లంకపై భారత్ విజయం (PC: ACC X)
ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్- శ్రీలంక మధ్య బేయ్‌మాస్ క్రికెట ఓవల్ మైదానంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది.
ఆకాశమే హద్దుగా ఆయుషి
ఇందులో టాస్ గెలిచిన యువ భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా ఆకాశమే హద్దుగా చెలరేగి.. లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కేవలం పది పరుగులే ఇచ్చిన ఆయుశి నాలుగు వికెట్లు కూల్చింది.
మరోవైపు పరుణికా రెండు, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన శ్రీలంక కేవలం 98 పరుగులే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కర 33 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచింది.
రాణించిన త్రిష, కమలిని
ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా.. గొంగడి త్రిష, కమలిని రాణించడంతో విజయం సాధించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తెలుగమ్మాయి త్రిష 32 రన్స్‌తో రాణించగా.. తమిళనాడు స్టార్ జి.కమలిని 28 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు.
మిగతా వాళ్లలో మిథిల 17 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. భవిక(7)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈశ్వరి డకౌట్ కాగా.. సానికా చాల్కె(4) పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో 14.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ 99 పరుగులు సాధించింది. తద్వారా లంకపై జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తుదిజట్లు
భారత్
జి. కమిలిని, త్రిష, సానిక, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి, మిథిల, ఆయుషి, భవిక (వికెట్ కీపర్), షబ్నం, పారుణిక, ద్రితి .
శ్రీలంక
మనుడి, రష్మిక, లిమాన్సా, సుముడు, హిరుణి, ప్రముది, సంజన, దహామి, చముది, అసేని, షష్ని.
చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment