అన్నింటా ఫస్ట్‌క్లాస్‌...  | special story to indian cricket team 2017 | Sakshi
Sakshi News home page

అన్నింటా ఫస్ట్‌క్లాస్‌... 

Published Sun, Dec 31 2017 12:56 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

special  story  to indian cricket team 2017 - Sakshi

‘శతక్కొట్టి... చితగ్గొట్టింది’... ‘అజేయంగా... అద్వితీయంగా’...  ‘మరో సిరీస్‌లోనూ దంచేసింది’... ‘ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌’...  ఇవన్నీ ఈ ఏడాది టీమిండియా ఘన విజయాల పతాక శీర్షికలు. నిజమే లైవ్‌లో చూసినా, ‘లైక్‌’ కొట్టి చూసినా... క్రికెట్‌ అభిమానులకు మాత్రం ఈ ఏడాది కనుల పండువగా సాగింది. నిజంగా ఈ సంవత్సరం ఓ గెలుపు వసంతంగా మిగిలిపోయింది. ఏ జట్టు ఎదురైనా విజయం మాత్రం కోహ్లి సేనదే. విరాట్‌ పూర్తిస్థాయి సారథ్యం... భారత్‌ అజేయ నేపథ్యం... 2017ను క్రికెట్‌ జాతి గుండెల్లో ఎవరెస్టంత ఎత్తులో నిలిపింది.       –సాక్షి క్రీడా విభాగం

ఈ ఏడాది మొదట్లో ‘బాహుబలి–2’ కోసం బాగా ఎదురు చూశాం. కానీ ఏడాదంతా కూడా భారత్‌తో బాగా ఆడిన ప్రత్యర్థినే చూడలేకపోయాం. తీరం దాటిన తుఫాను తెలుసు. కానీ టీమిండియాను దాటిన ప్రత్యర్థే లేదు. హరికేన్లు, టోర్నడోల బీభత్సం గురించి విన్నాం. కానీ భారత్‌ సిరీస్‌ పరాజయం వార్తే వినలేకపోయాం. టీమిండియా సాఫల్యం గురించి ఒక్క మాటలో చెబితే చాలదు. ఒక్క మైదానంతో ఆగలేదు.  ఒక్క మ్యాచ్‌తో పొంగిపోలేదు. ఒక్క సిరీస్‌తో అలసిపోలేదు. ఓవరాల్‌గా... భారత్‌ చేరిన ఏ జట్టును విడిచిపెట్టలేదు. నేర్పుగా ఆడింది. ఓర్పుగా కాచుకుంది. తీరిగ్గా ఓడించింది. గెలుపు మలుపును ఆసాంతం ఆస్వాదించింది.   

ఈ ఏడాది భారత్‌ ఆడిన మ్యాచ్‌లు 54. వీటిలో విజయాలు 37. దీనిని శాతాల్లోకి మారిస్తే 68.51. అంటే మన జట్టు ఫస్ట్‌ క్లాస్‌లో పాసైనట్లు. చిత్రమేమంటే... 2017లో టెస్టుల్లో ఆధిపత్యం సాగించినట్లు కనిపించినా, విజయ శాతం (72.41) మాత్రం వన్డేల్లోనే అధికంగా ఉండటం. ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటమూ ఇందుకు కారణం కావొచ్చు. అయితే... శ్రీలంకతో స్వదేశంలో తాజాగా ముగిసిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు డ్రా కాకుంటే టెస్టు శాతం మెరుగ్గా ఉండేది. ఇక టి20ల్లో 64.28 గెలుపు శాతం నమోదైంది.  

గణాంకాలు, ఆటగాళ్ల ప్రదర్శన పరంగా 2017 భారత జట్టుకు అద్వితీయంగా సాగింది. అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి... ఆకాశమే హద్దుగా చెలరేగి 2,818 పరుగులు సాధించాడు. చరిత్రలో ఇది మూడో అత్యధికం కావడం విశేషం. వన్డేల్లో 31వ శతకంతో... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. శ్రీలంకపై రెండు వరుస ద్విశతకాలతో ఆరు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా, టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకను టెస్టుల్లో వారి సొంతగడ్డపై 3–0తో ఓడించిన భారత జట్టు విదేశాల్లో 50 ఏళ్ల తర్వాత వరుసగా మూడు టెస్టులు గెలిచిన ఘనత దక్కించుకుంది. 

చేజారిన ఆ ఒక్కటి...: చాంపియన్స్‌ ట్రోఫీ లీగ్‌ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అలవోకగా విజయం సాధించి... దక్షిణాఫ్రికానూ మట్టికరించి... సెమీస్‌లో బంగ్లా గండం దాటిన భారత్‌కు... ఫైనల్లో మాత్రం పాక్‌ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. ఈ పరాజయం వన్డే జట్టు కూర్పుపైనా ప్రభావం చూపింది. స్పిన్‌లో వైవిధ్యం చూపాలన్న ఆలోచనతో తదనంతర పరిణామాల్లో అశ్విన్, జడేజాలు జట్టులో స్థానం కోల్పోయారు. అయితే.. వీరిద్దరూ ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టెస్టు బౌలర్లలో రెండు, నాలుగో స్థానాల్లో నిలిచి జట్టు అగ్రస్థానం అందుకోవడంలో తమవంతు పాత్ర పోషించారు. 

మణికట్టు మాయాజాలం... 
ఏ ఫార్మాట్‌లో అయినా... మొన్నటివరకు భారత స్పిన్‌ ద్వయం అంటే గుర్తొచ్చింది అశ్విన్, జడేజాలే. కానీ 2017లో వారికి వన్డే, టి20 ద్వారాలు క్రమంగా మూసుకుపోయాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రధాన అస్త్రాలుగా మారారు. దీనికి తగ్గట్లే చహల్‌ 44, కుల్దీప్‌ 34 వికెట్లు తీసి తమ ఎంపికకు న్యాయం చేశారు.  

 రో‘హిట్‌మ్యాన్‌’ అయ్యాడు 
అపార ప్రతిభావంతుడిగా పేరున్నా... అందుకు తగిన న్యాయం చేయలేడని అపవాదున్న రోహిత్‌ శర్మ ఈ ఏడాది దానిని దాదాపు చెరిపేశాడు. వన్డేల్లో మూడో ద్విశతకం, టి20ల్లో వేగవంతమైన శతకంతో పాటు టెస్టుల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. సారథ్య బాధ్యతలనూ చేపట్టి జట్టును నడిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏడాది అతడికి దక్కిన బిరుదు ‘హిట్‌మ్యాన్‌’. వ్యాఖ్యాతల నోళ్లలో నానిన ఈ పేరు భారీ షాట్లు కొట్టే రోహిత్‌కు సరిపోయేదే. ఇకపై అభిమానులూ అలానే పిలుచుకునేలా ఇన్నింగ్స్‌లు ఆడాలని ఆశిద్దాం. 





‘జంబో’ వైదొలిగాడు... 
అనిల్‌ కుంబ్లే... ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజం. భారత్‌ ఆణిముత్యం. టీమిండియా కోచ్‌గా అతడి నియామకాన్ని అన్ని వర్గాల వారూ హర్షించారు. సరైన వ్యక్తిని ఎంపిక చేశారంటూ కొనియాడారు. కానీ... ఈ జెంటిల్‌మన్‌ జట్టులో కొందరికి ‘హెడ్మాస్టర్‌’లా కనిపించాడు. అతడి క్రమ‘శిక్షణ’, ఆలోచనలు అర్థం చేసుకోలేకపోయారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఫలితం తేల్చే ధర్మశాల టెస్టులో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించడం దగ్గర మొదలైన అభిప్రాయ భేదాలు చాంపియన్స్‌ ట్రోఫీ వరకూ కొనసాగాయి. తర్వాతి వెస్టిండీస్‌ పర్యటనకూ కుంబ్లే కోచ్‌గా ఉంటాడని తొలుత ప్రకటించినా... దిగ్గజ ఆటగాళ్లు కోచ్‌గా ఇమడలేరని మరోసారి నిరూపిస్తూ ‘జంబో’ వైదొలిగాడు.  

ఓడారు... కానీ పోరాడారు 
వరల్డ్‌కప్‌ ప్రయాణానికి ముందు... 
ముంబై బాంద్రాలోని ఓ ఇండోర్‌ అకాడమీలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్, కోచ్‌ తుషార్‌ విలేకరుల సమావేశం. హాజరైన విలేకరులు వేళ్లమీద లెక్కబెట్టగలిగినంత. దీనికి తగ్గట్లే సమావేశం కూడా కొద్దిసేపే సాగింది. 




వరల్డ్‌కప్‌ ముగిసిన అనంతరం... 
విమానాశ్రయంలో బ్యానర్లతో వేలాదిమంది అభిమానులు. ఈసారి విలేకరుల సమావేశం అయిదు నక్షత్రాల హోటల్‌లోని ఓ పెద్ద గదిలో. లెక్కకు మిక్కిలి మీడియా సిబ్బందితో ఆ గది నిండిపోయింది. ...అదే జట్టు. అదే కెప్టెన్‌. అదే కోచ్‌. కానీ 45 రోజుల వ్యవధిలో అంతా మారిపోయింది. 2017లో భారత మహిళల క్రికెట్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ తేడానే ప్రముఖంగా పేర్కొనాలి. ప్రపంచకప్‌లో వారి రన్నరప్‌ ప్రదర్శన అంత ప్రభావం చూపింది మరి. ఫైనల్లో ఓడినా...భారత మహిళల జట్టుకు స్వదేశంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో మరింత క్రేజ్‌ వచ్చింది. ఓవరాల్‌గా మహిళల క్రికెట్‌ జట్టుకు ఇది శుభ సంవత్సరమే. ఆడిన మూడు టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరి రెండింటిలో టైటిల్‌ నెగ్గింది. మొత్తం 20 మ్యాచ్‌ల్లో 16 గెలిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement