సాక్షి, హైదరాబాద్: అలవికాని హామీలు.. అబద్ధాల ఆరోపణలు.. చరిత్ర వక్రీకరణలతో కాంగ్రెస్ సభ సాంతం పరనిందగా సాగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్‌కే ఓట్లు పడతాయనే గ్యారంటే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగసభపై హరీశ్‌రావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టే కాంగ్రెస్ నాయకులు బూటకపు హామీలను ఇస్తున్నారని, ఆ పార్టీ ఇస్తున్న గ్యారంటీలు అన్నీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవేనని విమర్శించారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే..రాష్ట్రానికో మేనిఫెస్టో కాకుండా, హైదరాబాద్ సభలో చెప్పిన గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా.. ఎందుకు చేయలేదు? తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్ ఇలానే బూటకపు హామీలిస్తే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 44 ఎంపీ సీట్లు వచ్చాయని, 2019లో 52 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అజ్ఞానానికి జోహార్లు అని, రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వలేదని, యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చామని చెప్పారు.
కావాలంటే పేపర్లు తిరగేసి తెలుసుకోవాలని సూచించారు. ‘ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా? గుజరాత్ ఎన్నికలపుడు భారత్ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లలేదు..? హుజూరాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి మద్దతివ్వడం మీకు తెలియదా? ఈడీ, సీబీఐలు వేటకుక్కల్లా మా నేతలను వేధించడం మీకు కనిపిస్తలేదా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
నేషనల్ హెరాల్డ్ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మిలాఖాత్ అవడం అన్నది ప్రపంచానికి తెల్సిన విషయమేనని అన్నారు. తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదని, పోరాడి గెలుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ దయతో ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment