విజయం దిశగా టీమిండియా
వార్మ్ స్లే:ఇంగ్లండ్ తో జరిగే ఏకైక మహిళల టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. ఇంగ్లండ్ విసిరిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన భారత్ మహిళలు ఆద్యంతం ఆకట్టుకుని విజయానికి చేరువయ్యారు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 151 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా భారత్ విజయానికి 30 పరుగులు అవసరం. భారత మహిళలు మిథాలీ రాజ్(36), ఎస్ పాండే(16) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత రెండో ఇన్నింగ్స్ లో కామిని(28), మందన(51) పరుగులు చేసి తొలి వికెట్టుకు 76 పరుగులు చేసి మంచి శుభారంభాన్నిచ్చారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 110/6 వికెట్లతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లండ్ 202 పరుగులకు ఆలౌటయ్యింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగుల ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 114 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ క్రాస్ కు మూడు వికెట్లు లభించగా, నైట్ కు ఒక వికెట్టు దక్కింది. ఎనిమిది సంవత్సరాల అనంతరం భారత మహిళలు ఆడుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.