కౌలాలంపూర్: మలేసియాతో మ్యాచ్ జరిగింది. భారత మహిళల జట్టు 142 పరుగులతో జయభేరి మోగించింది. ఇందులో అన్నీ విశేషాలే! మలేసియా తరఫున ఆరుగురు డకౌటైతే... ఆ జట్టు 27 పరుగులకే ఆలౌటైంది. అంతేనా... అంటే ఇంకా వుంది. కేవలం ఐదుగురు ఖాతా తెరిచారు. అవి కూడా అంకెలే! ఏ ఒక్కరూ డబుల్ డిజిట్ (సంఖ్య) స్కోరు చేయలేకపోయారు. జట్టు సగం వికెట్లను 5 ఓవర్లలోపే కోల్పోయింది. అది కూడా 12/5... భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ పరుగులివ్వకుండా 2 వికెట్లు తీస్తే, మరో స్పిన్నర్ అనూజా పాటిల్ 9 పరుగులిచ్చి 2, పేసర్ పూజ వస్త్రాంకర్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. ఫలితంగా ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో భారత జట్టు అసాధారణ ఫలితంతో శుభారంభం చేసింది.
ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 142 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓపెనర్, వెటరన్ స్టార్ మిథాలీ రాజ్ (69 బంతుల్లో 97 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (32; 4 ఫోర్లు), దీప్తి శర్మ (18 నాటౌట్) మెరుగ్గా ఆడారు. మలేసియా బౌలర్లు ఐనా హషీమ్, నూర్ జకారియా చెరో వికెట్ తీశారు. తర్వాత మలేసియా లక్ష్యఛేదన మొదలైంది. కానీ తొలి పరుగుతోనే పతనం ప్రారంభమైంది. ఇది క్రమం తప్పకుండా సాగింది. 7కు రెండు, 11కు మూడో వికెట్, 12 పరుగులకే 5 వికెట్లు... 22/7, 26/9, 27 పరుగులకొచ్చే సరికి ఆలౌట్! శషా అజ్మీ (9) టాప్ స్కోరర్ కాగా, దురైసింగం 5, జుమిక అజ్మీ 4 పరుగులు చేశారు. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment