సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న తొలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు ఏఐసీసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే హైదరాబాద్ శివార్లలో ఈనెల 16,17,18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెపుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైందని వారంటున్నారు.
వాస్తవానికి, ఈనెల 17వ తేదీన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా అనుకుంటోంది. భారీ బహిరంగసభ నిర్వహించి, ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానించి.. ఆమె చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఈలోపే సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ అంశం ముందుకు రావడంతో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు నిర్వహించి, ఆ సమయంలోనే కాంగ్రెస్ అతిరథ మహారథుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఇందుకోసం ఖర్గేను సంప్రదించిన రేవంత్, సీడబ్ల్యూసీ సమావేశాలను తామే నిర్వహిస్తామని కోరినట్టు సమాచారం. అయితే దీనిపై స్పందించిన ఖర్గే.. సీడబ్ల్యూసీ నిర్వహణ అంత ఈజీ కాదని, నిర్వాహకులతో పాటు పార్టీ నేతలు, మీడియా, ఇతరులకు ఇబ్బంది అవుతుందేమో ఆలోచించాలని సూచించినట్టు సమాచారం. కానీ, కచ్చితంగా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని, కావాల్సిన ఏర్పాట్లన్నీ తాము చూసుకుంటామని రేవంత్ భరోసా ఇవ్వడంతో ఖర్గే ఓకే చెప్పినట్టు తెలిసింది.
ఈ సందర్భంగా భారీ సభ కూడా ఏర్పాటు చేయాలని, ఆ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలనే యోచనలో టీపీసీసీ ఉందని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ ‘తొలి సమావేశానికి హైదరాబాద్ వేదిక అవుతుంది. అందుకు పార్టీ కూడా ఓకే చెప్పింది. అయితే, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తేదీలు మారే అవకాశం ఉంది. తేదీలు మారినా సీడబ్ల్యూసీ ఫస్ట్ మీటింగ్ మాత్రం హైదరాబాద్‌లోనే’అని ఆ నాయకుడు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment