Global Teacher prize
-
గ్లోబల్ టీచర్ ప్రైజ్ జాబితాలో ఏపీ టీచర్
లండన్: గ్లోబల్ టీచర్ ప్రైజ్–2023 విజేతను ఎంపిక చేసేందుకు రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లున్నాయి. టాప్–50 జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం జడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న పి.హరికృష్ణతోపాటు బెంగాల్ లోని ఆసన్సోల్ జిల్లాకు చెందిన ప్రాథమిక పాఠశాల టీచర్ దీప్ నారాయణ్ నాయక్ ఉన్నారు. 130 దేశాల నుంచి అందిన 7 వేలకు పైగా నామినేషన్ల నుంచి ఈ 50 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో ఉన్న 10 మంది నుంచి విజేతను ఈ ఏడాది చివర్లో గ్లోబల్ టీచర్ ప్రైజ్ అకాడమీ ప్రకటించనుంది. వర్కీ ఫౌండేషన్, యునెస్కో, యూఏఈకి చెందిన దుబాయ్ కేర్స్ కలిసి ఏ టా విజేతకు ఈ అవార్డు కింద 10 లక్షల అమెరికన్ డాలర్లను అందజేస్తాయి. -
నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం
ఈ ఏడాది 1 మిలియన్ డాలర్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు మన దేశం నుంచి ఇద్దరు టీచర్లు టాప్–50 షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బీహార్‌వాసి సత్యం మిశ్రా కాగా మరొకరు హైదరాబాద్ టీచర్ మేఘనా ముసునూరి. ఈ సందర్భంగా ‘సాక్షి’ మేఘన ముసునూరితో ముచ్చటించింది. ‘‘వాస్తవాన్ని పిల్లలకు చిన్ననాటి నుంచే పరిచయం చేస్తే వారిలో జీవన నైపుణ్యాలు పెరిగి, కోరుకున్నదాంట్లో విజయం సాధిస్తారు’’ అంటూ తను నేర్చుకున్న విషయాలు, పిల్లలకు నేర్పుతున్న నైపుణ్యాల గురించి వివరించారు ఈ టీచర్. ‘‘మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు పిల్లలకు పరిచయం చేయాల్సింది. మన దేశ చారిత్రక, సాంస్కృతిక గొప్పదనం అన్ని దేశాలకన్నా ఎంత ఘనమైనదో తెలియజేయాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం వృద్ధి చెందుతుంది. అదే నేను ఇప్పుడు చేస్తున్న పని. అందులో భాగంగా విద్యావిధానంలో నేను తీసుకు వచ్చిన మార్పులు, చేస్తున్న టీచింగ్ పద్ధతులు గ్లోబల్ టీచర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యేలా చేసింది. 121 దేశాల నుంచి వచ్చిన 8 వేల దరఖాస్తులలో నేను టాప్‌లిస్ట్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా మాచవరం అనే పల్లెటూరులో. చిన్ననాటి నుంచి స్కూల్లో వచ్చిన రకరకాల సందేహాలకు సరైన సమాధాలు దొరికేవి కావు. సమాధానాలు వెతికే ఉద్దేశ్యంతోనే, పిల్లలంతా నాలాగే ఆలోచిస్తారు, వాటిని ఎప్పటికైనా నివృత్తి చేయాలంటే టీచర్ని అవాలనుకునేదాన్ని. నాదైన ప్రత్యేకత తో పిల్లలను తీర్చిదిద్దాలనుకునేదాన్ని. అందుకే, బీఈడీ చేశాను. ప్రత్యేక శిక్షణ పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాం. అక్కడ కూడా పిల్లల సైకాలజీకి సంబంధించిన రకరకాల కోర్సులు పూర్తి చేశాను. శిక్షణ తీసుకున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి అందులోనూ శిక్షణ తీసుకున్నాను. పిల్లలకు తొలి గురువు తల్లే అవుతుంది. అందుకే, పిల్లలు చంటిబిడ్డలుగా ఉన్ననాటి నుంచే వారిని ఎలా పెంచాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పిల్లలను కనాలనుకున్నాను. మా ఇద్దరు కూతుళ్లను పెంచడానికి తీసుకున్న శిక్షణ నన్ను తిరిగి ఇండియా వచ్చేలా చేసింది. 2007 లో కుటుంబంతో పాటు ఇండియాకు వచ్చి మియాపూర్‌లో ‘ఫౌంటెయిన్‌హెడ్ గ్లోబల్ స్కూల్’ పేరుతో ప్లే స్కూల్ ప్రారంభించాను. ప్రత్యేక సిలబస్.. మనమింకా ఎప్పటివో పాత బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాము. భవిష్యత్తు తరాలు చాలా ముందుండాలి. అందుకే, నేను నేర్చుకున్న శిక్షణతో పిల్లలకు నాకు నేనుగా ప్రత్యేక సిలబస్ రూపొందించాను. మొదట నా ఇద్దరు పిల్లలే నా స్కూల్లో విద్యార్థులు. ఆ తర్వాత ఒకరొకరుగా వచ్చి చేరారు. చాలా మంది తల్లిదండ్రులకు నా బోధనా పద్ధతులు నచ్చలేదు. తిరిగి వెళ్లిపోయారు కూడా. అయినా వెనకంజ వేయదలుచుకోలేదు. తీసుకున్న టీచర్లకు నేనకున్న విధంగా శిక్షణ ఇచ్చాను. వాస్తవం తప్పనిసరి ‘భయం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు’ అనేది కూడా నా సిలబస్‌లో భాగమే. స్కూల్లో ఒకే తరహా సిలబస్ కన్నా జీవన నైపుణ్యాలకే ప్రాధాన్యత ఎక్కువ. రోజువారీ జీవన విధానంలో ఉండే ప్రతీ అవసరం తెలియజేసేందుకు కృషి చేస్తాం. పిల్లల కమిటీల ద్వారా గ్రూప్ డిస్కషన్లు ఏర్పాటు చేస్తుంటాం. ఉదాహరణకు.. కూరగాయల సంతను స్కూల్లోనే ఏర్పాటు చేసి, వాటిద్వారా అమ్మడం కొనడమనే ప్రక్రియలు తెలియజేయడం, అలా సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో చెప్పడం, వారు సంపాదించిన మొత్తానికి స్కూల్ నుంచి అంతే డబ్బును జత చేసి, అవసరమైన వారికి దానం చేయడం. ఇలాంటివన్నీ వాస్తవ పద్ధతులతో బోధన చేస్తుంటాం. మొదట ఇంగ్లిషు, గణితం చెప్పేదాన్ని. నాలుగేళ్ల క్రితం పిల్లలకు చైల్డ్ రైట్స్ గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు సోషల్ స్టడీస్ వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఇంగ్లిషు, గణితం, సోషల్ టీచర్ని నేనే. పిల్లలు బాగు చేసిన చెరువు... పర్యావరణం గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టమే అయ్యింది. మొక్కలు, పక్షులు, జంతుజాలమే కాదు. ఒక చెరువును కూడా చూపిస్తే బాగుంటుందనుకున్నాను. మేముండే ప్రాంతం మియాపూర్‌లో ‘మీదికుంట’ చెరువు ఏ మాత్రం అనువుగా లేదని, పిల్లలకు అర్థమయ్యేలా చెబితే, అంత చిన్నపిల్లలు చెరువును శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు. అంత చిన్నపిల్లల్లో సమాజం పట్ల అవగాహన కలిగించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ చెరువు శుభ్రతకు అందరం కలిసి పాటుపడిన సంఘటనలను ఎప్పటికీ మరవలేం. మా పెద్దమ్మాయి ఇంటర్మీడియెట్‌కు వచ్చే సమయానికి జూనియర్ కాలేజీ కూడా ఈ స్కూల్లోనే ఏర్పాటు చేశాను. ప్రతి యేటా దేశంలో 30 రాష్ట్రాల నుంచి సంవత్సరానికి ఒకసారి సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో బోధనా పద్ధతుల గురించి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ప్రక్రియలపైనా చర్చలు జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనవాడు గురువు. భవిష్యత్తు తరాలను తీర్చేదిద్దాలన్న సంకల్పంతోనే ఈ వృత్తిలోకి వచ్చాను. ఇక ముందూ నా బోధనలో ఇదే విధానాన్ని కొనసాగిస్తాను’’ అని వివరించారు ఈ గ్లోబల్ టీచర్. – నిర్మలారెడ్డి -
ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో హైదరాబాదీ!
లండన్: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్‌లిస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్ సత్యం మిశ్రా ఈ ఏడాది ప్రైజ్ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఛైర్ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు. -
21వ శతాబ్దపు పౌరులకు టీచర్‌ను!
రంజిత్ సిన్హ్ దిశాలె...ఇంజనీర్ కాలేకపోయిన ఒక ఉపాధ్యాయుడు. విద్యాబోధనలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చారు. పాఠ్య పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అనుసంధానం చేశారు. విద్యార్థుల మాతృభాషలో వీడియోలు, ఆడియోలు తెచ్చారు... బాలికల హాజరును నూరు శాతానికి పెంచారు. ఈ పద్ధతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఆ తర్వాత... కేంద్రప్రభుత్వం కూడా. ఈ సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సిన్హ్... గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు గెలుచుకున్నారు. మహారాష్ట్ర, షోలాపూర్ జిల్లా, పరేటి వాడీ అనే చిన్న గ్రామం. అందులో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాల లో ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిశాలె. ఆయన గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 పురస్కారానికి ఎంపికయ్యారు. 140 దేశాల నుంచి వచ్చిన పన్నెండు వేల ఎంట్రీలలో రంజిత్ విజేతగా నిలిచారు. గురువారం నాడు లండన్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిటిష్ నటుడు, ప్రసారకర్త స్టీఫెన్ ఫ్రై అవార్డు ప్రకటించిన వెంటనే రంజిత్ తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. విద్యాబోధనలో సాంకేతికతను జోడించి విద్యార్థులను మంచి విద్యనందించిందుకు గాను రంజిత్‌కి ఈ గౌరవం లభించింది. బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది! అతడు పని చేసే పాఠశాలలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండేది. వాళ్లను బడికి రప్పించాలంటే పాఠాలతో వాళ్లను అలరించడమే మార్గం అనుకున్నారాయన. పాఠాలను దృశ్య, శ్రవణ విధానంలో రికార్డు చేశారు. పాఠ్యపుస్తకాలను క్యూఆర్ కోడ్ సౌకర్యం కల్పించడం ద్వారా పిల్లలందరికీ పాఠాలు చేరేటట్లు చేశారు. దాంతో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎనభై ఐదు శాతం మంది ‘ఏ’ గ్రేడ్‌లో పాసయ్యారు. రెండు శాతం ఉన్న బాలికల హాజరు నూరు శాతానికి పెరిగింది. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఆ గ్రామంలో ఇప్పుడు బాల్య వివాహాల్లేవు. రంజిత్ సాధించిన ప్రగతిని గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి రాష్ట్రం మొత్తం క్యూఆర్ కోడ్ సాంకేతికతను దత్తత చేసుకుంది. ఆ తర్వాత భారత విద్యాశాఖ ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) ద్వారా ఈ విధానాన్ని అవలంబించింది. ఈ సాంకేతిక విప్లవం ఇంతటితో ఆగిపోలేదు. దేశం సరిహద్దులు దాటింది. పాకిస్థాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యూఎస్, నార్త్ కొరియా కూడా అనుసరించాయి. మొత్తం 19 వేల మంది విద్యార్థులను అనుసంధానం చేశారు రంజిత్ సిన్హ్. ఆయన అందుకుంటున్న గ్లోబల్ టీచర్ ప్రైజ్ వెనుక ఇంతటి కఠోరదీక్ష ఉంది, అంతకు మించిన అంకిత భావమూ ఉంది. (చదవండి: ట్రావెలింగ్ టీచర్) మార్చే శక్తి టీచర్దే! ‘‘రంజిత్ సింగ్ వంటి ఉపాధ్యాయులు ఉంటే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. సమాజం ఆర్థికంగా పురోగమిస్తుంది. మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది’’ అని యునెస్కో విద్యావిభాగపు అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా గియాన్ని ప్రశంసించారు. రంజిత్ మాత్రం... ‘‘ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. కోవిడ్ మహమ్మారి విద్యారంగాన్ని కూడా కుదిపేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని నూటికి నూరుశాతం నిర్వర్తించారు. విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన విద్యాహక్కును సమర్థంగా అందించారు. కరోనా పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపకుండా కాపాడగలిగారు’’ అన్నారు. ఈ సందర్భంగా రంజిత్ సిన్హ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను ఇరవయ్యో శతాబ్దపు ఉపాధ్యాయుడిని, నేను బోధిస్తున్నది 21వ శతాబ్దపు పౌరులకు. మనం పాఠాలు చెప్పే విధానం కూడా మారాలి. సిలబస్ పందొమ్మిదవ శతాబ్దంలో, సాంకేతిక విధానం 18వ శతాబ్దంలోనే ఉండిపోయింది. అలా ఉండిపోకూడదు. అందుకే కొత్త సాంకేతిక విధానాన్ని అవలంబిస్తున్నాను’’ అన్నారు. అందరూ విజేతలే! ఈ ఎంపిక ప్రక్రియలో తుది జాబితాలో నిలిచిన పదిమందిలో రంజిత్ విజేత... కాగా మిగిలిన తొమ్మిది మంది కూడా తక్కువవారేమీ కాదు. అంకితభావంతో పని చేసిన వారేనంటూ... వర్కీ ఫౌండేషన్ చేంజ్ డాట్ ఓఆర్జీ ఇచ్చే బహుమతిలో సగం డబ్బును మిగిలిన తొమ్మిదిమందికీ పంచుతున్నట్లు ప్రకటించారు రంజిత్. అలాగే తన సగభాగం డబ్బును మూలనిధిగా ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రోత్సాహకంగా మారుస్తానని కూడా చెప్పారు. ఈ నిర్ణయంతో రంజిత్ మరోసారి ప్రపంచం ప్రశంసలు అందుకున్నారు. ఈ పురస్కారానికి నగదు బహుమతి పది లక్షలు డాలర్లు (ఏడుకోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పైగా). అందులో సగం అంటే ఐదు లక్షల డాలర్లను తొమ్మిది మందికి ఒక్కొక్కరికీ యాభై ఐదు వేల డాలర్ల చొప్పున పంచుతారు. ఇంతకు ముందు... రంజిత్ సిన్హ్ దిశాలె 2016లో కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇన్నోవేటివ్ రీసెర్చర్ ఆఫ్ ద ఇయర్’అవార్డు అందుకున్నారు. 2018లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్స్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2019లో గ్లోబల్ పీస్ బిల్డింగ్ ప్రోగ్రామ్‌తోపాటు పారిస్‌లో మైక్రోసాఫ్ట్స్ ఎడ్యుకేషన్ ఎక్సేంజ్ ఈవెంట్లో పురస్కారాన్ని అందుకున్నారు. -
దాతృత్వ మాస్టారుకు పట్టం
తనను వరించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్స్ అవార్డు పట్టుకుని విద్యార్థులతో కలసి సంతోషం పంచుకుంటున్న కెన్యా ఉపాధ్యాయుడు పీటర్ మొకాయా తాబిచి. దాదాపు పదేళ్లుగా ఆయన ప్రతీ నెలా తన ఆదాయంలో 80 శాతం మొత్తాన్ని పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకే వెచ్చిస్తున్నారు. దీంతో వార్కే ఫౌండేషన్.. అవార్డుతో పాటు రూ.7 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. -
గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో స్వరూప్ రావల్
లండన్: భారత్‌కు చెందిన నటి, ఉపాధ్యాయురాలు స్వరూప్ రావల్ వర్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో టాప్ 10 ఫైనలిస్టులో స్థానం సంపాదించారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభించడం ద్వారా భారతీయ సమాజంలోని పిల్లలలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు చేసిన కృషికి గాను ఆమె పేరు జాబితాలో చేర్చారు. స్వరూప్ ప్రస్తుతం గుజరాత్‌లోని లావడ్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 వేల నామినేషన్ల నుంచి ఆమె పేరు ఎంపిక కావడం విశేషం. వచ్చే నెల దుబాయ్‌లో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఫోరమ్ (జీఈఎస్ఎఫ్) విజేతకు ఈ అవార్డును అందజేయనుంది. విజేతకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు. మాజీ మిస్ ఇండియా, ప్రముఖ నటుడు పరేష్ రావల్ సతీమణి కూడా అయిన స్వరూప్ రావల్ టాప్ 10 జాబితాలో చోటు దొరికినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ‘చాలా కొద్ది మంది మాత్రమే టీచర్ల ప్రతిభను, కష్టాన్ని గుర్తిస్తున్నారు. విద్యను బోధించడం నిజంగా సవాల్ లాంటిదే. ఈ ప్రయాణంలో ప్రతి విజయాన్ని వేడుకగా చేసుకోవాల్సిందే అని నేను నమ్ముతాను. నాతోపాటు అవార్డు రేసులో నిలిచిన వారికి, నిలవని వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను’అని స్వరూప్ అన్నారు. -
6.6 కోట్ల బహుమతి వచ్చినా.. దుకాణంలో చోరీ!
గ్లోబల్ టీచర్ ప్రైజ్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేసి మరీ ఇచ్చే అవార్డు. ఈ అవార్డు కింద దాదాపు రూ. 6.66 కోట్ల మొత్తం ఇస్తారు. కానీ, ఇలాంటి అవార్డు పొందిన ఓ టీచర్... షాపులో వెయ్యి రూపాయల విలువ చేసే జాకెట్ చోరీ చేశారట! అమెరికాలోని ఎడ్జ్కూంబ్ అనే ప్రాంతంలో 'ద సెటర్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్' అనే సంస్థను స్థాపించిన నాన్సా ఆట్వెల్ మొత్తం 127 దేశాలకు చెందిన 1300 మంది పోటీదారులను తోసిరాజని ఈ అవార్డు పొందారు. దుబాయ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. తన స్కూలు అభివృద్ధికి ఈ డబ్బు వినియోగిస్తానని అప్పట్లో చెప్పారు. మార్చి 28వ తేదీన ఆమె డమారిస్కోటా ప్రాంతంలోని ఓ స్టోరుకు వెళ్లారు. అక్కడ హ్యాంగర్‌కు వేలాడుతున్న జాకెట్ తీసుకుని, దాన్ని మడతపెట్టి తన హ్యాండ్ బ్యాగ్‌లో దాచేసుకోడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే, తాను మరో జాకెట్ ఎక్స్చేంజి చేసుకోడానికి వచ్చానని, పాతది ఇచ్చేసి కొత్తది తీసుకున్నానని.. సెక్యూరిటీ సిబ్బంది పొరపాటు పడ్డారని చెబుతున్నారు. కానీ చోరీకి ప్రయత్నించినట్లు ఆమె మీద కేసు పెట్టడంతో కోర్టుకు హాజరై అక్కడ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
టీచర్‌కు రూ. 6.8 కోట్ల ప్రైజ్‌మనీ
దుబాయ్: పాలస్తీనాలోని శరణార్ధి శిబిరంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు హనన్ అల్ హ్రౌబ్ దాదాపు రూ. 6.8 కోట్ల విలువైన గ్లోబల్ టీచర్ ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. భారత్‌కు చెందిన రాబిన్ చౌరాసియాతో పాటు మరో 8 మందిని తుది పోరులో వెనక్కినెట్టి ఈ ఘనతను సాధించారు. దుబాయ్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వీడియో లింక్ ద్వారా పోప్ ప్రాన్సిస్ విజేతను ప్రకటించారు. అనంతరం ‘నేను సాధించాను, విజయం సాధించాను, పాలస్తీనా విజయం సాధించింది’ అంటూ హనన్ పొంగిపో యారు. కేరళ మూలాలున్న వ్యాపారవేత్త సన్ని వార్కే గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను స్థాపించారు. విద్యావృత్తికి అత్యుత్తమ సేవలందించిన వారికి 2015 నుంచి ఈ బహుమతిని ఇస్తున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ నటులతో పాటు బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ తదితరులు పాల్గొన్నారు.