women cricket
-
U19 Asia Cup 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్- శ్రీలంక మధ్య బేయ్మాస్ క్రికెట ఓవల్ మైదానంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది.ఆకాశమే హద్దుగా ఆయుషిఇందులో టాస్ గెలిచిన యువ భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా ఆకాశమే హద్దుగా చెలరేగి.. లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కేవలం పది పరుగులే ఇచ్చిన ఆయుశి నాలుగు వికెట్లు కూల్చింది.మరోవైపు పరుణికా రెండు, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన శ్రీలంక కేవలం 98 పరుగులే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కర 33 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచింది.రాణించిన త్రిష, కమలినిఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా.. గొంగడి త్రిష, కమలిని రాణించడంతో విజయం సాధించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తెలుగమ్మాయి త్రిష 32 రన్స్‌తో రాణించగా.. తమిళనాడు స్టార్ జి.కమలిని 28 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. మిగతా వాళ్లలో మిథిల 17 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. భవిక(7)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈశ్వరి డకౌట్ కాగా.. సానికా చాల్కె(4) పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో 14.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ 99 పరుగులు సాధించింది. తద్వారా లంకపై జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తుదిజట్లుభారత్జి. కమిలిని, త్రిష, సానిక, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి, మిథిల, ఆయుషి, భవిక (వికెట్ కీపర్), షబ్నం, పారుణిక, ద్రితి .శ్రీలంకమనుడి, రష్మిక, లిమాన్సా, సుముడు, హిరుణి, ప్రముది, సంజన, దహామి, చముది, అసేని, షష్ని.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
సూపర్ ఫామ్‌లో భారత ఓపెనర్.. ఆల్‌టైమ్ రికార్డుకు గురి
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ వన్డేలో సెంచరీతో చెలరేగిన ఈ ముంబై బ్యాటర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్-2024లోనూ ఫామ్‌ను కొనసాగించింది. ఈ ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో కలిపి 142కు పైగా స్ట్రైక్‌రేటుతో 144 పరుగులు సాధించింది.ఇక స్మృతి మంధాన తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో బిజీ కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. ఆసీస్‌తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మృతి గనుక 310 పరుగులు సాధిస్తే.. వన్డేల్లో 4000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల క్లబ్లో చేరుతుంది. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డుఅంతేకాదు భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలుస్తుంది. కాగా ఇంతకు ముందు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్... 112 మ్యాచ్‌లలో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకుంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో 2011నాటి వన్డేలో ఈ ఘనత సాధించింది.ఇక స్మృతి మంధాన ఇప్పటి వరకు 88 వన్డేలు ఆడి 3690 పరుగులు సాధించింది. ఇందులో ఎనిమిది శతకాలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో స్మృతి ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా 310 రన్స్ చేస్తే.. మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టగలుగుతుంది. టాప్‌లో ఉన్నది వీరేకాగా ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల క్లబ్లో చేరిన క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ముందు వరుసలో ఉంది. ఆమె 86 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసింది. బెలిండా తర్వాతి స్థానాల్లో... మెగ్ లానింగ్(89 ఇన్నింగ్స్), లారా వొల్వర్ట్(96 ఇన్నింగ్స్), కరేన్ రాల్టన్(103 ఇన్నింగ్స్), సుజీ బేట్స్(105 ఇన్నింగ్స్), స్టెఫానీ టేలర్(107 ఇన్నింగ్స్), టామీ బీమౌంట్(110 ఇన్నింగ్స్) ఈ జాబితాలో ఉన్నారు.ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టు మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డిసెంబరు 5న బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. -
బిగ్‌బాష్ లీగ్ విజేత మెల్బోర్న్ రెనెగేడ్స్
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను మెల్బోర్న్ రెనెగేడ్స్ గెలుచుకుంది . ఇవాళ (డిసెంబర్ 1) జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ చేసే సమయానికి వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 12 ఓవర్లలో 98 పరుగులకు కుదించారు. ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన బ్రిస్బేన్ హీట్ లక్ష్యానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది. నికోలా హ్యాంకాక్ చివరి బంతికి సిక్సర్ బాదినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.రాణించిన హేలీ మాథ్యూస్తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్.. హేలీ మాథ్యూస్ అర్ద సెంచరీతో (61 బంతుల్లో 69) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జార్జియా వేర్హమ్ (21), నయోమీ స్టాలెన్‌బర్గ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో చార్లీ నాట్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ పార్సన్స్ 2, నికోలా హ్యాంకాక్, లూసీ హ్మామిల్టన్, జొనాసెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.జొనాసెన్ పోరాటం వృధా98 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ తడబడింది. ఆ జట్టులో జెస్ జోనాసెన్ (44 నాటౌట్), నికోలా హ్యాంకాక్ (13 నాటౌట్) ఎవ్వరూ రాణించలేదు. వీరిద్దరు కాక జార్జియా రెడ్మేన్ (16) రెండంకెల స్కోర్ చేసింది. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 2, చారిస్ బెక్కర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, సోఫీ మోలినెక్స్, డియాండ్ర డాటిన్ తలో వికెట్ పడగొట్టారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ఇది తొలి టైటిల్. -
మహిళల ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ అంటే..?
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు సంబంధించిన క్రికెటర్ల మినీ వేలం వచ్చే నెల 15న బెంగళూరులో నిర్వహించనున్నారు. వచ్చే సీజన్ ఫిబ్రవరి–మార్చి నెలలో జరుగుతుంది. ఐదు ఫ్రాంచైజీల మొత్తం బడ్జెట్ రూ. 15 కోట్లు. గత సీజన్ రూ. 13.5 కోట్ల కంటే కొంచెం పెరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ హిథెర్ నైట్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ తదితర టాప్ స్టార్లు వేలంలో ఉన్నారు. వీరితో పాటు భారత్‌కు చెందిన స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తిలు కూడా వేలంలోకి వచ్చారు. గత రెండు సీజన్లు (2023, 2024)గా రన్నరప్‌తో సరిపెట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే కనిష్టంగా రూ.2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ చేతిలో గరిష్టంగా రూ. 4.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వద్ద రూ. 3.25 కోట్లున్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీలకు సంబంధించిన గడువు ఈ నెలలో ముగియగా... ఒక్క డ్యానీ వ్యాట్ (ఇంగ్లండ్) బదిలీ జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఆర్సీబీ ఆమెను కొనుక్కుంది. -
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 ఎడిషన్ ఫిక్చర్లు, గ్రూప్‌ల వివరాలను ఐసీసీ ఇవాళ (మే 5) ప్రకటించింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి.గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్దులు భారత్, పాక్‌లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్వాలిఫయర్-1 ఉండగా.. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-2 జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూప్‌ల్లోని జట్లు తమతమ గ్రూప్‌ల్లోని ఇతర జట్లతో చెరో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్ దశ అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరుగుతుంది. రెండు సెమీస్‌లకు, ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేస్ ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. 19 రోజుల పాటు జరిగే ఈ మెగా సమరం ఢాకా, సిల్హెట్ మైదానాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిక్చర్స్ లాంచింగ్ ప్రోగ్రాంను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ ప్రారంభించారు.దాయాదుల సమరం ఎప్పుడంటే.. పొట్టి ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు సిల్హెట్ మైదానం వేదిక కానుంది. భారత్ మ్యాచ్‌లు అక్లోబర్ 4 (న్యూజిలాండ్), 9 (క్వాలిఫయర్-1), 13 (ఆస్ట్రేలియా) తేదీల్లో జరుగనున్నాయి.మరోసారి హాట్ ఫేవరెట్‌గా ఆసీస్..డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మహిళల పొట్టి ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు జరగగా.. ఆసీస్ ఏకంగా ఆరుసార్లు జగజ్జేతగా నిలిచింది. 2009లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా.. తొలి ఎడిషన్‌లో ఇంగ్లండ్.. 2016 ఎడిషన్‌లో వెస్టిండీస్ విజేతలుగా నిలిచాయి. 2016 ఎడిషన్‌లోనూ ఆసీస్ ఫైనల్ వరకు చేరింది అయితే తుది సమరంలో విండీస్ ఆసీస్‌కు ఊహించని షాక్ ఇచ్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆసీస్ 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఎడిషన్లలో విజేతగా నిలువగా.. భారత్ 2020లో ఫైనల్ దాకా వెళ్లి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. -
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై
West Indies Commit To...: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తావు లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ), వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(డబ్ల్యూఐపీఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఎంఓయూ అక్టోబరు 1, 2023 నుంచి సెప్టెంబరు 30, 2027 వరకు అమల్లో ఉంటుందని విండీస్ బోర్డు తెలిపింది. ఎంఓయూ ముఖ్య ఉద్దేశం అదే ‘‘అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఫీజులలో వ్యత్యాసం లేకుండా చూడటమే ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ జట్టు కెప్టెన్ల అలవెన్సులు, అంతర్జాతీయ జట్టు ప్రైజ్‌మనీ, ప్రాంతీయ స్థాయిలో వ్యక్తిగతంగా చెల్లించే ప్రైజ్‌మనీ అందరు వెస్టిండీస్ క్రికెటర్లకు సమాన స్థాయిలో అక్టోబరు 1, 2027 నాటికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ సైతం.. కాగా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర దేశాల క్రికెట్ బోర్డులు లింగ వివక్షకు తావులేకుండా మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ కూడా అదే బాటలో నడవడానికి సమాయత్తమైంది. ఐసీసీ హర్షం ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది తాము ఐసీసీ టోర్నమెంట్లలో పురుష, మహిళా జట్లకు సమాన స్థాయిలో ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. చదవండి: AUS Vs WI 2nd Test: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం
డర్బన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సమానత్వానికి ‘జై’ కొట్టింది. పురుషులతో పాటు మహిళలకు ఒకే తరహా టోర్నీ ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు ‘సై’ అంది. అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలుచుకుంటే ఎంత మొత్తం వస్తోందో... హర్మన్‌ప్రీత్ కౌర్ మెగా ఈవెంట్ గెలిచినా అంతే వస్తుంది. ఇకపై తేడాలుండవ్... పక్షపాతానికి తావే లేదు. ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కొన్నేళ్ల కిందటి నుంచే సమానత్వాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఐసీసీలోనూ దీనిపై చర్చ జరుగుతుండగా, గురువారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘ఐసీసీ ప్రపంచకప్‌లలో టోర్నీ ప్రైజ్‌మనీ ఇకపై సమం కాబోతోంది. పురుషుల క్రికెటర్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘సిరీస్’, జట్లకు పార్టిసిపేషన్ ఫీజులు ఎంతయితే ఇస్తారో... మహిళా క్రికెటర్లకు, జట్లకు అంతే సమంగా చెల్లిస్తారు’ అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: #YashasviJaiswal: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ శతకాలతో చెలరేగిన రోహిత్, జైశ్వాల్.. పట్టు బిగిస్తోన్న టీమిండియా -
బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ‘యంగ్ విరాట్’.. వీడియో వైరల్
శ్రీనగర్: మహిళ క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. ‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్లో మా టీచర్ క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. హెలికాప్టర్ వంటి షాట్స్ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్ చేయగా 25వేల వ్యూస్, 1,200 లైక్స్ వచ్చాయి. My father at home and my teacher at school encourage me to play cricket. I'll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt — DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022 ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది -
మెక్‌గ్రాత్ ఆల్‌రౌండ్ షో.. పాక్‌ను మట్టికరిపించిన ఆసీస్
కామన్వెల్త్ క్రీడల మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్-ఏలో హాట్ ఫేవరెట్ అయిన ఆసీస్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో ఆరు పాయింట్లు సాధించి గ్రాండ్‌గా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభ మ్యాచ్‌లో భారత్‌పై 3 వికెట్లు తేడాతో గెలుపొందిన ఆసీస్.. ఆతర్వాత బార్బడోస్పై 9 వికెట్ల తేడాతో, తాజాగా పాక్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయాలు సాధించింది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన పాక్.. గ్రూప్‌లో ఆఖరి స్థానంలో నిలిచి ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. పాక్.. తమ తొలి మ్యాచ్‌లో పసికూన బార్బడోస్ చేతిలో, రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో, తాజాగా ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్-ఏలో రెండో సెమీస్ బెర్తు ఖరారు చేసుకునేందుకు ఇవాళ భారత్-బార్బడోస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసీస్‌తో పాటు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్ 3) రాత్రి 10:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇక ఆసీస్-పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బెత్ మూనీ (49 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్), తహీల మెక్‌గ్రాత్ (51 బంతుల్లో 78; 10 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన పాక్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో రాణించిన తహీల మెక్‌గ్రాత్ (3/13) బౌలింగ్‌లోనూ చెలరేగి పాక్ పతనాన్ని శాసించింది. పాక్ బ్యాటర్లలో ఫాతిమా సనా (26 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: IND VS PAK: మౌకా.. మౌకా యాడ్‌కు మంగళం పాడిన స్టార్ స్పోర్ట్స్.. కారణం అదేనా..! -
T20 Trophy: హైదరాబాద్‌పై ఆంధ్ర జట్టు గెలుపు
Senior Women's T20 Trophy 2022- పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 26 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ ఎన్.అనూష (54 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. హైదరాబాద్ బౌలర్ జి.త్రిష రెండు వికెట్లు తీసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరా బాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఓపెనర్ జి.త్రిష (56 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శరణ్య గద్వాల్ (3/13), సీహెచ్ ఝాన్సీలక్ష్మి (2/24) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! -
T20 Trophy: హైదరాబాద్ శుభారంభం
T20 Cricket Tournament- పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో భాగంగా సోమవారం మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ రమ్య (44; 4 ఫోర్లు), కె.అనిత (34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జి.త్రిష (20 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో ప్రణవి చంద్ర, భోగి శ్రావణి, అనిత, వంకా పూజ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: IPL 2022: బట్లర్ భళా... చహల్ చాంగుభళా -
ఉత్కంఠభరితమైన దృశ్యాలు..ఊహకందని భావోద్వేగాలు!
-
World Cup 2022: ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విండీస్ విజయం
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ వేదికగా బుధవారం ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డియాండ్రా డాటిన్(31 పరుగులు), హేలే మాథ్యూస్(45 పరుగులు) శుభారంభం అందించినప్పటికీ.. వీరిద్దరు అవుటైన తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ 80 బంతుల్లో 66 సాధించగా.. చెడియన్ నేషన్ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వెరసి నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ 6 పరుగుల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేధనకు దిగిన ఇంగ్లండ్ మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ టామీ బీమౌంట్ మాత్రం 46 పరుగులతో ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అయితే, చివర్లో సోఫీ, కేట్ క్రాస్ హిట్టింగ్ ఆడటంతో ఇంగ్లండ్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. కానీ, విండీస్ బౌలర్లు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ 218 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం వెస్టిండీస్‌ను వరించింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన షిమేన్ కాంప్‌బెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు: విండీస్- 225/6 (50 ఓవర్లు) ఇంగ్లండ్- 218 (47.4 ఓవర్లు) చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు.. వైరలవుతోన్న గంగూలీ కామెంట్లు
Ganguly Questioning Women Cricket Resurfaces: తమ ఆరాధ్య క్రికెటర్ వన్డే కెప్టెన్సీ ఊడటానికి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే ప్రధాన కారణమని భావిస్తున్న విరాట్ కోహ్లి అభిమానులు.. దాదా గతంలో చేసిన చిన్నచిన్న పొరపాట్లను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఈ క్రమంలో గంగూలీ గతంలో అమ్మాయిలను ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి కోహ్లి అభిమానుల కంటపడింది. గంగూలీని టార్గెట్ చేసేందుకు ఈ వీడియోను ప్రధాన ఆస్త్రంలా మార్చుకున్న కోహ్లి ఫ్యాన్స్, గంగూలీపై భారీ ఎత్తున నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు మూడేళ్ల కిందట ఓ బెంగాళీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన కూతురు సనా గంగూలీ ప్రస్తావన సందర్భంగా గంగూలీ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. సనాని.. తానెప్పుడు క్రికెట్ ఆడమని అడగలేదని, అసలు అడగనని, ఎందుకంటే అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని, అమ్మాయిలు క్రికెట్ ఆడటానికే పనికిరారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో పెద్ద దుమారం రేపిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. నెటిజన్లు గంగూలీని ఏకిపారేస్తున్నారు. బీసీసీఐ బాస్‌కి మహిళలంటే గౌరవం లేదని, అందుకే అలాంటి చీప్ వ్యాఖ్యలు చేశాడని మండిపడుతున్నారు. కాగా, భారత మహిళల జట్టు, పురుషుల జట్టుతో సమానంగా రాణిస్తూ ప్రపంచక్రికెట్లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విధితమే. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జులన్ గోస్వామి, షెఫాలీ వర్మ లాంటి క్రికెటర్లు పురుష క్రికెట్లతో సమానంగా రాణిస్తూ, ఇంచుమించు వారంతటి క్రేజ్‌ని సంపాదించారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో గంభీర్ ‘రీ ఎంట్రీ’.. ఈసారి కొత్త అవతారంలో.. -
Mithali Raj Birthday: మిరాకిల్ మిథాలీ
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అంటే కేవలం పురుషులకేనా మాది కూడా అంటూ బౌండరీలు చెరిపేసి సవాల్ విసిరిన ధీర. కొడితే సిక్స్ కొట్టాలి అన్నట్టుగా తొలి టెస్ట్‌లోనే సెంచరీ. రికార్డుల మీద రికార్డులు. క్రికెట్‌ను ప్రేమించే ప్రతీ అమ్మాయికి ఆమె ఒక స్ఫూర్తి పతాక. భారత మహిళా క్రికెట్లో ఒక సంచలనం. మిథాలీ రాజ్ లేడీ టెండూల్కర్‌గా పాపులర్ అయిన మిథాలీ రాజ్ 39వ పుట్టినరోజు సందర్భంగా హ్యపీ బర్త్‌డే అంటోంది. మిథాలీ రాజ్అంటే పరుగుల వదర. రికార్డుల మీద రికార్డులుగుర్తుకొస్తాయి. భారతీయ మహాళా క్రికెట్‌కు ఆమెవిశేష సేవలందించారు. మి థాలీ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘శభాష్ మిథూ’ లో వెండితెర పిచ్ మీద మిథాలీ రాజ్‌గా హీరోయిన్ తాప్సీ నటిస్తోంది. వియాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్లో ‘శభాష్ మిథూ’ వచ్చే ఏడాది డిసెంబరు 4న థియేటర్లను పలకరించనుంది. -
ఆసీస్ బెదిరింపులకు తలొగ్గిన తాలిబన్లు.. మహిళల క్రికెట్‌కు గ్రీన్ సిగ్నల్..?
కాబుల్: అఫ్గాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్‌లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అఫ్గాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ అజీజుల్లా ఫజ్లీ వెల్లడించారు. ఈ ప్రక్రియ ఎలా జరగుతుందనేది త్వరలోనే తెలియజేస్తామని, అఫ్గానీ మహిళలు కచ్చితంగా శుభవార్తను వింటారని ఆయన తెలిపారు. అఫ్గాన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనరని, అఫ్గానీ మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్ ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గత గురువారం తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఈ విషయమై ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ కూడా ఘాటుగానే స్పందించాడు. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేస్తే.. త్వరలో జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ నుంచి ఆ దేశాన్ని తప్పించాలని ఐసీసీని డిమాండ్ చేశాడు. అయితే తాలిబన్ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని వేడ్కొంది. కాగా, అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా క్రికెట్‌ను నిషేధించారు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్
కాబుల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా అఫ్గాన్ మహిళలు.. క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం ఫత్వా జారీ చేసింది. క్రీడల్లో పాల్గొన్నప్పుడు మహిళల శరీర భాగాలు బహిర్గతం అవుతాయన్న కారణంగా క్రీడలపై నిషేధం విధిస్తున్నట్లు వారు బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గురువారం తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌పై అంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం పురుషుల క్రికెట్‌కు సంపూర్ణ మద్దతు తేలియజేయడం విశేషం. పురుషుల క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీనిచ్చిన తాలిబన్లు.. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని అఫ్గాన్ క్రికెట్ బోర్డుకు భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని స్పష్టం చేసిన తాలిబన్లు మహిళల క్రికెట్ విషయంలో మాత్రం తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
మంధాన మెరుపులు వృధా.. టీమిండియాకు తప్పని ఓటమి
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో ఓపెనర్ స్మృతి మంధాన(51 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిసినా భారత మహిళా జట్టుకు ఓటమి తప్పలేదు. గత మ్యాచ్‌లో స్పూర్తిదాయకమైన పోరాటంతో ఆకట్టుకున్న హర్మన్ సేన.. కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. బుధవారం అర్ధరాత్రి వరకు సాగిన ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(26 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) బాధ్యాతాయుత ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో రిచా గోష్(13 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ డకౌట్‌గా వెనుదిరగ్గా.. హర్లీన్ డియోల్(0), స్నేహ్ రాణా(4) తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ మూడు, కేథరిన్ బ్రంట్ రెండు, నాట్ సీవర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ జట్టు ఆడుతూ పాడుతూ 18.4 ఓవర్లలో కేవలం 2 కోల్పోయి 154 లక్ష్యాన్ని చేరుకుంది. డేనియల్ వ్యాట్(56 బంతుల్లో 89 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), నాట్ సివర్(36 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. సూపర్ బ్యాటింగ్‌తో రాణించిన డేనియల్ వ్యాట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ఓటమితో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఏకైక టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను 1-2, టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. -
రెండో వన్డేలోనూ ఓడిన మిథాలీ సేన..సిరీస్ ఇంగ్లండ్ వశం
టాంటన్: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్(92 బంతుల్లో 7 ఫోర్లతో 59) అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళా జట్టుకు ఓటమి తప్పలేదు. బుధవారం అర్దరాత్రి దాటక ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి, టీమిండియాపై 5 వికెట్లతో ఘన విజయం సాధించారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్నారు. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన మిథాలీ సేన.. రెండో వన్డేలోనూ అదే తడబాటును కొనసాగించింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు స్మృతి మంధాన(22), షెఫాలీ వర్మ(44) శుభారంభం అందించినా.. మిగతా బ్యాటర్లు దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఓవైపు నుంచి మిథాలీ రాజ్ పోరాడినా.. మరోవైపు ఆమెకు ఎవరూ అండగా నిలవలేదు. జెమీమా రోడ్రిగ్స్(8), హర్మన్ ప్రీత్ కౌర్(19), దీప్తీ శర్మ(5), స్నేహ్ రాణా(5), తానియా భాటియా (2), శిఖా పాండే(2) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో టెయిలెండర్లు జూలన్ గోస్వామి(19 నాటౌట్), పూనమ్ యాదవ్(10) విలువైన పరుగులు సాధించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్(5/34), సోఫీ ఎక్లెస్టోన్ (3/33) భారత్ పతనాన్ని శాసించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి 15 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఆ జట్టులో ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్(42), లోయరార్డర్ బ్యాటర్లు సోఫియా డంక్లీ(73 నాటౌట్), కేథరీన్ బ్రంట్(33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. జూలన్ గోస్వామి, శిఖా పాండే, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. భారత్ పతనాన్ని శాసించిన కేట్ క్రాస్(5/34)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే జులై 3న జరుగనుంది. -
మహిళా క్రికెట్: నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో విమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020 టైటిల్ విజేతగా ట్రైల్ బ్లేజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్మ్యాచ్కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైనల్ పోరులో ఎవరు గెలిచినా ఆ విజయం ఎంతోమంది ఔత్సాహిక మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశంలో మహిళల క్రికెట్‌కు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నీతా అంబానీ ఇన్‌స్టాలో సోమవారం ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రతి రంగంలో, ముఖ్యంగా క్రీడా, విద్యా రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నీతా పేర్కొన్నారు. ఇందుకు తమ ఫౌండేషన్ తరపున బాలికలు అందరికీ విద్య, క్రీడా అవకాశాలు అందించాలనేదే తన ధ్యేయమని చెప్పారు. మౌలిక వసతులు, సదుపాయాలతోపాటు, అవకాశాలు, నైపుణ్య శిక్షణ అవసరమన్నారు. ఈ విషయంలో తమ ఫౌండేషన్ చాలా కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి 33 మందితోపాటు, 12 మంది విదేశీ మహిళా క్రికెటర్లు జియో విమెన్ 2020లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే తొలిసారి థాయ్‌లాండ్ నుంచి నాథకాన్(24) పాల్గొంటున్నారని నీతా అంబానీ తెలిపారు. క్రీడల్లో బాలికల ప్రోత్సాహం కోసం నవీముంబైలో ఒక జియో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పిస్తే, గ్లోబల్‌గా రాణిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించారని నీతా ప్రశంసించారు. టీమిండియా మహిళల క్రికెట్ జట్టు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తోందన్నారు. గత ఆరేళ్లుగా అంజుం చోప్పా, జులన్గోస్వామి, మిథాలీ రాజ్లాంటి లెజెండ్లు మంచి పేరు సంపాదించారన్నారు. అలాగే స్మృతి మంధన, పూనం యాదవ్, హర్మన్ ప్రీత్‌కౌర్ మన మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. భవిష్యత్తులోమరింత రాణించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్నోవాస్ను ఓడించి మూడేళ్లలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది ట్రైల్ బ్లేజర్స్. జియో అండ్ రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ మహిళల టి 20 ఛాలెంజ్‌ను స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram “In the end, women’s cricket will be the winner today.” - Mrs. Nita Ambani. . Here’s how Reliance Foundation Education and Sports for All and JIO are bridging the gender divide in sport. . #OneFamily #MumbaiIndians #MI #JioWomensT20Challenge @reliancefoundation @reliancejio A post shared by Mumbai Indians (@mumbaiindians) on Nov 9, 2020 at 7:17am PST -
ముగ్గురు కెప్టెన్లను ప్రకటించిన బీసీసీఐ
న్యూఢిల్లీ: కరోనా అడ్డంకులను దాటుకుని అభిమానులకు వినోదం పంచుతున్న ఐపీఎల్-2020 కి తోడుగా మహిళల మినీ ఐపీఎల్ సంరంభం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. యూఏఈలోని షార్జా వేదికగా జరిగే ‘మహిళల టి20 చాలెంజర్ టోర్నీ’ జట్లకు సారథులను నియమించింది. సూపర్ నోవాస్ టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌కు స్మృతి మంధాన, వెలాసిటీ టీమ్‌కు మిథాలి రాజ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని పేర్కొంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనుంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రియా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటారు. కాగా, 2018 లో మొదలైన మహిళల మినీ ఐపీఎల్లో తొలుత సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు మాత్రమే ఉండేవి. ఈసారి ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌ని కొత్తగా చేర్చారు. (చదవండి: మహిళా క్రికెటర్లకు పిలుపు!) (చదవండి: ‘క్వారంటీన్ నిబంధనలు మారవు’) -
విండీస్‌ను ఊడ్చేశారు..
ప్రావిడెన్స్ (గయానా): వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత మహిళలు జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే నాలుగు టీ20ల్లో జయభేరి మోగించిన టీమిండియా.. గురువారం జరిగిన నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో గెలుచుకుంది. సిరీస్ ఆరంభం నుంచి ఎదురేలేని టీమిండియా టీ20 చాంపియన్‌ను గజగజా వణికించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ రోడ్రిగ్స్(50; 56 బంతుల్లో 3ఫోర్లు), వేద కృష్ణమూర్తి(57 నాటౌట్; 48 బంతుల్లో 4ఫోర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 73 పరుగులే చేసి ఓటమిపాలైంది. కిషోనా నైట్(22) ఓ మోస్తారుగా రాణించగా మిగతా బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అనూజా పాటిల్ రెండు, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, పూజా, హర్లీన్‌లు తలో వికెట్ పడగొట్టారు. రాణించిన రోడ్రిగ్స్, వేద టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. షెఫాలీ వర్మ(9), స్మృతి మంధాన(7) తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. తొలుత ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో స్కోర్ ముందుకు కదిలింది. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ చివరి రెండో బంతికి రోడ్రిగ్స్ వెనుదిరిగింది. అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ పోరాటపటిమను ప్రదర్శిచంలేదు. క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాటపట్టారు. దీంతో విండీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు. -
గెలిస్తే.. సిరీస్ మనదే
వడోదర: దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో గెలిచి జోరు మీదున్న టీమిండియా మహిళల జట్టు మరో సమరానికి సిద్దమైంది. శుక్రవారం వడోదరలోని రిలయన్స్ స్టేడియంలో సఫారీ జట్టుతో రెండో వన్డేలో తలపడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆరాడపడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ జరిగే కొద్ది నెమ్మదిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన సారథి మిథాలీ రాజ్ ఛేజింగ్ వైపు మొగ్గు చూపింది. గాయం కారణంగా స్మృతి మంధాన స్థానంలో జట్టులోకి వచ్చిన పూజా వస్త్రాకర్‌ను టీమ్ మేనేజ్మెంట్ తుదిజట్టులోకి తీసుకోలేదు. ఇక అరంగేట్రపు మ్యాచ్‌లోనే అదరగొట్టిన ప్రియా పూనియాపై అందరి దృష్టి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ రాణించి టీమిండియాలో సుస్థిర స్థానం ఏర్పరుచుకోవాలని ప్రియ భావిస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్లు రాణించడంతో మిగతా బ్యాటర్లకు అవకాశం రాలేదు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, రోడ్రిగ్స్‌లతో కూడిన బ్యాటింగ్ లైన్‌పై పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా మైదానంలో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇక జులన్ గోస్వామి నేతృత్వంలోని బౌలింగ్ విభాగం దుర్బేద్యంగా ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. టీ20 సిరీస్, తొలి వన్డే ఓటమితో సఫారీ జట్టు ఢీలా పడింది. అయితే రెండో వన్డేలో పుంజుకొని విజయం సాధించాలని ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని భావిస్తోంది. ఇక బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. -
ఇంతింతై ఇరవై ఏళ్లుగా...
ఇరవై ఏళ్ల కాలం అంటే ఒక తరం మారిపోతుంది... తరాల మధ్య ఆలోచనలో, ఆచరణలో అంతరం కూడా చాలా ఉంటుంది... కానీ మిథాలీ రాజ్ నిరంతర ప్రవాహంగా కొనసాగిపోతూనే ఉంది. రెండు దశాబ్దాలుగా తన ఆటతో అలరిస్తూనే ఉంది. ఇన్నేళ్లలో మహిళల క్రికెట్ రూపు మార్చుకుంది, ఫార్మాట్లు మారాయి, ఆటగాళ్లూ మారారు... కానీ మారనిది మిథాలీ ఆట మాత్రమే! సగంకంటే ఎక్కువ జీవితం ఆమె క్రికెట్ మైదానాల్లోనే గడిపింది. రికార్డులు కొల్లగొడుతూ పరుగుల వరద పారించినా ఆటపై ఆమెకు మమకారం చెక్కుచెదరలేదు. మహిళల క్రికెట్ అంటే అసలు ఆటే కాదు అంటూ ఎవరూ పట్టించుకోని రోజుల్లో మిథాలీ ఏటికి ఎదురీదింది. కోట్లాది కాంట్రాక్ట్‌లు, మ్యాచ్ ఫీజులు కాదు కదా... కనీసం రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లభించని సమయంలో ఆమె ఆటను అభిమానించింది. రెండు తరాలకు వారధిగా నిలుస్తూ అనేక ఘనతలు తన ఖాతాలో వేసుకున్న మిథాలీ కొందరు అభిమానంతో ‘లేడీ సచిన్’ అని పిలుచుకున్నా... సుదీర్ఘ సమయం పాటు భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచి స్థాయిని పెంచిన మిథాలీని చూస్తే సచిన్‌తో పోలిక కూడా తక్కువే అనిపిస్తుంది. ఒకప్పుడు తాను ఇష్టపడిన భరతనాట్యాన్ని వదిలేసి పదేళ్ల వయసులో క్రికెట్ వైపు కదిలిన ఆ పాదాలు అలసట లేకుండా క్రికెట్ పిచ్‌పై పరుగెడుతూనే ఉన్నాయి. 303 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 9758 పరుగులతో ఆమె సాగుతూనే ఉంది. 1997 ప్రపంచకప్‌లోనే 15 ఏళ్ల మిథాలీ భారత జట్టులోకి ఎంపికైంది. అయితే ‘మరీ చిన్న అమ్మాయి’గా భావించి టీమ్ మేనేజ్మెంట్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు సెంచరీతో చెలరేగి తనేంటో నిరూపించింది. తన మూడో టెస్టులోనే పటిష్టమైన ఇంగ్లండ్‌పై చేసిన డబుల్ సెంచరీ (214)తో ఆమె మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆ తర్వాత ఐదు ప్రపంచకప్‌లలో పాల్గొని రికార్డుల మోత మోగించింది. ఇందులో రెండు సార్లు మిథాలీ సారథ్యంలోనే భారత జట్టు ఫైనల్ చేరుకోవడం విశేషం. మధ్యలో కొంత విరామం తప్ప దశాబ్దానికి పైగా భారత కెపె్టన్ అంటే మిథాలీరాజ్ మాత్రమే. ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీ టైటిల్స్‌తో ఆమె నాయకత్వంలో విజయాల జాబితా కూడా చాలా పెద్దదే. ఒక అమ్మాయి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ, నాయకురాలిగా అదనపు బాధ్యతలతో ఇరవై ఏళ్లు ఆటలో కొనసాగడం అసాధారణం. కానీ 37 ఏళ్ల మిథాలీ పయనం ఇంకా ఆగలేదు. 2021 వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన ఈ హైదరాబాదీకి హ్యాట్సాఫ్! ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను: మిథాలీ ‘కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాను. అన్నింటికి మించి మహిళల సిరీస్‌ల మధ్య సుదీర్ఘ విరామం ఉండటం పెద్ద సమస్యగా కనిపించేది. ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా ఆడి గెలిచిన తర్వాత మరో ఏడు–ఎనిమిది నెలల వరకు మరో సిరీస్ ఉండకపోయేది. విజయాల జోరును కొనసాగించాలని భావించే సమయంలో ఇలాంటి షెడ్యూల్ మా ఉత్సాహాన్ని చంపేసేది. ఇప్పుడున్న తరహాలో పద్ధతిగా మ్యాచ్‌లు జరిగి ఉంటే నేను మరిన్ని మ్యాచ్‌లు ఆడి మరిన్ని ఘనతలు సాధించగలిగేదాన్ని. ఒకప్పుడు కనీస మీడియా కవరేజి కూడా లేని రోజులనుంచి వచి్చన ప్లేయర్‌ను నేను. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు మహిళల క్రికెట్‌ను అనుసరిస్తున్నారు. ఈ రకంగా మహిళల క్రికెట్ ఎదగడం, అందులో నేను భాగం కావడం చాలా సంతృప్తినిచ్చే విషయం. రెండు దశాబ్దాల పాటు ఆటలో కొనసాగడం గర్వించే విషయం.’అంటూ మిథాలీ పేర్కొంది. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లు ►సచిన్ – 22 ఏళ్ల 91 రోజులు ►జయసూర్య – 21 ఏళ్ల 184 రోజులు ►మియాందాద్ – 20 ఏళ్ల 272 రోజులు ►మిథాలీ రాజ్ – 20 ఏళ్ల 105 రోజులు ►26 – 06 –1999అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ తొలి మ్యాచ్ ఆడిన రోజు -
టీమిండియాకు భారీ షాక్
వడోదర : కీలక దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు టీమిండియా మహిళల జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్, టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన బొటన వేలి గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకుంది. మంగళవారం ప్రాక్టీస్‌లో భాగంగా ఈ క్రికెటర్ బొటన వేలికి గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం మంధానకు విశ్రాంతి అవసరవని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక గత కొద్దికాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంధాన గాయం కారణంగా దూరం కావడంతో బ్యాటింగ్ భారం మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లపై పడనుంది. ఇక దక్షిణాప్రికాతో మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టుకు తొలి ఓవర్ తొలి బంతికే గోస్వామి షాక్ ఇచ్చింది. లిజాలే లీ(0)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అనంతరం ఏక్తా బిస్త్ రెండు వికెట్లతో విజృంభించడంతో 56 పరుగులకే మూడు కీలక వికెట్ల కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. అనంతరం మారిజాన్ కాప్(54) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో 45.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో గోస్వామి(3/33), పూనమ్ యాదవ్(2/33), ఏక్తా బిస్త్(2/28), శిఖా పాండే(2/38)లు రాణించారు. -
టి20 సిరీస్ మనదే..
సూరత్: భారత మహిళలు మరో మ్యాచ్ మిగిలుండగానే ఐదు టి20ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐదో టి20లో భారత్ 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై విజయం సాధించింది. వర్షం వల్ల ఆలస్యమైన ఈ మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ముందుగా భారత్ 17 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా (22 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా... భారత స్పిన్ వలలో పడింది. 17 ఓవర్లలో 7 వికెట్లకు 89 పరుగులే చేయగలిగింది. స్పిన్నర్లు పూనమ్ (3/13), రాధాయాదవ్ (2/16) సఫారీని కట్టడి చేశారు. తొలి టి20 భారత మహిళలు గెలుపొందగా... తర్వాత రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. ఆఖరి టి20 ఇక్కడే 4వ తేదీన జరుగనుంది. -
అలీసా@100
సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ తన కెరీర్లో కొత్త మైలురాయి అందుకుంది. మహిళల అంతర్జాతీయ టి20 క్రికెట్లో 100 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా ఆమె ఘనత వహించింది. శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా 29 ఏళ్ల అలీసా ఈ ఘనత సాధించింది. ఇంతకుముందు ఆసీస్ తరఫున ఎలీస్ పెర్రీ మాత్రమే 100 టి20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తన కుటుంబసభ్యుల హాజరీలో 100వ మ్యాచ్ ఆడిన అలీసా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సహాయంతో 21 పరుగులు చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లతో శ్రీలంకను ఓడించింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. -
‘ఆమెది లక్కీ హ్యాండ్.. అందుకే’
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో శ్రీలంక మహిళా జట్టు సారథి చమరీ ఆటపట్టు సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. కేవలం 66 బంతుల్లోనే శతకం సాధించిన తొలి లంక మహిళా క్రికెటర్‌గా.. వన్డే, టీ20ల్లో ఆసీస్ సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆటపట్టు అరదైన రికార్డును నెలకొల్పింది. ఆదివారం స్థానిక నార్త్ సిడ్నీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డులను ఆటపట్టు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇదే మ్యాచ్‌లో టాస్ సమయంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా మ్యాచ్‌లో టాస్ వేసేటప్పుడు ఇరుజట్ల కెప్టెన్లు వస్తారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఆసీస్ సారథి మెగ్ లానింగ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తనకు టాస్ కలసి రావడం లేదని వికెట్ కీపర్ అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చింది. మ్యాచ్ రిఫరీ కాయిన్‌ను హీలేకు ఇచ్చి టాస్ వేయమన్నాడు. అయితే అనూహ్యంగా ఆసీస్ టాస్ గెలిచింది. అనంతరం హీలే పక్కకు తప్పుకోవడంతో రెగ్యులర్ కెప్టెన్ లానింగ్ వచ్చి తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక టాస్ గెలవడంతో హీలే మైదానంలో గంతులు వేసింది. అయితే ఈ విషయంపై మెగ్ లానింగ్ స్పందిస్తూ.. ‘గత కొన్ని రోజులుగా నేను టాస్ గెలవడం లేదు. బహుశా నాకు అదృష్టం కలసి రావడం లేదనుకుంటా. అందుకే అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చాను. లక్కీగా మేమే టాస్ గెలిచాం. నాకు తెలుసు హీలేది లక్కీ హ్యాండ్ అని’పేర్కొంది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టాస్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. Just when you think you've seen it all! #AUSvSL pic.twitter.com/eaKpDnW3jr — cricket.com.au (@cricketcomau) September 30, 2019 -
అగ్రస్థానంలోనే మంధాన, జులన్
దుబాయ్: భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్ గోస్వామి తమ టాప్ స్థానాలను నిలుపుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి 797 పాయింట్లతో బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... బౌలర్ల కేటగిరీలో జులన్ గోస్వామి 730 పాయింట్లతో నెం.1గా కొనసాగుతోంది. భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ 713 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. టాప్–10 బ్యాట్స్‌వుమెన్‌లో భారత్ నుంచి మిథాలీ, స్మృతి మినహా వేరెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. బౌలింగ్ విభాగంలో పేసర్ శిఖా (688 పాయింట్లు), లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ (656 పాయింట్లు) వరుసగా ఐదు, పదో స్థానాలను దక్కించుకున్నారు. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (22 పాయింట్లు) అగ్రస్థానం, ఇంగ్లండ్ 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ (16 పాయింట్లు), న్యూజిలాండ్ (14), దక్షిణాప్రికా (13) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. దీంతో న్యూజిలాండ్ వేదికగా 2021లో జరుగనున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌నకు టాప్–5లో నిలిచిన ఈ ఐదు దేశాలు అర్హత సాధించాయి. శ్రీలంక క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది. -
సిరీస్ అప్పగించారు
గువాహటి: భారత మహిళలు మళ్లీ పొట్టి ఫార్మాట్లో చేతులెత్తేశారు. వరుసగా రెండో టి20లోనూ ఓటమి పాలై, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను ఇంగ్లండ్ చేతుల్లో పెట్టేశారు. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. మిథాలీరాజ్ చేసిన 20 పరుగులే టాప్‌స్కోర్! ఇంగ్లండ్ బౌలర్లు బ్రంట్ 3, స్మిత్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ వ్యాట్ (64 నాటౌట్; 6 ఫోర్లు) కడదాకా నిలబడి జట్టును గెలిపించింది. ఏక్తా బిష్త్‌కు 2 వికెట్లు దక్కాయి. ఒక్కరైనా 20 దాటలేదు... టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించిన హర్లీన్ (14), కెప్టెన్ స్మృతి మంధాన (5 బంతుల్లో 12; 2 సిక్సర్లు) శుభారంభం అందించలేకపోయారు. పేసర్ క్యాథరిన్ బ్రంట్ ఓపెనర్ స్మృతిని, తర్వాత వచ్చిన జెమీమా (2)ను పెవిలియన్ చేర్చింది. ఇక్కడి నుంచి మొదలైన పతనం ఎక్కడా ఆగలేదు. మిథాలీ రాజ్ (20), దీప్తిశర్మ (18), భారతి ఫుల్మాలి (18) ఇలా అందరిదీ అదే దారి. పరుగుల్లో వేగం లేదు. చెప్పుకోదగ్గ వ్యక్తిగత స్కోరూ లేదు. 50 పరుగులకు ముందే 3 వికెట్లు... వంద లోపే 7 వికెట్లు..! ఎవరూ 20 పరుగులకు మించి చేయలేకపోయారు. గెలిపించిన వ్యాట్... చేసింది తక్కువ స్కోరైనా... దీన్ని నిలబెట్టుకునే పనిలో ఆతిథ్య బౌలర్లు చక్కగా శ్రమించారు. కెప్టెన్ హీథెర్‌నైట్ (2) సహా బీమోంట్ (8), జోన్స్ (5), సీవర్ (1)లను ఔట్ చేశారు. దీంతో 56 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ డానియెల్ వ్యాట్ పోరాటంతో జట్టును గెలిపించింది. విన్ఫీల్డ్ (29; 4 ఫోర్లు) తో కలిసి ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. దీప్తి శర్మ, రాధాయాదవ్, పూనమ్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. పొట్టి ఫార్మాట్లో భారత్‌కిది వరుసగా ఆరో పరాజయం. ఆఖరి టి20 శనివారం ఇక్కడే జరుగుతుంది. -
‘ఏక్తా’ ధాటికి ఇంగ్లండ్ ప్యాకప్
ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో మిథాలీ సేన 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయింది. టీమిండియా బౌలర్లు ఏక్తా బిస్త్(4/25), దీప్తి శర్మ(2/33), శిఖా పాండే(2/21), గోస్వామి(1/19)ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సారథి హెదర్ నైట్(39 నాటౌట్), ఆల్‌రౌండర్ సీవర్(44)లు మాత్రమే రాణించారు. ఏ దశలోనూ పర్యాటక జట్టను కోలుకోనీయకుండా ఆ జట్టు పతనాన్ని శాసించిన ఏక్తాబిస్త్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. రాణించిన మిథాలీ, రోడ్రిగ్స్ అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. స్మృతి మంధాన (24), రోడ్రిగ్స్ (48)లు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం ఈ జోడిని ఎల్విస్ విడదీసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(7) వెంటనే వేనుదిరగగా.. రోడ్రిగ్‌తో కలిసి మిథాలీ(44) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అనంతరం ఇరువురు ఔటైన తర్వాత మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. చివర్లో తాన్యా భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో టీమిండియా 202 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. -
భారత్‌తో వన్డే: ఇంగ్లండ్ లక్ష్యం 203
ముంబై: ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ల తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో మిథాలీ సేన పర్యాటక జట్టుకు 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ మరోసారి మిడిలార్డర్ వైఫల్యం చెందడంతో 49.4 ఓవర్లలో కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ఓపెనర్ రోడ్రిగ్స్(48), సారథి మిథాలీ రాజ్(44)లు రాణించారు. దీంతో ఓ క్రమంలో 92 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి.. పటిష్ట స్థితిలో ఉందనుకున్న తరుణంలో మిడిలార్డర్ బ్యాటర్స్ చేతులెత్తేశారు. చివర్లో తాన్య భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో ఆమాత్రం స్కోరైనా నమోదైంది. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. -
మిథాలీ ‘డబుల్ సెంచరీ’
హామిల్టన్: ప్రపంచ మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ మకుటం లేని మహారాణిగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులను తిరగరాసిన మిథాలీ.. తాజాగా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డును సృషించారు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బరిలోకి దిగడంతో ఈ మైలురాయిని అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ 1999లో ఐర్లాండ్‌తో తొలి వన్డే ద్వారా తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 19 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మిథాలీ తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు.. ఇప్పటి వరకు 200 వన్డేలు ఆడిన ఆమె 51.66 సగటుతో 6,622 పరుగులు చేసి మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం తన మిథాలీ మాట్లాడుతూ.. భారత్ తరఫున 200 వన్డేలు ఆడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మార్పులను చూశానని తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా ఇప్పటి వరకు భారత్ 263 వన్డే మ్యాచ్‌లు ఆడగా దానిలో 200 మ్యాచ్‌ల్లో మిథాలీ ప్రాతినిథ్యం ఉండటం విశేషం. ఈ సందర్భంగా బీసీసీఐ, పలువురు క్రికెటర్లును ఆమెను అభినందించారు. -
కివీస్‌తో వన్డే: అమ్మాయిలూ తడబాటే
హామిల్టన్: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత మహిళల జట్టు కూడా బ్యాటింగ్‌లో తడబడింది. హామిల్టన్ వేదికగా సెడాన్ మైదానంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్స్ తీవ్రంగా నిరాశపరిచారు. కివీస్ బౌలర్ అన్నా పీటర్సన్(4/21) ధాటికి భారత జట్టు 149 పరుగులకే ఆలౌటైంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన కివీస్ సారథి ఏ మాత్రం ఆలోచించకుండా బౌలింగ్‌ను ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో అదరొట్టిన స్మృతి మంధన(1), రోడ్రిగ్స్(12), మిథాలీ(9)లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం హర్మన్‌ను పీటర్సన్ పెవిలియన్‌కు చేర్చింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. జట్టును దీప్తి శర్మ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం దీప్తి శర్మ(52)కూడా పీటర్సన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. చివర్లో హేమలత(13), గోస్వామి(12)లు రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. కివీస్ బౌలర్లలో పీటర్సన్ నాలుగు, లీ తహుహు మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. -
మిథాలీ ఈజ్ ది బెస్ట్
హామిల్టన్: మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ మకుటం లేని మహారాణిగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులను తిరగరాసిన మిథాలీ.. తాజాగా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును నమోదుచేసింది. వన్డే క్రికెట్లో ఛేజింగ్‌లో అత్యధిక యావరేజ్‌తో మిథాలీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఛేదనలో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో మిథాలీ కీలకపాత్ర పోషించింది. ఈ క్రమంలో మిథాలీ ఛేదనలో అత్యధిక సగటును నమోదు చేయడవ విశేషం. కాగా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్/బ్యాట్స్‌ఉమెన్‌కు సాధ్యం కాని ఉత్తమ గణాంకాలను మిథాలీ సాధించింది. ఛేజింగ్‌లో మిథాలీ యావరేజ్ 111.29గా ఉంటే ఎంఎస్ ధోని యావరేజ్ 103.07. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి 96.23తో ఉన్నాడు. రికార్డుల రారాణి ఇప్పటి వరకు 199 వన్డేలాడిన మిథాలీ మొత్తం 6,613 పరుగులుతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌వుమెన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ఖాతాలో ఏడు శతకాలు, 52 అర్థశతకాలు ఉన్నాయి. బ్యాటర్‌గా ఎంతో రాటుదేలిన మిథాలీ వన్డే నాయకురాలిగా గొప్ప విజయవంతమైంది. ఆమె నేతృత్వంలో టీమిండియా 122 మ్యాచ్‌లాడగా 75 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు 85 టీ20 మ్యాచ్‌లాడిన మిథాలీ 2,283 పరుగులు సాధించింది. టీ20ల్లోనూ అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్ మిథాలీనే కావడం విశేషం. మరోవైపు పురుషుల క్రికెట్లోనూ టీ20ల్లో ఈమెను అధిగమించిన బ్యాట్స్‌మెన్ లేకపోవడం విశేషం. ఆడిన 10 టెస్టుల్లో 663 పరుగులు చేసింది. -
మహిళా క్రికెట్లో అ‘ద్వితీయ’ శతకం
డబ్లిన్: మహిళా క్రికెట్లో మరో సంచలనం నమోదయింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ క్రీడాకారిణులు రికార్డుల మోత మోగిస్తున్నారు. తొలి వన్డేలో 490 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, తాజాగా నామమాత్రమైన మూడో వన్డేలో అమిలియా కెర్ డబుల్ సెంచరీ(232; 145 బంతుల్లో 31 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించటంతో పలు రికార్డులు తిరగరాశారు. మహిళా క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించడంతో పాటు, అతి చిన్న వయసులోనే(17 సంవత్సరాల 243 రోజులు) ఈ రికార్డు సాధించిన ప్లేయర్‌గా సంచలనం సృష్టించారు. కాగా ఇప్పటివరకు మహిళా క్రికెట్లో ఇది రెండో ద్విశతకం మాత్రమే, మొదటి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెలిందా క్లార్క్(229) సాధించారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన ఏడో వ్యక్తిగా (రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు) అమిలియా కెర్ ఈ ఘనత సాధించారు. -
మహిళా క్రికెట్లో పెను సంచలనం
డబ్లిన్: రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న మహిళా క్రికెట్లో పెనుసంచలనం నమోదయింది. ఐర్లాండ్ ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు 490 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో అటు పురుషులు, ఇటు మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా కివీస్ మహిళల జట్టు నిలిచింది. శుక్రవారం ఆతిథ్య ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టుకు ఓపెనర్లు కళ్లు చెదిరే రీతిలో శుభారంభం అందించారు. కెప్టెన్ సుజయ్ బేట్స్ 151(94 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సర్లు), జెస్సీ వాట్కిన్(62)లు చెలరేగడంతో పాటు.. మాడీ గ్రీన్ 121(77 బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్సర్), అమెలియా కెర్(81) మెరుపులు మెరిపియ్యడంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది. దీంతో 1997లో పాకిస్తాన్‌పై కివీస్ సాధించిన 455 పరుగుల రికార్డును తాజాగా అదే జట్టు చెరిపివేసి కొత్త చరిత్రను లిఖించింది. ఇక పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ చేసిన 444 పరుగులే ఇప్పటివరకు అత్యధికం కావడం గమనార్హం. -
భారత మహిళలకు షాక్
కౌలాలంపూర్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత మహిళల జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో భారత జట్టుకు షాక్ ఇచ్చింది. మహిళల క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనైనా బంగ్లాదేశ్ చేతిలో భారత్‌కిదే తొలి ఓటమి. ఈ ఆసియా టోర్నీలో 2012 తర్వాత భారత్‌కు ఎదురైన తొలి పరాజయం కూడా ఇదే. టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్లు మిథాలీ రాజ్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు), స్మృతి మంధాన (2) విఫలమవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37 బంతుల్లో 42; 6 ఫోర్లు), దీప్తి శర్మ (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. పూజ వస్త్రాకర్ (20 బంతుల్లో 20; 4 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రుమానా అహ్మద్ 3 వికెట్లు తీసింది. తర్వాత బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షమీమా సుల్తానా (23 బంతుల్లో 33; 7 ఫోర్లు), ఫర్జానా హక్ (46 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రుమానా అహ్మద్ (34 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఫర్జానా, రుమానా అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను గెలిపించారు. భారత బౌలర్లు పూజ, రాజేశ్వరి, పూనమ్ తలా ఒక వికెట్ తీశారు. గురువారం జరిగే తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. మిగతా లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 23 పరుగులతో లంకను, థాయ్‌లాండ్ 9 వికెట్లతో మలేసియాను ఓడించాయి. -
నువ్వా నేనా..?
ముంబై: భారతగడ్డపై వారంరోజులపాటు జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ తుదిదశకు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ మహిళాజట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. లీగ్దశలో తాను ఆడిన చివరిరెండు మ్యాచ్‌ల్లో దూకుడు ప్రదర్శించిన ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ టోర్నీలో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగానే రాణించింది. బేత్ మూనీ, అలీసా హీలీ, కెప్టెన్ మెగ్ ల్యానింగ్, ఎలీసా విలానీ, ఎలీసా పెర్రీలు బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. తమదైన రోజున ఏ బౌలింగ్ విభాగాన్నైనా వీరు సమర్థంగా ఎదుర్కొనగలరు. ముఖ్యంగా లీగ్ తొలిగేమ్‌లో విఫలమైన ల్యానింగ్ ప్రస్తుతం మంచి టచ్‌లో ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే మెగన్ ష్కట్ అద్భుతంగా రాణిస్తోంది. ఇంగ్లండ్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపాలంటే ష్కట్ స్థాయికి తగ్గట్లుగా రాణించాల్సి ఉంది. తనకు పేసర్ దిలీసా కిమిన్స్, స్పిన్నర్లు ఆష్లే గార్డెనర్, జోనాసెన్ల నుంచి సహకారం లభించాల్సి ఉంది. మరోవైపు ఫీల్డింగ్ విభాగం మెరుగుపడాలి. టోర్నీలో ఆసీస్ ప్లేయర్లు చాలా క్యాచ్‌ల్ని జారవిడిచారు. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే రెండు వరుస విజయాలతో టోర్నీలో శుభారంభం చేసింది. ఇందులో భారత్‌పై చేసిన 199 పరుగుల ఛేదన అద్భుతమనడంలో సందేహంలేదు. అయితే అనంతరం జోరు కొనసాగించడంలో ఇంగ్లిష్జట్టు విఫలమైంది. చివరిరెండు మ్యాచ్‌ల్లో ఆసీస్, భారత్ చేతిలో ఘోర పరాజయాలు పాలైంది. ముఖ్యంగా 97, 107 పరుగులకే ఇంగ్లిష్ జట్టు బోల్తాపడడం ఆ జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. ఈక్రమంలో ఈ మ్యాచ్‌లో సత్తాచాటి విజేతగా నిలివాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. ఓపెనర్ డేనియెలి వ్యాట్‌పైనే బ్యాటింగ్ భారం ఉంది. తను ఈ మ్యాచ్‌లో సత్తాచాటాల్సిన అవసరముంది. తనతోపాటు నటాఈ స్కివర్, తమ్సిమ్ బీమంట్, కెప్టెన్ హీథర్ నైట్లు ఆకట్టుకోవాలి. కేటీ జార్జ్, టాష్ ఫర్రంట్, జేనీ గన్లపై ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం ఆధారపడి ఉంది. జట్లు ఆస్ట్రేలియా: ల్యానింగ్ (కెప్టెన్), రేచల్ హేన్స్, నికోలా కారే, గార్డెనర్, హీలీ, జోనాసెసన్, కిమిన్స్, సోఫీ మోలినెక్స్, మూనీ, పెర్రీ, ష్కట్, స్టేల్బర్గ్, విలానీ, వెల్లింగ్టన్. ఇంగ్లండ్: నైట్ (కెప్టెన్), బీమంట్, డేవిడ్సన్, ఎకిల్‌స్టోన్, ఫర్రంట్, కేటీ, గన్, హర్ట్లీ, హెల్, అమీ జోన్స్, ఆన్య ష్రబ్సోల్, స్కివర్, విల్సన్, వాయ్ట్. -
షుట్ ‘హ్యాట్రిక్’... భారత్ ‘హ్యాట్రిక్’
ముంబై: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి. తమ వైఫల్యాన్ని కొనసాగిస్తూ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 36 పరుగులు తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెత్ మూనీ (46 బంతుల్లో 71; 8 ఫోర్లు), ఎలిస్ విలాని (42 బంతుల్లో 61; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులకే పరిమితమైంది. జెమీమా రోడ్రిగ్స్ (41 బంతుల్లో 50; 8 ఫోర్లు) అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. చివర్లో అనూజ పాటిల్ (26 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయారు. ఆసీస్ పేసర్ మెగాన్ షుట్ (3/31) ‘హ్యాట్రిక్’తో భారత్‌ను దెబ్బ తీసింది. తన తొలి ఓవర్లో స్మృతి మంధన (3), మిథాలీ రాజ్ (0)లను వరుస బంతుల్లో బౌల్డ్ చేసిన షుట్...తర్వాతి ఓవర్లో దీప్తి శర్మ (2)ను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. భారత్ నామమాత్రమైన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గురువారం ఇంగ్లండ్‌తో తలపడుతుంది. -
ఆస్ట్రేలియా భారీ స్కోర్
వడోదర : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత మహిళల జట్టుతో జరుగుతున్న నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కీపర్ అలైసా హేలీ (133;115బంతుల్లో17 ఫోర్లు, 2సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా తరపున భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది. ఆస్ట్రేలియా 64 పరుగులకే నికోల్ బోల్టన్(11), లాన్నింగ్(18) వికెట్లను కోల్పోగా, అలైసా హేలీ-ఎలైస్ పెర్రీ జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఈ జోడి 79 పరుగులు జోడించిన అనంతరం పెర్రీ (32) మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరింది. తరువాత వచ్చిన ప్లెయర్స్లో రాచెల్ హేన్స్ (43, 39బంతుల్లో 5ఫోర్లు), యాష్లే గార్డనర్ (35, 20బంతుల్లో 6 ఫోర్లు), మూనీ(34, 19బంతుల్లో 5ఫోర్లు) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోర్ సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ, శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ తలో వికట్ తీశారు. మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో భారత మహిళా జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎక్తాబిస్త్కు గాయం భారత క్రీడాకారిణి ఏక్తా బిస్త్ బౌలింగ్ చేస్తూ గాయపడటంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడింది. -
మిథాలీ మెరుపులు
ఈస్ట్ లండన్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. ఓపెనర్లు స్మృతి మంధాన (42 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (61 బంతుల్లో 76 నాటౌట్; 8 ఫోర్లు) అద్భుత ఆటతీరుతో శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 9 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. తొలుత దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్యూన్ లుస్ (33), డిక్లెర్క్ (26) మినహా మిగతావారు విఫలమయ్యారు. స్పిన్నర్లు పూనమ్ యాదవ్ (2/18), అనూజ పాటిల్ (2/37) రాణించారు. అనంతరం ఛేదనలో భారత్ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఆడింది. ప్రొటీస్ జట్టులో ఏడుగురు బౌలింగ్ చేసినా మంధాన, మిథాలీలను నిలువరించలేకపోయారు. 14.2 ఓవర్లలో 106 పరుగులు చేశాక ఈ జోడీని డేనియల్స్ విడదీసింది. 20వ ఓవర్ మొదటి బంతిని బౌండరీకి తరలించిన మిథాలీ లాంఛనాన్ని పూర్తిచేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2–0 ఆధిక్యంలో ఉంది. ఈ నెల 18, 21, 24 తేదీల్లో జరిగే మిగిలిన మ్యాచ్‌లు సోనీ టెన్–1, 3లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
అన్నింటా ఫస్ట్‌క్లాస్...
‘శతక్కొట్టి... చితగ్గొట్టింది’... ‘అజేయంగా... అద్వితీయంగా’... ‘మరో సిరీస్‌లోనూ దంచేసింది’... ‘ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్’... ఇవన్నీ ఈ ఏడాది టీమిండియా ఘన విజయాల పతాక శీర్షికలు. నిజమే లైవ్‌లో చూసినా, ‘లైక్’ కొట్టి చూసినా... క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ ఏడాది కనుల పండువగా సాగింది. నిజంగా ఈ సంవత్సరం ఓ గెలుపు వసంతంగా మిగిలిపోయింది. ఏ జట్టు ఎదురైనా విజయం మాత్రం కోహ్లి సేనదే. విరాట్ పూర్తిస్థాయి సారథ్యం... భారత్ అజేయ నేపథ్యం... 2017ను క్రికెట్ జాతి గుండెల్లో ఎవరెస్టంత ఎత్తులో నిలిపింది. –సాక్షి క్రీడా విభాగం ఈ ఏడాది మొదట్లో ‘బాహుబలి–2’ కోసం బాగా ఎదురు చూశాం. కానీ ఏడాదంతా కూడా భారత్‌తో బాగా ఆడిన ప్రత్యర్థినే చూడలేకపోయాం. తీరం దాటిన తుఫాను తెలుసు. కానీ టీమిండియాను దాటిన ప్రత్యర్థే లేదు. హరికేన్లు, టోర్నడోల బీభత్సం గురించి విన్నాం. కానీ భారత్ సిరీస్ పరాజయం వార్తే వినలేకపోయాం. టీమిండియా సాఫల్యం గురించి ఒక్క మాటలో చెబితే చాలదు. ఒక్క మైదానంతో ఆగలేదు. ఒక్క మ్యాచ్‌తో పొంగిపోలేదు. ఒక్క సిరీస్‌తో అలసిపోలేదు. ఓవరాల్‌గా... భారత్ చేరిన ఏ జట్టును విడిచిపెట్టలేదు. నేర్పుగా ఆడింది. ఓర్పుగా కాచుకుంది. తీరిగ్గా ఓడించింది. గెలుపు మలుపును ఆసాంతం ఆస్వాదించింది. ఈ ఏడాది భారత్ ఆడిన మ్యాచ్‌లు 54. వీటిలో విజయాలు 37. దీనిని శాతాల్లోకి మారిస్తే 68.51. అంటే మన జట్టు ఫస్ట్ క్లాస్‌లో పాసైనట్లు. చిత్రమేమంటే... 2017లో టెస్టుల్లో ఆధిపత్యం సాగించినట్లు కనిపించినా, విజయ శాతం (72.41) మాత్రం వన్డేల్లోనే అధికంగా ఉండటం. ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటమూ ఇందుకు కారణం కావొచ్చు. అయితే... శ్రీలంకతో స్వదేశంలో తాజాగా ముగిసిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు డ్రా కాకుంటే టెస్టు శాతం మెరుగ్గా ఉండేది. ఇక టి20ల్లో 64.28 గెలుపు శాతం నమోదైంది. గణాంకాలు, ఆటగాళ్ల ప్రదర్శన పరంగా 2017 భారత జట్టుకు అద్వితీయంగా సాగింది. అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా విరాట్ కోహ్లి... ఆకాశమే హద్దుగా చెలరేగి 2,818 పరుగులు సాధించాడు. చరిత్రలో ఇది మూడో అత్యధికం కావడం విశేషం. వన్డేల్లో 31వ శతకంతో... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. శ్రీలంకపై రెండు వరుస ద్విశతకాలతో ఆరు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా, టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకను టెస్టుల్లో వారి సొంతగడ్డపై 3–0తో ఓడించిన భారత జట్టు విదేశాల్లో 50 ఏళ్ల తర్వాత వరుసగా మూడు టెస్టులు గెలిచిన ఘనత దక్కించుకుంది. చేజారిన ఆ ఒక్కటి...: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అలవోకగా విజయం సాధించి... దక్షిణాఫ్రికానూ మట్టికరించి... సెమీస్‌లో బంగ్లా గండం దాటిన భారత్‌కు... ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. ఈ పరాజయం వన్డే జట్టు కూర్పుపైనా ప్రభావం చూపింది. స్పిన్‌లో వైవిధ్యం చూపాలన్న ఆలోచనతో తదనంతర పరిణామాల్లో అశ్విన్, జడేజాలు జట్టులో స్థానం కోల్పోయారు. అయితే.. వీరిద్దరూ ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టెస్టు బౌలర్లలో రెండు, నాలుగో స్థానాల్లో నిలిచి జట్టు అగ్రస్థానం అందుకోవడంలో తమవంతు పాత్ర పోషించారు. మణికట్టు మాయాజాలం... ఏ ఫార్మాట్లో అయినా... మొన్నటివరకు భారత స్పిన్ ద్వయం అంటే గుర్తొచ్చింది అశ్విన్, జడేజాలే. కానీ 2017లో వారికి వన్డే, టి20 ద్వారాలు క్రమంగా మూసుకుపోయాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రధాన అస్త్రాలుగా మారారు. దీనికి తగ్గట్లే చహల్ 44, కుల్దీప్ 34 వికెట్లు తీసి తమ ఎంపికకు న్యాయం చేశారు. రో‘హిట్‌మ్యాన్’ అయ్యాడు అపార ప్రతిభావంతుడిగా పేరున్నా... అందుకు తగిన న్యాయం చేయలేడని అపవాదున్న రోహిత్ శర్మ ఈ ఏడాది దానిని దాదాపు చెరిపేశాడు. వన్డేల్లో మూడో ద్విశతకం, టి20ల్లో వేగవంతమైన శతకంతో పాటు టెస్టుల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. సారథ్య బాధ్యతలనూ చేపట్టి జట్టును నడిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏడాది అతడికి దక్కిన బిరుదు ‘హిట్‌మ్యాన్’. వ్యాఖ్యాతల నోళ్లలో నానిన ఈ పేరు భారీ షాట్లు కొట్టే రోహిత్‌కు సరిపోయేదే. ఇకపై అభిమానులూ అలానే పిలుచుకునేలా ఇన్నింగ్స్‌లు ఆడాలని ఆశిద్దాం. ‘జంబో’ వైదొలిగాడు... అనిల్ కుంబ్లే... ప్రపంచ క్రికెట్లో దిగ్గజం. భారత్ ఆణిముత్యం. టీమిండియా కోచ్‌గా అతడి నియామకాన్ని అన్ని వర్గాల వారూ హర్షించారు. సరైన వ్యక్తిని ఎంపిక చేశారంటూ కొనియాడారు. కానీ... ఈ జెంటిల్మన్ జట్టులో కొందరికి ‘హెడ్మాస్టర్’లా కనిపించాడు. అతడి క్రమ‘శిక్షణ’, ఆలోచనలు అర్థం చేసుకోలేకపోయారు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఫలితం తేల్చే ధర్మశాల టెస్టులో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించడం దగ్గర మొదలైన అభిప్రాయ భేదాలు చాంపియన్స్ ట్రోఫీ వరకూ కొనసాగాయి. తర్వాతి వెస్టిండీస్ పర్యటనకూ కుంబ్లే కోచ్‌గా ఉంటాడని తొలుత ప్రకటించినా... దిగ్గజ ఆటగాళ్లు కోచ్‌గా ఇమడలేరని మరోసారి నిరూపిస్తూ ‘జంబో’ వైదొలిగాడు. ఓడారు... కానీ పోరాడారు వరల్డ్‌కప్ ప్రయాణానికి ముందు... ముంబై బాంద్రాలోని ఓ ఇండోర్ అకాడమీలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, కోచ్ తుషార్ విలేకరుల సమావేశం. హాజరైన విలేకరులు వేళ్లమీద లెక్కబెట్టగలిగినంత. దీనికి తగ్గట్లే సమావేశం కూడా కొద్దిసేపే సాగింది. వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం... విమానాశ్రయంలో బ్యానర్లతో వేలాదిమంది అభిమానులు. ఈసారి విలేకరుల సమావేశం అయిదు నక్షత్రాల హోటల్లోని ఓ పెద్ద గదిలో. లెక్కకు మిక్కిలి మీడియా సిబ్బందితో ఆ గది నిండిపోయింది. ...అదే జట్టు. అదే కెప్టెన్. అదే కోచ్. కానీ 45 రోజుల వ్యవధిలో అంతా మారిపోయింది. 2017లో భారత మహిళల క్రికెట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ తేడానే ప్రముఖంగా పేర్కొనాలి. ప్రపంచకప్‌లో వారి రన్నరప్ ప్రదర్శన అంత ప్రభావం చూపింది మరి. ఫైనల్లో ఓడినా...భారత మహిళల జట్టుకు స్వదేశంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఓవరాల్‌గా మహిళల క్రికెట్ జట్టుకు ఇది శుభ సంవత్సరమే. ఆడిన మూడు టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరి రెండింటిలో టైటిల్ నెగ్గింది. మొత్తం 20 మ్యాచ్‌ల్లో 16 గెలిచింది. -
భారత్ ‘ఎ’ జట్టులో మేఘన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే, టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్లను ప్రకటించారు. రెండు ఫార్మాట్లలో అనూజా పాటిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 జట్లలో స్థానాన్ని సంపాదించింది. 21 ఏళ్ల మేఘన ఇప్పటివరకు భారత్ తరఫున ఆరు టి20 మ్యాచ్‌ల్లో ఆడింది. ఇటీవలే బీసీసీఐ అండర్–19 టోర్నమెంట్లో డబుల్ సెంచరీ సాధించిన 16 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌కు కూడా ఈ రెండు జట్లలో చోటు లభించడం విశేషం. డిసెంబరు 2, 5, 7వ తేదీల్లో జరిగే మూడు వన్డేలకు హుబ్లీ... 12, 14, 16వ తేదీల్లో జరిగే మూడు టి20 మ్యాచ్‌లకు బెల్గామ్ ఆతిథ్యం ఇస్తాయి. అంతకుముందు ఈనెల 26, 28వ తేదీల్లో అలూర్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. -
‘అమ్మ’గా మైదానంలోకి!
సాక్షి క్రీడావిభాగం మేరీకామ్...! భారత బాక్సింగ్‌లో ఆమె ఓ సంచలన చాంపియన్. ముగ్గురు పిల్లలకు తల్లయినా... ఇప్పుడు ఓ ఎంపీ అయినా... రింగ్‌లో మాత్రం చాంపియన్ అయ్యే అలవాటును మార్చుకోలేదు. బహుశా ఈమె స్ఫూర్తితోనే ఏమో... భారత మహిళా క్రికెటర్ నేహా తన్వర్ కూడా ఓ అబ్బాయికి అమ్మయినా... మళ్లీ ఆటకు సై అంటోంది. భారత ‘ఎ’ మహిళల జట్టు తరఫున బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో వన్డే, టి20 సిరీస్‌కు సిద్ధమైంది. ఢిల్లీకి చెందిన నేహా ఆరేళ్ల (2011) క్రితం భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున వెస్టిండీస్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లాడింది. 2014లో ఆమె రిటైరయ్యే నాటికి చెప్పుకోదగ్గ గణాంకాలేవీ లేకపోయినా... గర్భం దాల్చడంతో ఆటకు దూరమైంది. అక్టోబర్‌లో ఓ పండటి మగ శిశువుకు జన్మనిచ్చిన 31 ఏళ్ల నేహా... పుత్రోత్సాహంతో పూర్తిగా ఇంటికే పరిమితమైంది. కానీ ఆట లేని లోటు ఆమెను తొలచివేయడంతో మళ్లీ బ్యాట్ పట్టాలని నిర్ణయించుకుంది. డాక్టర్ల సలహాతో కాన్పు జరిగిన ఆరు నెలల తర్వాత మెల్లగా ప్రాక్టీస్‌కు దిగింది. దీంతో అప్పుడు గానీ అసలు సమస్యలేవో తెలియలేదు. కడుపులో పిల్లాడి కోసం బలవర్ధమైన పోషకాహారం వల్ల ఆమె బరువు పెరిగింది. దీంతో ఆట అంత ఈజీ కాదని అర్థమైంది. అయినా పట్టుదల కొద్దీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. 60 కేజీల నుంచి ప్రెగ్నెన్సీ సమయంలో 80 కేజీలకి చేరిన ఆమె క్రమం తప్పని ప్రాక్టీస్‌తో ఇప్పుడు అటు ఇటూగా తన పూర్వస్థాయికి వచ్చేసింది. ఇక ఇప్పుడు బరిలోకి దిగడమే తరువాయి. నిజమే...ఆడాలన్న తపనే ఉంటే ఏదైనా సాధ్యమే కదా!! నా భర్త సహకారం వల్లే మళ్లీ బరిలోకి దిగుతున్నాను. మాతృత్వం వరమే. మహిళలకు అది పునర్జన్మ. అమ్మతనం అన్నీ మార్చేస్తుంది. జీవితంలో ప్రాధాన్యతలు మారిపోతాయి. కానీ కొన్ని విషయాలే ఎప్పటికీ మారవు. సాధించాలను కుంటే సాధ్యం కానిదేదీ ఉండదు. – నేహ తన్వర్ -
మహిళల క్రికెట్ విజేత రైల్వేస్ జట్టు
రన్నరప్ మహారాష్ట్ర జట్టు గుంటూరు స్పోర్ట్స్: సీనియర్ ఉమెన్ వన్డే క్రికెట్ లీగ్ టోర్నమెంట్ విజేతగా రైల్వేస్ జట్టు నిలిచింది. మహారాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమి, పేరేచర్లలోని ఏసీఏ, జాగర్లమూడి నరేంద్రనాథ్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లలో రైల్వేస్ జట్టు 12 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ జట్లు చెరో నాలుగు పాయింట్లు సాధించాయి. అయితే రన్‌రేట్ ఆధారంగా మహారాష్ట్ర జట్టును రన్నరప్‌గా ప్రకటించారు. మంగళవారం జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమిలో జరిగిన వన్డే మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 139 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన రైల్వేస్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 43.2 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి పరాజయం పాలైంది. పేరేచర్లలో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ జట్టు 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. విజేత రైల్వేస్, రన్నరప్ మహారాష్ట్ర జట్లకు ట్రోఫీలు అందించారు. కార్యక్రమంలో మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు డకౌట్లు.. 76 పరుగులు
దంబుల్లా:నాలుగు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆదివారం రాణ్గిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక మహిళలు కుప్పకూలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక మహిళలు కనీసం పోరాడకుండానే క్యూ కట్టేశారు. ఓపెనర్లు జయంగణి, వీరక్కోడీ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన కుమారిహామీ తొలి బంతికి పెవిలియన్ చేరింది. ఆపై సురాంగిక, హన్సిక్ లు డకౌట్లుగా వెనుదిరగగా, ఇమాల్కా మెండిస్ పరుగు మాత్రమే చేసి నిష్క్రమించింది. ఇనోషి ప్రియదర్శిని కూడా డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టింది. దీంతో శ్రీలంక ఆరు వికెట్లను డకౌట్ల రూపంలో నష్టపోయింది. కాగా, మధ్యలో రణవీర(32 నాటౌట్), కౌశల్య(14) ఫర్వాలేదనిపించడంతో శ్రీలంక 24.5 ఓవర్లలో 76 పరుగుల అత్యల్ప స్కోరుకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫెర్లింగ్, బీమ్స్ తలో మూడు వికెట్లతో రాణించగా, ష్కట్, ఓస్ బోర్నీలకు చెరో రెండు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 15.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. -
20 నుంచి మహిళల క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మహిళల క్రికెట్ జట్టు కోసం ఈనెల 20 నుంచి సెలక్షన్స్ ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి ప్లేగ్రౌండ్సలో మూడు రోజుల పాటు ఈ ఎంపిక పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు సౌత్‌జోన్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఓయూ జట్టుకు ఎంపికవుతారు. -
సెంట్రల్ జోన్ సునాయాస విజయం
► 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన నార్త్‌జోన్ జట్టు విజయనగరం మున్సిపాలిటీ : ఇంటర్ జోనల్ ఉమెన్ క్రికెట్ పోటీల్లో సెంట్రల్ జోన్ జట్టు సునాయాస విజయాన్ని నమోదు చేసింది. డెంకాడ మండలంలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో అతిథ్య నార్త్‌జోన్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. టాస్ గెలిచిన నార్త్‌జోన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. జట్టులో వి.స్నేహదీప్తి (60 బంతుల్లో 39 పరుగులు) మినహా మిగిలిన వారెవరూ ఎక్కువ సమయం మైదానంలో నిలువలేకపోయారు. బౌలింగ్ విభాగంలో సెంట్రల్‌జోన్ క్రీడాకారిణులు సి.హెచ్.ఝాన్సీలక్ష్మి 3 వికెట్లు, కె.ధాత్రి 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్‌జోన్ క్రీడాకారులు కేవలం 32.3 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసి విజయం సాధించారు. జట్టులో ఎస్.మేఘన 63 బంతుల్లో 60 పరుగులు చేయగా... టి.మల్లిక 79 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సారథ్యంలో నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా సోమవారం సౌత్‌జోన్–సెంట్రల్‌జోన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
కడప, అనంతపురం జట్ల విజయభేరి
కడప స్పోర్ట్స్: కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల్లో మంగళవారం కడప, అనంతపురం జట్లు విజయం సాధించాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో చిత్తూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతపురం బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన చిత్తూరు జట్టు 14.2 ఓవర్లలో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. అనంతపురం బౌలర్లు బి. అనూష 4, ఫరూఖున్నీసీ 2, పూజారిపల్లవి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో అనంతపురం జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో అనంతపురం జట్టుకు 4 పాయింట్లు లభించాయి. నెల్లూరుపై కడప జట్టు విజయం... కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 36.3 ఓవర్లలో 80 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని యామిని 25, సింధుజ 11 పరుగులు చేసింది. కడప బౌలర్లు మౌనిక 4, ఓబులమ్మ 3, శిరీష 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 22.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. జట్టులోని రోజా 31, జ్యోతి 21, మౌనిక 19 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో కడప జట్టుకు 4 పాయింట్లు లభించాయి. -
మహిళల 'ప్రాక్టీస్' కు వర్షం అడ్డంకి
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గవర్నర్-జనరల్స్ ఎలెవన్ తో భారత మహిళలు ఆడాల్సిన ఏకైక ట్వంటీ 20 ప్రాక్టీస్ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కొన్ని ఓవర్లు పాటు మాత్రమే సాధ్యమైంది. గవర్నర్-జనరల్ జట్టు 19/1 వద్ద ఉండగా భారీ వర్షం పడటంతో మ్యాచ్ ను నిలిపి వేయక తప్పలేదు. అనంతరం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయి మ్యాచ్ నిర్వహణకు సాధ్య పడలేదు. ఇరు జట్ల మధ్య మూడు ట్వంటీ 20లు, మూడు వన్డేలు జరుగనున్నాయి. తొలి ట్వంటీ 20 జనవరి 26 వ తేదీన అడిలైడ్ లో, రెండో టీ 20 మెల్ బోర్న్ లో జనవరి 29న, మూడో ట్వంటీ 20 సిడ్నీలో జనవరి 31న జరుగనుంది. ఈ సిరీస్ లో మిథాలీ రాజ్ భారత్ కు సారథ్యం వహిస్తుండగా, ఆల్ రౌండర్ జులాన్ గోస్వామి వైస్ కెప్టెన్ వ్యహరిస్తోంది. -
క్రీడా వాతావరణం పెరగాలి
♦ ఆటగాళ్లను విమర్శించడం మానండి ♦ సునీల్ ఛెత్రి సూచన సాక్షి, హైదరాబాద్ : మన దేశంలో ఒక ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదని, మన వద్ద అలాంటి పక్కా వ్యవస్థ లేదని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అభిప్రాయ పడ్డాడు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఎంత మందికి సరైన శిక్షణ లభిస్తోందని అతను ప్రశ్నించాడు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియాస్ పొటెన్షియల్ యాజ్ ఎ స్పోర్టింగ్ నేషన్’ అనే అంశంపై బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో ఛెత్రితో పాటు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, మిథాలీరాజ్ పాల్గొన్నారు. మాజీ రంజీ క్రికెటర్ విజయ్ మోహన్ రాజ్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మనోళ్లు ఓడిపోయారా...ఒలింపిక్స్‌లో మూడే పతకాలా అనే విమర్శించేవారు వాస్తవాలు గుర్తించాలని ఛెత్రి అన్నాడు. తమ తల్లిదండ్రులు పిల్లల జీవితంలో ఆటలు భాగంగా చేయనంత కాలం ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా తాము ఎదిగేందుకు పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు. తాను ఆటను ఆరంభించినప్పుడు తన తల్లిదండ్రులు మినహా ఎవరూ ప్రోత్సహించలేదని, ఇప్పటికీ ఆటల పట్ల చాలా మందిలో చులకనభావం ఉందని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ మరిన్ని పతకాలు సాధించాలంటే వ్యవస్థ ఇంకా పక్కాగా ఉండాలని అశ్విని సూచించింది. మిథాలీరాజ్ మాట్లాడుతూ... బీసీసీఐ మహిళా క్రికెట్‌ను తీసుకోక ముందే తాను ఎన్నో ఘనతలు సాధించానని, చిన్నప్పటినుంచి ఆటపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని గుర్తు చేసుకుంది. తాము ఆడినప్పుడు బాలికల ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలు ఉండేవని, ఇప్పుడు బోర్డు చేతుల్లోకి వచ్చినా అమ్మాయిలకు తగినన్ని మ్యాచ్‌లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. చాంపియన్ ఆటగాళ్లను గౌరవించాలని, వారు పడిన శ్రమను గుర్తించాలని ఈ సందర్భంగా ఆటగాళ్లు విజ్ఞప్తి చేశారు. శాప్ ఎండీ రేఖారాణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అమ్మాయిలు అదరగొట్టారు..
బెంగళూరు: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-2తో గెల్చుకుంది. చివరి, ఐదో వన్డేలో భారత్ జట్టు 9 వికెట్లతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ 41 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బేట్స్ (42) మినహా ఇతర క్రీడాకారిణులు విఫలమయ్యారు. భారత బౌలర్లు జులన్ గోస్వామి, గైక్వాడ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యసాధనలో భారత్ 27.2 ఓవర్లలో కేవలం వికెట్ కోల్పోయి విజయాన్నందుకుంది. కామిని (62 నాటౌట్), దీప్తి శర్మ (44 నాటౌట్) రాణించారు. -
వాళ్లు చతికిల బడ్డా.. వీళ్లు నిలబడ్డారు!
-
ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం
వార్మ్ స్లే: ఇంగ్లండ్ తో ఇక్కడ జరిగిన ఏకైక మహిళల టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ విసిరిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన భారత్ మహిళలు ఆద్యంతం ఆకట్టుకుని విజయాన్ని చేజిక్కించుకున్నారు. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత మహిళలు ఇంగ్లండ్ ను కంగుతినిపించి సిరీస్ ను కైవసం చేసుకున్నారు. భారత రెండో ఇన్నింగ్స్ లో కామిని(28), మందన(51) పరుగులు చేసి తొలి వికెట్టుకు 76 పరుగులతో మంచి శుభారంభాన్నివ్వగా, మిథాలీ రాజ్ (50 ), ఎస్ పాండే (28 ) పరుగులు చేసి భారత్ కు విజయాన్ని సాధించిపెట్టారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 110/6 వికెట్లతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లండ్ 202 పరుగులకు ఆలౌటయ్యింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 114 పరుగులకు ఆలౌట్ అవ్వగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగుల ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ క్రాస్ కు మూడు వికెట్లు లభించగా, నైట్ కు ఒక వికెట్టు దక్కింది. ఎనిమిది సంవత్సరాల అనంతరం భారత మహిళలు ఆడుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. -
విజయం దిశగా టీమిండియా
వార్మ్ స్లే:ఇంగ్లండ్ తో జరిగే ఏకైక మహిళల టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. ఇంగ్లండ్ విసిరిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన భారత్ మహిళలు ఆద్యంతం ఆకట్టుకుని విజయానికి చేరువయ్యారు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 151 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా భారత్ విజయానికి 30 పరుగులు అవసరం. భారత మహిళలు మిథాలీ రాజ్(36), ఎస్ పాండే(16) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత రెండో ఇన్నింగ్స్ లో కామిని(28), మందన(51) పరుగులు చేసి తొలి వికెట్టుకు 76 పరుగులు చేసి మంచి శుభారంభాన్నిచ్చారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 110/6 వికెట్లతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లండ్ 202 పరుగులకు ఆలౌటయ్యింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగుల ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 114 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ క్రాస్ కు మూడు వికెట్లు లభించగా, నైట్ కు ఒక వికెట్టు దక్కింది. ఎనిమిది సంవత్సరాల అనంతరం భారత మహిళలు ఆడుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. -
'మహిళా క్రికెట్ లో ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు నిర్వహించండి'
హైదరాబాద్:భారత్ లో మహిళల టెస్ట్ క్రికెట్ ఆదరణ తగ్గకుండా ఉండాలంటే తగినన్ని ఎక్కువ టెస్టు మ్యాచ్ లు నిర్వహించాలని హైదరాబాద్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. భారత్ మహిళా క్రికెట్ లో 148 వన్డేలు ఆడిన 31 ఏళ్ల మిథాలీ రాజ్.. ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది టెస్టు మ్యాచ్ లనే ఆడింది. 'నేను 8 ఏళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్ ఆడాను. అందులో 214 పరుగులు చేశాను. అప్పట్నుంచి ఇప్పటి వరకూ టెస్టు మ్యాచ్ ఆడలేదు. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు నిర్వహిస్తే భారత మహిళా క్రికెట్ కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుంది' అని మిథాలీ పేర్కొంది. దీనిపై బీసీసీఐ తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకూ మహిళా టెస్టు మ్యాచ్ లు జరిగిన సందర్భాలు తక్కువ. త్వరలో ఇంగ్లండ్ టూర్ కు బయల్దేరనున్నభారత మహిళలు జట్టు ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడనుంది. -
10 ఓవర్లు.. 3 మెయిడెన్లు.. 4 వికెట్లు
విశాఖపట్నం: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-0 గెల్చుకుంది. ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 47.1 ఓవర్లలో 140 పరుగులు చేసింది. హైదరాబాద్ అమ్మాయి గౌహర్ సుల్తానా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసింది. 10 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. తొలి వన్డేలో 8 ఓవర్లలో 4 మెయిడెన్లు వేసి 4 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం విశేషం. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 39.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మంధన 51, రౌత్ 38, కెప్టెన్ మిథాలీ రాజ్ 31 పరుగులతో రాణించారు. ఇదే వేదికపై ఆదివారం జరిగిన తొలి వన్డేలోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.