మేనిఫెస్టోకు న్యాయప్రాతిపదిక లేదు: జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు | Sakshi Interview With Former High Court Judge Justice Ramalingeswara Rao | Sakshi
Sakshi News home page

మేనిఫెస్టోకు న్యాయప్రాతిపదిక లేదు: జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు

Published Thu, Oct 26 2023 7:59 AM | Last Updated on Thu, Oct 26 2023 7:59 AM

Sakshi Interview With Former High Court Judge Justice Ramalingeswara Rao

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు న్యాయప్రాతిపదిక లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్లను ఆరు నెలల్లో విచారించాల్సి ఉందన్నారు. అయితే సిబ్బందిలేమి, ఇతర కారణాలతో ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ బాధితుడికి న్యాయం అందడం లేదని చెప్పారు.

స్వతంత్ర సంస్థగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్‌ (ఈసీ).. కేంద్ర ప్రభుత్వ ఆదీన సంస్థగా పనిచేయడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల కమిషన్‌ అధికారుల నియామకం ప్రభుత్వాల పరిధి నుంచి ఏదైనా అత్యున్నత స్థాయి కమిటీకి అప్పగిస్తే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: ఎన్నికల సమయంలో పారీ్టలు సాధ్యాసాధ్యాలను చూడకుండా మేనిఫెస్టో ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచాక వీటిని అమలుచేయకుంటే ప్రజలు ఏమి చేయాలి? 
జవాబు: ఎన్నికల సమయంలో పార్టీలు ఉచితాల పేరుతో ఇష్టం వచి్చనట్లు మేనిఫెస్టో ప్రకటిస్తున్నా యి. దీన్ని ఈసీకి అందజేస్తాయి. అయితే, వాటిని అమలు చేయాల్సిన చట్టబద్ధత పార్టీలకు లేదు. చట్టప్రకారం ఎవరూ ప్రశ్నించలేరు. మేనిఫెస్టో అ మలు చేసి తీరాల్సిందేనని తాము కూడా ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.

ప్రశ్న: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సంస్కరణలు రావాల్సి ఉంది? 
జవాబు: డబ్బున్న వారే ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారే విజయం సాధించి ప్రజలను ఏలుతున్నారు. ఇప్పుడున్న వ్యవస్థలో పేద, మధ్యతరగతికి చెందిన వారు అసెంబ్లీ మెట్లెక్కేందుకు ఆస్కారం లేకుండా ఉంది. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల సేవలు వినియోగించుకోవాలి. ఎన్నికల పరిశీలకులుగా అధికారంలో ఉన్న వారు ఉంటే పారీ్టకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది.

ప్రశ్న: ఎన్నికల పిటిషన్లపై విచారణ ఏళ్లకు ఏళ్లు ఎందుకు పడుతోంది? 
జవాబు: ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 86(7) ప్రకారం రోజువారీ విచారణ చేపట్టయినా ఆరు నెలల్లో తీర్పునివ్వాలి. దురదృష్టవశాత్తు ఇది ఎక్కడా అమలు కావట్లేదు. ఐదేళ్లు దాటినా విచారణ సాగుతుండటంతో బాధితుడికి న్యాయం అందడం లేదు. ఇందులో మార్పు రావాలంటే న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలి. హైకోర్టులో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పు వెల్లడించాలి. దీనిపై సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెబుతున్నా.. అడుగు ముందుకు పడట్లేదు. దీంతో ఇది అక్రమార్కులకు వరంలా మారింది.

ప్రశ్న: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎలా ఉంది? 
జవాబు: కొన్ని దేశాల్లో ఎన్నికల కమిషన్‌ను ప్రజలే ఎన్నుకునే వ్యవస్థ ఉంది. మన వద్ద కూడా అలాంటి వ్యవస్థ వస్తే.. ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుంది. టీఎన్‌ శేషన్, లింగ్డో హయాంలో ఉన్న ఈసీకి.. ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. ఈసీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. దీని నిర్ణయాలు ఎవరికీ లోబడి ఉండవు. అధికారుల నియామకం ప్రభుత్వాల పరిధిలో ఉండటంతో వారు స్వామి భక్తి పరాయణులుగా మారుతున్నారు. ఈ విధానం మారాలి.

ప్రశ్న: ఈసీ అధికారాల్లో కోర్టులు కలుగజేసుకోగలవా? 
జవాబు: ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్‌ పరిధిలోని అంశం. ఆరి్టకల్‌ 324 ప్రకారం ఈసీ స్వతంత్రంగా పనిచేయాలి. ఇందులో కోర్టు కలుగజేసుకోవడం స్వల్పమే. ఏవైనా పిటిషన్లు వచ్చినప్పుడు కోర్టులు విచారణ చేపడతాయి తప్ప.. నేరు గా ఈసీ అధికారాల్లో వేలుపెట్టవు. ఎన్నికల సంస్కరణలు రావాలంటే ఈసీ మారాలి. అప్పుడే ఎన్నికల అక్రమాలకు చెక్‌ పెట్టే అస్కారం ఉంటుంది.

ప్రశ్న: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకంలో సీజేఐ కూడా ఉండాలన్న చర్చ జరిగింది.. కానీ అది అమలు కాలేదు? 
జవాబు: ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని.. ఆ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తుండటంతో కార్యరూపం దాల్చలేదు. ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసి ఈసీ అధికారుల నియామకాన్ని దానికి అప్పగిస్తే సంస్కరణలకు అవకాశం ఉంటుంది.

ప్రశ్న: ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు బాధిత పార్టీ ఫిర్యాదు చేసినా ప్రభుత్వ కాలపరిమితి ముగిసే వరకు స్పీకర్‌ చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు?  
జవాబు: స్పీకర్‌ అంశం శాసనసభకు సంబంధించినది. రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఒకదాని పరిధిలో మరొకటి కలుగజేసుకోవడం స్వల్పమే. ఒకదానిపై మరొకటి గౌరవంతో మెలగాలి. దీంతో స్పీకర్‌ విధుల్లో ఎక్కువగా కోర్టులు కలుగజేసుకోవు. సూచనలు చేస్తాయి తప్ప.. ఆదేశాలివ్వలేవు. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 10 దీని గురించి స్పష్టంగా చెప్పింది.

‘సమత’ కేసుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి
జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు 1982లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 1983–84లో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌లో ఫెలో గా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల రక్షణ కోసం ఈయన వాదించిన కేసు దేశమంతా ‘సమత’కేసుగా ప్రసిద్ధి చెందింది. న్యాయమూర్తిగా 20 వేలకుపైగా తీర్పులిచ్చారు. వీటిలో వందకుపైగా తీర్పులు లా జర్నల్‌లో ప్రచురించారు. ఆయనకు సాహిత్యం, కళలపై మక్కువ ఎక్కువ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement