లీడ్స్: శ్రీలంక జట్టుపై భారత్ గత రికార్డు, తాజా ప్రపంచ కప్ ఫామ్‌లాంటివి చూసుకుంటే నిస్సందేహంగా మన జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఇంగ్లండ్, వెస్టిండీస్‌లను ఓడించిన లంకను తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం రావచ్చు. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో లంక 322 లక్ష్యాన్ని అందుకొని తమను ఓడించిన విషయం టీమిండియా సభ్యులకు గుర్తుండే ఉంటుంది. భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే పదే పదే మిడిలార్డర్‌లోనే సమస్య ఎదురవుతోంది.
కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు దీనిని జట్టు పరిష్కరించుకోవాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాండ్యా, దినేశ్ కార్తీక్ విఫలం కాగా, ధోని కూడా చచ్చీ చెడి పరుగులు సాధించాడు. మాజీ కెప్టెన్ ఈ ప్రపంచకప్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో 81 బంతులు ఎదుర్కొని 47 పరుగులు మాత్రమే చేయడం అతని బలహీనతను చూపించింది. నాలుగో స్థానంలో రెండు చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించిన పంత్ తన చోటును ఖాయం చేసుకున్నాడు. ఆడింది ఒకే మ్యాచ్ కాబట్టి కార్తీక్‌కు మరో అవకాశం దక్కవచ్చు. మయాంక్ జట్టుతో చేరినా... ఓపెనర్‌గా రాహుల్ స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు.
కాబట్టి మయాంక్ తన అవకాశం కోసం వేచి చూడాల్సిందే. ఏకంగా నాలుగు సెంచరీలు చేసి 544 పరుగులతో అందనంత ఎత్తులో ఉన్న రోహిత్ శర్మ జట్టు ప్రధాన బలం కాగా 5 అర్ధ సెంచరీలతో 408 పరుగులు చేసిన కోహ్లి కూడా భారత్ బ్యాటింగ్‌కు వెన్నెముక. పిచ్ కొంత వరకు స్పిన్‌కు అనుకూలించే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ముగ్గురు పేసర్లలో ఒకరిని పక్కన పెట్టి కుల్దీప్‌కు మళ్లీ అవకాశం కల్పించవచ్చు. వికెట్ల వేటలో పోటీ పడుతున్న షమీ, బుమ్రాలే ఆడే అవకాశం ఉంది. అయితే జట్టులో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని రవీంద్ర జడేజాను కూడా బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది.
సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక గత మ్యాచ్‌లో విండీస్‌ను ఓడించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యువ అవిష్క ఫెర్నాండో అదే జోరు సాగించాలని జట్టు ఆశిస్తోంది. లంక ఓపెనర్లలో కరుణరత్నే ఒక మ్యాచ్ మినహా బాగానే ఆడగా, కుశాల్ పెరీరా కూడా మూడు అర్ధ సెంచరీలతో మెరుగైన ప్రదర్శన చేశాడు. వీరిద్దరు శుభారంభం అందిస్తే ఆ తర్వాత ఫెర్నాండో, కుశాల్ మెండిస్ ఇన్నింగ్స్‌ను నడిపించగలరు. సీనియర్ మాథ్యూస్ తన స్థాయికి తగినట్లు మరో మంచి ఇన్నింగ్స్ ఆడితే లంకకు ప్రయోజనం. గత మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్ తిసారా పెరీరా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు మరోసారి మలింగనే నమ్ముకుంది. ఉదాన, రజిత భారత్‌పై ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది సందేహమే. స్పి న్నర్లు ధనంజయ డి సిల్వా, వాండర్సేలకు టీమిండియాను నిలువరిం చడం అంత సులువు కాదు.
ముఖాముఖి
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 158 మ్యాచ్‌లు జరిగాయి. 90 మ్యాచ్‌ల్లో భారత్... 56 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 3 మ్యాచ్‌ల్లో భారత్... 4 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పంత్, ధోని, పాండ్యా, కార్తీక్, షమీ/భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. శ్రీలంక: కరుణరత్నే, కుశాల్ పెరీరా, అవిష్క, కుశాల్ మెండిస్, మాథ్యూస్, తిసార పెరీరా, ధనంజయ, ఉదాన, మలింగ, రజిత, వాండర్సే.
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ పిచ్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. కొంత వరకు స్పిన్‌కు అనుకూలించవచ్చు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.
1: మరో వికెట్ తీస్తే వన్డేల్లో జస్‌ప్రీత్ బుమ్రా 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు
5: రోహిత్ మరో సెంచరీ చేస్తే ఒకే వరల్డ్ కప్‌లో ఐదు శతకాలు బాదిన తొలి ఆటగాడవుతాడు. రోహిత్ రెండు డబుల్ సెంచరీలు లంకపైనే సాధించాడు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
మాంచెస్టర్: ప్రపంచకప్‌కు ముందు ఆసీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ గురించి ఆలోచిస్తే సమ ఉజ్జీల సమరమయ్యేది. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్ గురించి ఎన్నో అంచనాలుండేవి. గణాంకాల పరంగా చూసినా ఇరు జట్ల మధ్య జరిగిన 99 వన్డేల్లో ఆసీస్ 48 గెలిస్తే, దక్షిణాఫ్రికా 47 గెలిచింది. హోరాహోరీగా సాగిన 3 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఆసీస్ ఏడు విజయాలతో దూసుకుపోతే సఫారీలు అతికష్టమ్మీద 2 మ్యాచ్‌లే గెలిచి సెమీస్ అవకాశాలు కోల్పోయారు.
ఇంగ్లండ్‌లో జరిగింది కాబట్టి 1999 ప్రపంచకప్‌లో జరిగిన ‘అత్యద్భుత టై మ్యాచ్’ గుర్తుకు రావచ్చు కానీ ఇప్పుడు దానితో పోలికే లేదు. ప్రస్తుతం ఆసీస్ లక్ష్యం ఈ మ్యాచ్‌లోనూ గెలిచి నంబర్‌వన్‌గా నిలవడం. అదే జరిగితే ఇంగ్లండ్‌కంటే బలహీన ప్రత్యర్థి అయిన న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఇదే మాంచెస్టర్ మైదానంలో తలపడవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక బలమైన జట్టును ఓడించి కొంతైనా సంతృప్తితో ప్రపంచకప్‌ను ముగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌తో వన్డేల నుంచి రిటైర్ అవుతున్న ఇమ్రాన్ తాహిర్, డుమినిలకు విజయంతో వీడ్కోలు పలకాలని కూడా సహచరులు ఆశిస్తున్నారు.
భారత్‌తో మ్యాచ్ మినహా ఆస్ట్రేలియాకు టోర్నీలో ఎక్కడా సమస్య ఎదురు కాలేదు. ఇంగ్లండ్ రావడానికి ముందు ఎవరూ ఫేవరెట్‌గా పరిగణించని డిఫెండింగ్ చాంపియన్ ఒక్కసారిగా పుంజుకొని చెలరేగిపోయింది. ఓపెనర్లు వార్నర్ (516 పరుగులు), ఫించ్ (504) ఒకరితో మరొకరు పోటీ పడి జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. ఒక్క మ్యాక్స్‌వెల్ మాత్రమే అంచనాలను అందుకోలేకపోయాడు.
1992 ప్రపంచకప్ నుంచి ఏదో కారణంగా అనూహ్యంగా కీలక సమయాల్లో నిష్క్రమించి అయ్యో అనిపించిన దక్షిణాఫ్రికా ఈసారి మాత్రం చెత్త ఆటతో సానుభూతికి కూడా అవకాశం లేని రీతిలో ‘ఆత్మహత్య’ చేసుకుంది. సెమీస్ చేరిన మూడు జట్ల చేతిలోనూ చిత్తయి అఫ్గానిస్తాన్, శ్రీలంకలపై మాత్రం సఫారీలు గెలవగలిగారు. టోర్నీ మొత్తంలో ఆ జట్టు నుంచి ఒక్కరూ సెంచరీ చేయకపోగా, మొత్తం 9 అర్ధ సెంచరీలు మాత్రమే నమోదవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది.
సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–3లో ప్రత్యక్ష ప్రసారం
ప్రపంచ కప్‌లో లీగ్ దశ ఆఖరి ఘట్టానికి చేరింది. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లేవో చివరి రోజే తేలనుంది. డిఫెండింగ్ చాంపియన్‌తో పాటు ఫేవరెట్ జట్టు బరిలోకి దిగుతుండగా... సెమీస్ చేరడంలో విఫలమైన మరో రెండు జట్లు ప్రత్యర్థులుగా అటువైపు నిలిచాయి. లీడ్స్‌లో జరిగే మ్యాచ్‌లో ‘ప్రియమైన శత్రువు’ శ్రీలంకను చిత్తు చేసి అగ్రస్థానం కోసం తమ వంతు ప్రయత్నం పూర్తి చేసేందుకు భారత్ సిద్ధమవుతుండగా... మాంచెస్టర్‌లో బలహీన దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి నంబర్‌వన్‌గా నిలవాలని ఫించ్ సేన కోరుకుంటోంది. మూడు గంటల వ్యవధిలో టాప్ ఎవరిదో, సెమీస్‌లో ఎవరి ప్రత్యర్థి ఎవరో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో వారాంతంలో రెండు ఆసక్తికర మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది.
‘టాప్’ నీదా... నాదా?
Published Sat, Jul 6 2019 3:05 AM | Last Updated on Sat, Jul 6 2019 8:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment