
ముంబై: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి. తమ వైఫల్యాన్ని కొనసాగిస్తూ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 36 పరుగులు తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెత్ మూనీ (46 బంతుల్లో 71; 8 ఫోర్లు), ఎలిస్ విలాని (42 బంతుల్లో 61; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులకే పరిమితమైంది. జెమీమా రోడ్రిగ్స్ (41 బంతుల్లో 50; 8 ఫోర్లు) అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
చివర్లో అనూజ పాటిల్ (26 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయారు. ఆసీస్ పేసర్ మెగాన్ షుట్ (3/31) ‘హ్యాట్రిక్’తో భారత్‌ను దెబ్బ తీసింది. తన తొలి ఓవర్లో స్మృతి మంధన (3), మిథాలీ రాజ్ (0)లను వరుస బంతుల్లో బౌల్డ్ చేసిన షుట్...తర్వాతి ఓవర్లో దీప్తి శర్మ (2)ను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. భారత్ నామమాత్రమైన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గురువారం ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment