కమలిని- సనికా చాల్కే(PC: ACC)
జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్(ACC Women's U-19 Asia Cup)లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కౌలాలాంపూర్ వేదికగా భారత జట్టు ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది. అద్భుత ఆట తీరుతో చిరకాల ప్రత్యర్థిని ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
అదరగొట్టిన సోనమ్ యాదవ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కోమల్ ఖాన్ (24; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... యువ భారత బౌలర్లలో సోనమ్ యాదవ్ తన కోటా 4 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.
PC: ACC
కమలిని మెరుపు ఇన్నింగ్స్
అనంతరం భారత జట్టు 7.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 68 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కమలిని మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 44 పరుగులతో అజేయంగా నిలిచింది.
మరో 73 బంతులు మిగిలుండగానే
మరో ఎండ్ నుంచి సనికా చాల్కే (19 నాటౌట్; 3 ఫోర్లు) కమలినికి సహకారం అందించింది. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కమలిని భారీ షాట్లతో విరుచుకుపడటంతో మరో 73 బంతులు మిగిలుండగానే గెలిచింది.
పాక్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కమలినికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు మంగళవారం నేపాల్‌తో తలపడనుంది. కాగా జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీకి మలేషియా ఆతిథ్యం ఇస్తోంది.
చదవండి: WPL: మినీ వేలంలో పదహారేళ్ల ప్లేయర్‌పై కనక వర్షం.. ఎవరీ కమలిని?
Comments
Please login to add a commentAdd a comment