
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లు ఈ ఏడాది మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ను షెడ్యూల్ చేసింది. ఈసారి ఈ కాంటినెంటల్ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. ఇందులో మొత్తం 19 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్, పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ రెండు, నాలుగు వారాల మధ్యలో ఈ టోర్నీ జరుగుతుంది.
ఈ టోర్నీ మొదట భారత్‌కు కేటాయించబడింది. అయితే, భారత్-పాక్‌ల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ప్రస్తుతానికి వేదిక ఖరారు కానప్పటికీ.. యూఏఈ లేదా శ్రీలంకలో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ టోర్నీ 2025 ఎడిషన్‌లో భారత్, పాక్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ పాల్గొంటాయి. ఉపఖండం నుండి నేపాల్ ఒక్కటే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.
గత ఎడిషన్‌లోలాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో కూడా ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించబడతాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. ఈ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు చేరతాయి. భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశలో ఓసారి.. సూపర్ ఫోర్ రౌండ్‌లో మరోసారి.. ఫైనల్లో మూడోసారి తలపడే అవకాశం ఉంది.
కాగా, 2031లో ముగిసే ప్రస్తుత సైకిల్‌లో నాలుగు ఆసియా కప్‌లు జరుగనున్నాయి. 2025 ఎడిషన్ (19 మ్యాచ్‌లు) తర్వాత, 2027 ఎడిషన్ బంగ్లాదేశ్‌లో (13 మ్యాచ్‌లు) వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆతర్వాత పీసీబీ ఆతిథ్యం ఇచ్చే టోర్నీ టీ20 ఫార్మాట్‌లో (19 మ్యాచ్‌లు) జరుగుతుంది. చివరిగా, 2031 ఎడిషన్ వన్డే ఫార్మాట్‌లో (13 మ్యాచ్‌లు) శ్రీలంకలో జరుగుతుంది.