ఎవరిదో నాకౌట్‌ పంచ్‌? | India vs New Zealand and Australia vs England in semifinals | Sakshi
Sakshi News home page

ఎవరిదో నాకౌట్‌ పంచ్‌?

Published Mon, Jul 8 2019 3:06 AM | Last Updated on Mon, Jul 8 2019 4:53 AM

India vs New Zealand and Australia vs England in semifinals - Sakshi

విలియమ్సన్‌, కోహ్లి

ప్రపంచకప్‌లో లీగ్‌ దశకు తెర పడింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ పోరుకు అర్హత సాధించాయి. వరుసగా 38 రోజుల్లో మొత్తం 45 లీగ్‌ మ్యాచ్‌లు జరిగాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌లో అన్ని జట్లకు సెమీఫైనల్‌ చేరే అవకాశాలు సమానంగా లభించాయి. కానీ సెమీఫైనల్లో మాత్రం అలాంటి చాన్స్‌ ఉండదు. విశ్వవిజేతను నిర్ణయించే ఫైనల్‌ పోరుకు అర్హత పొందేందుకు ఈ నాలుగు జట్లకు సెమీఫైనల్స్‌ రూపంలో ఒక్కో అవకాశమే లభించనుంది. ఈ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓడితే ఇంటిదారి పడతారు కాబట్టి నాలుగు జట్లూ ఈ కీలక మ్యాచ్‌ల్లో పైచేయి సాధించేందుకు పక్కా వ్యూహాలతో సమాయత్తం అవుతున్నాయి.

– సాక్షి క్రీడావిభాగం
టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన భారత్‌ ప్రస్థానం సెమీఫైనల్‌ వరకు రాజసంగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం... వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దు కావడం మినహా... మిగతా ఏడు మ్యాచ్‌ల్లో భారత్‌ అదరగొట్టింది. శిఖర్‌ ధావన్, విజయ్‌ శంకర్‌ గాయాలతో మధ్యలోనే వైదొలిగినా వారి నిష్క్రమణ ప్రభావం టీమిండియా ప్రదర్శనపై అంతగా పడలేదు. రోహిత్‌ శర్మ ఐదు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉండటం పెద్ద ఊరట. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ శతకంతో ఫామ్‌లోకి రావడం... కెప్టెన్‌ కోహ్లి నిలకడ... వెరసి భారత టాపార్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది.

అయితే ఇప్పటి వరకు భారత మిడిలార్డర్‌కు సరైన పరీక్ష ఎదురుకాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో టాపార్డర్‌ ప్రదర్శన కీలకం కానుంది. భారత్‌ భారీ స్కోరు చేయాలన్నా... లక్ష్య ఛేదన సాఫీగా సాగాలన్నా రోహిత్, రాహుల్, కోహ్లిలో ఒకరు మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిందే. ఒకవేళ వీరు విఫలమైతే మిడిలార్డర్‌లో రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ పాండ్యా, ధోని బాధ్యతాయుతంగా ఆడాలి. బౌలింగ్‌ విషయానికొస్తే జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. బుమ్రా 17 వికెట్లు, షమీ 14 వికెట్లు తీశారు. లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ 11 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్‌ యాదవ్‌ కూడా తమవంతుగా రాణిస్తున్నారు.  

ఒకరిద్దరిపైనే భారం...
అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్న న్యూజిలాండ్‌కు ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేసే అలవాటు ఉంది. 1975, 1979, 1992, 1999, 2007, 2011 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్లో నిష్క్రమించిన కివీస్‌... 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరి తుదిమెట్టుపై చతికిలపడింది. ఈ ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌ ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు పరాజయం ఎదురుకాలేదు. అయితే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌ జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్, బౌలింగ విభాగాల్లో ఎక్కువగా ఒకరిద్దరి ప్రదర్శనపైనే ఆధారపడుతోంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, రాస్‌ టేలర్‌... బౌలింగ్‌లో ఫెర్గూసన్, ట్రెంట్‌ బౌల్ట్‌ నిలకడగా ఆడుతున్నారు. విలియమ్సన్, టేలర్‌ తక్కువ స్కోర్లకే ఔటైతే మాత్రం న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశ తప్పదేమో.  

ముఖాముఖి
భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మొత్తం 106 మ్యాచ్‌లు జరిగాయి. 55 మ్యాచ్‌ల్లో భారత్, 45 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచాయి. ఒక మ్యాచ్‌ ‘టై’కాగా... ఐదు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఏడు సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. మూడుసార్లు భారత్‌ను విజయం వరించగా, నాలుగుసార్లు న్యూజిలాండ్‌ గెలుపు రుచి చూసింది. ఈ రెండు జట్లు చివరిసారి 2003 ప్రపంచకప్‌లో తలపడటం గమనార్హం.

వారిద్దరి సారథ్యంలోనే మళ్లీ...
విరాట్‌ కోహ్లి నేతృత్వంలో భారత జట్టు 2008లో అండర్‌–19 ప్రపంచ కప్‌ టైటిల్‌ను సాధించింది. మలేసియాలో జరిగిన నాటి టోర్నీలో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై మూడు వికెట్ల తేడాతో భారత్‌ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. నాటి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ జట్టుకు ప్రస్తుత సీనియర్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్ల మధ్య ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పోరు జరగనుండగా... యాదృచ్ఛికంగా కోహ్లి, విలియమ్సన్‌ ఈసారి సీనియర్‌ జట్లకు సారథులుగా ఉన్నారు. నాటి జూనియర్‌ న్యూజిలాండ్‌ జట్టులో సభ్యులుగా ఉన్న ట్రెంట్‌ బౌల్ట్, టిమ్‌ సౌతీ... భారత జూనియర్‌ జట్టులో సభ్యుడైన రవీంద్ర జడేజా ప్రస్తుతం సీనియర్‌ జట్టులోనూ ఉన్నారు.  

అడ్డంకి దాటాలంటే...
1992 తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌పై ఈసారి భారీగా అంచనాలు ఉన్నాయి. భారీ హిట్టర్లు ఉండటం.. అందరూ ఫామ్‌లోకి రావడం... బౌలింగ్‌ పదును పెరగడం... వెరసి ఇంగ్లండ్‌ను ఈసారి టైటిల్‌ ఫేవరెట్‌గా చేశాయి. లీగ్‌ దశలో ఆసీస్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌... చావోరేవోలాంటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాలని పట్టుదలగా ఉంది. పోరాటపటిమకు మారుపేరైన ఆసీస్‌ను ఓడించాలంటే ఇంగ్లండ్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలి.

ఇంగ్లండ్‌ నుంచి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో జో రూట్, బెయిర్‌స్టో రెండేసి సెంచరీలు చేయగా... జేసన్‌ రాయ్, మోర్గాన్, బట్లర్‌ ఒక్కోసెంచరీ సాధించారు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ (17 వికెట్లు), మార్క్‌ వుడ్‌ (16 వికెట్లు), క్రిస్‌ వోక్స్‌ (10 వికెట్లు) హడలెత్తిస్తున్నారు. అయితే లీగ్‌ దశ ప్రదర్శన ఇప్పుడు చరిత్రే. నాకౌట్‌ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి ఓపెనర్లు శుభారంభం అందించాలి. మిడిలార్డర్‌ కుదురుగా ఆడాలి. ఆ తర్వాత బౌలర్లు మిగతా బాధ్యతను నిర్వర్తించాలి. కీలక మ్యాచ్‌లో కలిసికట్టుగా ఆడితేనే గట్టెక్కుతామన్న సంగతి ఇంగ్లండ్‌కూ తెలుసు కాబట్టి రెండో సెమీఫైనల్‌ రసవత్తరంగా సాగడం ఖాయం.  

ముఖాముఖి  
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు ఓవరాల్‌గా 148 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 82 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలవగా... 61 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు విజయం దక్కింది. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఎనిమిదిసార్లు పోటీపడ్డాయి. ఆరు సార్లు ఆస్ట్రేలియా నెగ్గగా... రెండుసార్లు ఇంగ్లండ్‌ గెలిచింది. 1992 ఈవెంట్‌ తర్వాత ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ మ్యాచ్‌లో విజయం దక్కలేదు.  

కంగారూ పడొద్దంటే...
ప్రపంచ కప్‌ సెమీస్‌ ముంగిట డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే షాన్‌ మార్‌‡్ష మోచేతి గాయంతో ప్రపంచ కప్‌కు దూరం కాగా, తాజాగా ఉస్మాన్‌ ఖాజా తొడ కండరాల గాయంతో ప్రపంచ కప్‌ నుంచి వైదొలిగాడు. ఖాజా స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ మాథ్యూ వేడ్‌ను ఎంపిక చేశారు. మరోవైపు ఆల్‌ రౌండర్‌ స్టొయినిస్‌ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతను సెమీఫైనల్లో ఆడేది లేనిది మరో రెండు రోజుల్లో తేలనుంది. స్టొయినిస్‌కు బ్యాకప్‌గా మిచెల్‌ మార్‌‡్షను ఎంపిక చేశారు.

లీగ్‌ దశ ఆరంభంలో భారత్‌ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి... చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడింది. ఆస్ట్రేలియా విజయమంత్రాల్లో సమష్టి ప్రదర్శన ప్రధానం. ఏ ఒక్కరిపైనో ఆ జట్టు అతిగా ఆధారపడటం లేదు. వార్నర్, ఫించ్, స్టీవ్‌ స్మిత్, అలెక్స్‌ క్యారీ జోరు మీదుండగా... మ్యాక్స్‌వెల్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది. ఇక బౌలింగ్‌లో మిషెల్‌ స్టార్క్‌ 26 వికెట్లతో టోర్నీ టాపర్‌గా కొనసాగుతున్నాడు. కమిన్స్‌ 13 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్‌ తొమ్మిది వికెట్లు తీశారు. లీగ్‌ దశలో ఇంగ్లండ్‌పై నెగ్గిన ఆస్ట్రేలియా నాకౌట్‌ మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది.  

తొలి సెమీఫైనల్‌
జూలై 9
భారత్‌ X న్యూజిలాండ్‌
వేదిక: మాంచెస్టర్‌
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం


రెండో సెమీఫైనల్‌  
జూలై 11  
ఆస్ట్రేలియా X ఇంగ్లండ్‌
వేదిక: బర్మింగ్‌హామ్‌
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం


2008లో కోహ్లి, విలియమ్సన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement