ఇంగ్లండ్ పై భారత్ ఘన విజయం
వార్మ్ స్లే: ఇంగ్లండ్ తో ఇక్కడ జరిగిన ఏకైక మహిళల టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ విసిరిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన భారత్ మహిళలు ఆద్యంతం ఆకట్టుకుని విజయాన్ని చేజిక్కించుకున్నారు. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత మహిళలు ఇంగ్లండ్ ను కంగుతినిపించి సిరీస్ ను కైవసం చేసుకున్నారు. భారత రెండో ఇన్నింగ్స్ లో కామిని(28), మందన(51) పరుగులు చేసి తొలి వికెట్టుకు 76 పరుగులతో మంచి శుభారంభాన్నివ్వగా, మిథాలీ రాజ్ (50 ), ఎస్ పాండే (28 ) పరుగులు చేసి భారత్ కు విజయాన్ని సాధించిపెట్టారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 110/6 వికెట్లతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లండ్ 202 పరుగులకు ఆలౌటయ్యింది.
భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 114 పరుగులకు ఆలౌట్ అవ్వగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగుల ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బౌలర్ క్రాస్ కు మూడు వికెట్లు లభించగా, నైట్ కు ఒక వికెట్టు దక్కింది. ఎనిమిది సంవత్సరాల అనంతరం భారత మహిళలు ఆడుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.