Womens T-20
-
Womens Asia Cup 2022: మేఘన మెరిసె...
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో సబ్బినేని మేఘన (53 బంతుల్లో 69; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసింది. దీంతో భారత జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేసియాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మేఘన, షఫాలీ వర్మ (39 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ మేఘన 38 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీని అధిగమించడంతో భారత్ కేవలం 12 ఓవర్లలోనే 100 స్కోరు చేసింది. ఓపెనర్లిద్దరు 13.5 ఓవర్లలో 116 పరుగులు జోడించాక మలేసియా బౌలర్ వినిఫ్రెడ్ దురైసింగం బౌలింగ్‌లో మేఘన నిష్క్రమించింది. తర్వాత రిచా ఘోష్ (19 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో భారత పరుగుల జోరు కొనసాగింది. నూర్ దానియా వేసిన 19వ ఓవర్లో వరుస బంతుల్లో షఫాలీ వర్మ, కిరణ్ నావ్‌గిరె (0) అవుటయ్యారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 5.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆట సాధ్యపడలేదు. తొలి ఓవర్లోనే వినిఫ్రెడ్ (0)ను దీప్తి శర్మ డకౌట్ చేసింది. నాలుగో ఓవర్లో వాన్ జులియా (1)ను రాజేశ్వరి బౌల్డ్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5.2 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా... 16 పరు గులే చేయడం వల్ల మలేసియా అమ్మాయిలు 30 పరుగుల తేడాతో ఓడారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించిన భారత జట్టు నేడు జరిగే మ్యాచ్‌లో యూఏఈతో ఆడుతుంది. -
17 పరుగుల తేడాతో ఆసీస్‌పై భారత్ విజయం
-
6గురు డకౌట్... 27కే ఆలౌట్
కౌలాలంపూర్: మలేసియాతో మ్యాచ్ జరిగింది. భారత మహిళల జట్టు 142 పరుగులతో జయభేరి మోగించింది. ఇందులో అన్నీ విశేషాలే! మలేసియా తరఫున ఆరుగురు డకౌటైతే... ఆ జట్టు 27 పరుగులకే ఆలౌటైంది. అంతేనా... అంటే ఇంకా వుంది. కేవలం ఐదుగురు ఖాతా తెరిచారు. అవి కూడా అంకెలే! ఏ ఒక్కరూ డబుల్ డిజిట్ (సంఖ్య) స్కోరు చేయలేకపోయారు. జట్టు సగం వికెట్లను 5 ఓవర్లలోపే కోల్పోయింది. అది కూడా 12/5... భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ పరుగులివ్వకుండా 2 వికెట్లు తీస్తే, మరో స్పిన్నర్ అనూజా పాటిల్ 9 పరుగులిచ్చి 2, పేసర్ పూజ వస్త్రాంకర్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. ఫలితంగా ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో భారత జట్టు అసాధారణ ఫలితంతో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 142 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓపెనర్, వెటరన్ స్టార్ మిథాలీ రాజ్ (69 బంతుల్లో 97 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (32; 4 ఫోర్లు), దీప్తి శర్మ (18 నాటౌట్) మెరుగ్గా ఆడారు. మలేసియా బౌలర్లు ఐనా హషీమ్, నూర్ జకారియా చెరో వికెట్ తీశారు. తర్వాత మలేసియా లక్ష్యఛేదన మొదలైంది. కానీ తొలి పరుగుతోనే పతనం ప్రారంభమైంది. ఇది క్రమం తప్పకుండా సాగింది. 7కు రెండు, 11కు మూడో వికెట్, 12 పరుగులకే 5 వికెట్లు... 22/7, 26/9, 27 పరుగులకొచ్చే సరికి ఆలౌట్! శషా అజ్మీ (9) టాప్ స్కోరర్ కాగా, దురైసింగం 5, జుమిక అజ్మీ 4 పరుగులు చేశారు. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడుతుంది. -
చెలరేగిన మమత
జింఖానా, న్యూస్‌లైన్: బ్యాట్స్‌వుమన్ మమత (73) అర్ధ సెంచరీ సహాయంతో హైదరాబాద్ జట్టు 13 పరుగుల తేడాతో ఒడిశా జట్టుపై గెలుపొందింది. అఖిల భారత సీనియర్ మహిళల టి20 ఎలైట్ ‘ఎ’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సింధుజా రెడ్డి (27) రాణించింది. స్వాగతిక రెండు వికెట్లు తీసుకుంది. అనంతరం బరిలోకి దిగిన ఒడిశా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వాగతిక (32), మెహతా (22), మొహంతి (19), కాదంబిని (27) చక్కటి ఆట తీరును కనబరిచారు. ఈ విజయంతో హైదరాబాద్ 4 పాయింట్లను సొంతం చేసుకుంది. మహారాష్ట్రపై రైల్వేస్ విజయం మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 4 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై గెలుపొందింది. ఏఓసీ సెంటర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన మహారాష్ట్ర 9 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. ఎస్పీ జాదవ్ 18 పరుగులు చేసింది. రైల్వేస్ బౌలర్ కేడీ పాటిల్ మూడు వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన రైల్వేస్ 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసి నెగ్గింది. మహారాష్ట్ర బౌలర్ శ్వేత మానె 2 వికెట్లు తీసుకుంది. రైల్వేస్ 4 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.