
ఆరు డకౌట్లు.. 76 పరుగులు
దంబుల్లా:నాలుగు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఆదివారం రాణ్గిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక మహిళలు కుప్పకూలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక మహిళలు కనీసం పోరాడకుండానే క్యూ కట్టేశారు. ఓపెనర్లు జయంగణి, వీరక్కోడీ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించగా, ఫస్ట్ డౌన్లో వచ్చిన కుమారిహామీ తొలి బంతికి పెవిలియన్ చేరింది.
ఆపై సురాంగిక, హన్సిక్ లు డకౌట్లుగా వెనుదిరగగా, ఇమాల్కా మెండిస్ పరుగు మాత్రమే చేసి నిష్క్రమించింది. ఇనోషి ప్రియదర్శిని కూడా డకౌట్గా పెవిలియన్ బాట పట్టింది. దీంతో శ్రీలంక ఆరు వికెట్లను డకౌట్ల రూపంలో నష్టపోయింది. కాగా, మధ్యలో రణవీర(32 నాటౌట్), కౌశల్య(14) ఫర్వాలేదనిపించడంతో శ్రీలంక 24.5 ఓవర్లలో 76 పరుగుల అత్యల్ప స్కోరుకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫెర్లింగ్, బీమ్స్ తలో మూడు వికెట్లతో రాణించగా, ష్కట్, ఓస్ బోర్నీలకు చెరో రెండు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 15.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.