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం వృద్ధి చెందుతుంది. అదే నేను ఇప్పుడు చేస్తున్న పని. అందులో భాగంగా విద్యావిధానంలో నేను తీసుకు వచ్చిన మార్పులు, చేస్తున్న టీచింగ్ పద్ధతులు గ్లోబల్ టీచర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యేలా చేసింది. 121 దేశాల నుంచి వచ్చిన 8 వేల దరఖాస్తులలో నేను టాప్‌లిస్ట్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉంది.
నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా మాచవరం అనే పల్లెటూరులో. చిన్ననాటి నుంచి స్కూల్లో వచ్చిన రకరకాల సందేహాలకు సరైన సమాధాలు దొరికేవి కావు. సమాధానాలు వెతికే ఉద్దేశ్యంతోనే, పిల్లలంతా నాలాగే ఆలోచిస్తారు, వాటిని ఎప్పటికైనా నివృత్తి చేయాలంటే టీచర్‌ని అవాలనుకునేదాన్ని. నాదైన ప్రత్యేకత తో పిల్లలను తీర్చిదిద్దాలనుకునేదాన్ని. అందుకే, బీఈడీ చేశాను.
ప్రత్యేక శిక్షణ
పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాం. అక్కడ కూడా పిల్లల సైకాలజీకి సంబంధించిన రకరకాల కోర్సులు పూర్తి చేశాను. శిక్షణ తీసుకున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్‌ని ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి అందులోనూ శిక్షణ తీసుకున్నాను. పిల్లలకు తొలి గురువు తల్లే అవుతుంది. అందుకే, పిల్లలు చంటిబిడ్డలుగా ఉన్ననాటి నుంచే వారిని ఎలా పెంచాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పిల్లలను కనాలనుకున్నాను. మా ఇద్దరు కూతుళ్లను పెంచడానికి తీసుకున్న శిక్షణ నన్ను తిరిగి ఇండియా వచ్చేలా చేసింది. 2007 లో కుటుంబంతో పాటు ఇండియాకు వచ్చి మియాపూర్‌లో ‘ఫౌంటెయిన్‌హెడ్ గ్లోబల్ స్కూల్’ పేరుతో ప్లే స్కూల్ ప్రారంభించాను.
ప్రత్యేక సిలబస్..
మనమింకా ఎప్పటివో పాత బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాము. భవిష్యత్తు తరాలు చాలా ముందుండాలి. అందుకే, నేను నేర్చుకున్న శిక్షణతో పిల్లలకు నాకు నేనుగా ప్రత్యేక సిలబస్ రూపొందించాను. మొదట నా ఇద్దరు పిల్లలే నా స్కూల్లో విద్యార్థులు. ఆ తర్వాత ఒకరొకరుగా వచ్చి చేరారు. చాలా మంది తల్లిదండ్రులకు నా బోధనా పద్ధతులు నచ్చలేదు. తిరిగి వెళ్లిపోయారు కూడా. అయినా వెనకంజ వేయదలుచుకోలేదు. తీసుకున్న టీచర్లకు నేనకున్న విధంగా శిక్షణ ఇచ్చాను.
వాస్తవం తప్పనిసరి
‘భయం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు’ అనేది కూడా నా సిలబస్‌లో భాగమే. స్కూల్లో ఒకే తరహా సిలబస్ కన్నా జీవన నైపుణ్యాలకే ప్రాధాన్యత ఎక్కువ. రోజువారీ జీవన విధానంలో ఉండే ప్రతీ అవసరం తెలియజేసేందుకు కృషి చేస్తాం. పిల్లల కమిటీల ద్వారా గ్రూప్ డిస్కషన్‌లు ఏర్పాటు చేస్తుంటాం. ఉదాహరణకు.. కూరగాయల సంతను స్కూల్లోనే ఏర్పాటు చేసి, వాటిద్వారా అమ్మడం కొనడమనే ప్రక్రియలు తెలియజేయడం, అలా సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో చెప్పడం, వారు సంపాదించిన మొత్తానికి స్కూల్ నుంచి అంతే డబ్బును జత చేసి, అవసరమైన వారికి దానం చేయడం. ఇలాంటివన్నీ వాస్తవ పద్ధతులతో బోధన చేస్తుంటాం. మొదట ఇంగ్లిషు, గణితం చెప్పేదాన్ని. నాలుగేళ్ల క్రితం పిల్లలకు చైల్డ్ రైట్స్ గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు సోషల్ స్టడీస్ వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఇంగ్లిషు, గణితం, సోషల్ టీచర్‌ని నేనే.
పిల్లలు బాగు చేసిన చెరువు...
పర్యావరణం గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టమే అయ్యింది. మొక్కలు, పక్షులు, జంతుజాలమే కాదు. ఒక చెరువును కూడా చూపిస్తే బాగుంటుందనుకున్నాను. మేముండే ప్రాంతం మియాపూర్‌లో ‘మీదికుంట’ చెరువు ఏ మాత్రం అనువుగా లేదని, పిల్లలకు అర్థమయ్యేలా చెబితే, అంత చిన్నపిల్లలు చెరువును శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు. అంత చిన్నపిల్లల్లో సమాజం పట్ల అవగాహన కలిగించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ చెరువు శుభ్రతకు అందరం కలిసి పాటుపడిన సంఘటనలను ఎప్పటికీ మరవలేం.
మా పెద్దమ్మాయి ఇంటర్మీడియెట్‌కు వచ్చే సమయానికి జూనియర్ కాలేజీ కూడా ఈ స్కూల్‌లోనే ఏర్పాటు చేశాను. ప్రతి యేటా దేశంలో 30 రాష్ట్రాల నుంచి సంవత్సరానికి ఒకసారి సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో బోధనా పద్ధతుల గురించి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ప్రక్రియలపైనా చర్చలు జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనవాడు గురువు. భవిష్యత్తు తరాలను తీర్చేదిద్దాలన్న సంకల్పంతోనే ఈ వృత్తిలోకి వచ్చాను. ఇక ముందూ నా బోధనలో ఇదే విధానాన్ని కొనసాగిస్తాను’’ అని వివరించారు ఈ గ్లోబల్ టీచర్.
– నిర్మలారెడ్డి
నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం
Published Sun, Sep 12 2021 1:15 AM | Last Updated on Wed, Mar 2 2022 6:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment