నేడే తొలి సెమీఫైనల్‌.. భారత్‌ వర్సెస్‌ కివీస్‌ | Kohli and Williamson on World Cup semi-final | Sakshi
Sakshi News home page

లార్డ్స్‌ దారిలో కివీస్‌ అడ్డంకి

Published Tue, Jul 9 2019 4:51 AM | Last Updated on Tue, Jul 9 2019 9:50 AM

Kohli and Williamson on World Cup semi-final - Sakshi

‘భారత్‌ సెమీఫైనల్‌ ప్రత్యర్థి న్యూజిలాండ్‌’ శనివారం అర్ధరాత్రి దాటాక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ఫలితం వచ్చాక సగటు టీమిండియా అభిమానిని ఒకింత సంతోషపర్చిన మాట ఇది! కివీస్‌తో పోరు అనగానే ఇక గెలుపు ఖాయం అన్నట్లుగా అన్ని వైపుల నుంచి ఫ్యాన్స్‌ నిశ్చింతంగా కనిపిస్తున్నారు. ఫైనల్‌ ప్రత్యర్థి గురించి మాత్రమే చర్చిస్తున్నారు. మరి నిజంగా ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మాత్రం అంత ఏకపక్షంగా సాగుతుందా? అద్భుత విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు నాకౌట్‌ ఒత్తిడిని అధిగమించి అలవోకగా న్యూజిలాండ్‌కు చెక్‌ పెడుతుందా?

ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక ఓటమి మినహా ఏడు సాధికారిక విజయాలతో సెమీస్‌ చేరిన జట్టు మనదైతే... పాక్‌తో సమానంగా ఐదు విజయాలే సాధించినా, వరుసగా గత మూడు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా రన్‌రేట్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చి ముందంజ వేసిన టీమ్‌ న్యూజిలాండ్‌. బలబలాల పరంగా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న కోహ్లి సేనకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐసీసీ టోర్నీలో అనూహ్య ప్రదర్శన కనబర్చడం అలవాటుగా మార్చుకున్న కివీస్‌ అంత సులువుగా లొంగుతుందా?

ఫుట్‌బాల్‌ సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం మాంచెస్టర్‌ మొత్తం నీలి రంగు పులుముకుంది. విండీస్‌తో మ్యాచ్‌ తర్వాత కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. అంతకుముందు ఇదే మైదానంలో పాకిస్తాన్‌తో పోరులో కూడా ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ అభిమాన సంద్రం తరలి వచ్చింది. ఒక రకంగా సొంతగడ్డలా కనిపిస్తోన్న ఓల్డ్‌ ట్రఫోర్డ్‌లో కోహ్లి సేన ముందు ‘బ్లాక్‌ క్యాప్స్‌’ నిలవగలదా? మూడోసారి జగజ్జేతగా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్న భారత్‌కు లార్డ్స్‌ ప్రయాణంకంటే ముందు కివీస్‌ సవాల్‌ ఎదురుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇక అందరి కళ్లూ భారత్‌–న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌పైనే ఉన్నాయి.   

మాంచెస్టర్‌: ప్రపంచ కప్‌ లీగ్‌ దశలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ‘ఫేస్‌ టు ఫేస్‌’లో ఆధిపత్యం ఎవరిదో తేలలేదు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మనపై కివీస్‌ చెలరేగినా అది అసలు సమరం మాత్రం కానే కాదు. ఇప్పు డు ఇరు జట్లు నేరుగా నాకౌట్‌ మ్యాచ్‌లోనే తలపడుతున్నాయి. నేడు ఇక్కడి ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్‌ ఎదుర్కోనుంది. 2015లోనూ భారత్‌ సెమీస్‌ చేరి ఆసీస్‌ చేతిలో ఓడగా... కివీస్‌ తుదిపోరుకు అర్హత సాధించి అక్కడ కుదేలైంది. ఇటీవలే కోహ్లి, బుమ్రా లేకుండానే కివీస్‌ను వారి సొంతగడ్డపైనే వన్డే సిరీస్‌లో 4–1తో చిత్తు చేసిన భారత్‌కు ప్రత్యర్థి బలహీనతలపై పక్కా అవగాహన ఉందనడంలో సందేహం లేదు.  

మార్పులు ఉంటాయా...
వరుస విజయాలతో జోరు మీదున్న జట్టు నాకౌట్‌ మ్యాచ్‌కు వెళుతుంటే సహజంగానే మార్పులకు ఆస్కారం ఉండదు. భారత జట్టు కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తోంది. అనితర సాధ్యమైన రీతిలో ఐదు సెంచరీలతో రోహిత్‌ శర్మ చెలరేగి ఆడుతుండగా, కోహ్లి ఈసారి సహాయక పాత్రలో సమర్థంగా రాణించాడు. ఓపెనర్‌గా రాహుల్‌ సఫలం కావడం కూడా భారత్‌లో ఆందోళన తగ్గించింది. అయితే సెమీఫైనల్‌ ఆరంభ ఓవర్లలో వీరంతా బౌల్ట్‌ను సమర్థంగా ఎదుర్కోవడం ముఖ్యం. బౌల్ట్‌కు అవకాశమిస్తే అతను మొత్తం బ్యాటింగ్‌ను కుప్పకూల్చగలడు. నాలుగో స్థానంలో పంత్‌ సామర్థ్యంపై కొంత అపనమ్మకం కనిపిస్తున్నా, అతని స్థానానికి ఢోకా లేదు.

పాండ్యా దూకుడును కొనసాగించాల్సి ఉండగా... ధోని ఈసారి ఒక గొప్ప ఇన్నింగ్స్‌ ఆడకపోతాడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. లంకతో మ్యాచ్‌లో ధోనికి బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాలేదు. ఓవరాల్‌గా తన బ్యాటింగ్‌పై అత్తెసరు మార్కులే వేయించుకున్న మాజీ కెప్టెన్‌ కూడా చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. ఇద్దరు రెగ్యులర్‌ పేసర్లతోనే ఆడితే గత మ్యాచ్‌లాగే రవీంద్ర జడేజా కొనసాగే అవకాశం ఉంది. అయితే పిచ్‌ను బట్టి అవసరమైతే ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా పనికొస్తాడు కాబట్టి దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో కేదార్‌ జాదవ్‌ తిరిగి రావచ్చు. అయితే లంకతో మ్యాచ్‌లో పాండ్యా కూడా పూర్తి పది ఓవర్ల కోటా వేశాడు కాబట్టి ఈ మార్పు సందేహమే.  

విలియమ్సన్‌ మినహా...
టోర్నీ ఆరంభంలో చెలరేగిన న్యూజిలాండ్‌ ఆ తర్వాత తడబడింది. తమ చివరి మూడు మ్యాచ్‌లలో పరాజయాలే అందుకు నిదర్శనం. సరిగ్గా చెప్పాలంటే ఒక్క కెప్టెన్‌ విలియమ్సన్‌ మినహా మిగతా వారంతా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. సీనియర్‌ రాస్‌ టేలర్‌ కూడా వరుసగా విఫలమవుతుండటంతో ఆ జట్టు బ్యాటింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. గప్టిల్‌ ఘోరంగా ఆడుతుండగా... రెండో ఓపెనర్‌గా మార్చి మార్చి మున్రో, నికోల్స్‌లను ఆడించినా ఇద్దరూ చేతులెత్తేశారు.

మిడిలార్డర్‌లో కీపర్‌ లాథమ్‌ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్లుగా నీషమ్, గ్రాండ్‌హోమ్‌ తమ విలువను చూపిస్తే కివీస్‌ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సౌతీ స్థానంలో ఫాస్ట్‌ బౌలర్‌ ఫెర్గూసన్‌ రావడం ఖాయమైంది. మూడో పేసర్‌ హెన్రీ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ సోధికి అవకాశం ఇవ్వాలని కూడా కివీస్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో సాన్‌ట్నర్‌ను తప్పించి రెండో స్పిన్నర్‌ లేని కొరత ఆ జట్టులో బాగా కనిపించింది. పోరాటపటిమలో ఎక్కడా తగ్గని న్యూజిలాండ్‌ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలని పట్టుదలగా ఉంది.  

సెమీఫైనల్‌ రోజున మాంచెస్టర్‌లో కొంత వర్షసూచన ఉన్నా, అది మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చు. ఒకవేళ మంగళవారం మ్యాచ్‌ జరగకపోతే రిజర్వ్‌ డే బుధవారం దానిని నిర్వహిస్తారు. రిజర్వ్‌ డే రోజు కూడా మ్యాచ్‌ సాధ్యం కాకపోతే గ్రూప్‌ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు (భారత్‌) ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. మ్యాచ్‌ రోజున ఒక జట్టు ఇన్నింగ్స్‌ పూర్తయి రెండో జట్టు ఇన్నింగ్స్‌ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలోనూ విజేత తేలకపోతే)... ఎక్కడ ఆట ఆగిపోయిందో అక్కడి నుంచే మ్యాచ్‌ను  రిజర్వ్‌ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ‘టై’గా ముగిస్తే విజేతను నిర్ణయించేందుకు టి20 తరహాలో ‘సూపర్‌ ఓవర్‌’ నిర్వహిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రోజు సూపర్‌ ఓవర్‌ సాధ్యపడకపోతే రిజర్వ్‌ డే రోజున సూపర్‌ ఓవర్‌ వేయిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా రిజర్వ్‌ డే రోజున కూడా సూపర్‌ ఓవర్‌ వీలుకాకపోతే లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు (భారత్‌) ఫైనల్‌కు చేరుతుంది.

పిచ్, వాతావరణం
ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్‌ ఇప్పటికే ఇక్కడ పాక్, విండీస్‌లపై గెలవగా... కివీస్‌ చేతిలో విండీస్‌ త్రుటిలో ఓడింది ఇక్కడే. మోర్గాన్‌ 17 సిక్సర్లు ఇదే స్టేడియంలో బాదాడు. అయితే ఈ మ్యాచ్‌కు కొత్తగా వేసిన పిచ్‌ను వాడుతున్నారు. టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌ చేయడం ఖాయం. ఈ ప్రపంచకప్‌లో ఈ మైదానంలో జరిగిన 5 లీగ్‌ మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. ప్రపంచ కప్‌ రెండో దశకు వచ్చేసరికి పిచ్‌లు జీవం కోల్పోయి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారిపోయింది. గత 20 మ్యాచ్‌లలో రెండోసారి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ 4 మ్యాచ్‌లే గెలవగలిగింది.

తుది జట్లు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, పంత్, ధోని, పాండ్యా, కార్తీక్‌/జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా.  
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, బౌల్ట్, హెన్సీ/సోధి.  

 బౌల్ట్‌ X రోహిత్‌  
రోహిత్‌ శర్మ ప్రపంచకప్‌లో ఇప్పటికే 647 పరుగులు సాధించాడు. సచిన్‌ చేసిన ఆల్‌టైమ్‌ వరల్ట్‌ కప్‌ రికార్డు (673)ని దాటేందుకు కేవలం 27 పరుగుల దూరంలో ఉన్న అతను సెమీస్‌లోనూ చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. కాబట్టి అతడిని ఆపేందుకు కివీస్‌ తమ ‘ట్రంప్‌ కార్డ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ను ప్రయోగిస్తుందనడంలో సందేహం లేదు. బౌల్ట్‌ బౌలింగ్‌లో రోహిత్‌ రికార్డు గొప్పగా లేదు.

ముఖ్యంగా లెఫ్టార్మ్‌ పేసర్లు వేసే ఇన్‌స్వింగర్లను ఎదుర్కోవడంలో అతని బలహీనత చాలా సార్లు బయటపడింది. వార్మప్‌ మ్యాచ్‌లో కూడా బౌల్ట్‌ సరిగ్గా ఇలాంటి బంతితోనే రోహిత్‌ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఈసారి రోహిత్‌ అతడిని ఎంత బాగా ఎదుర్కొంటాడో చూడాలి. వన్డేల్లో బౌల్ట్‌ బౌలింగ్‌లో 136 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 64.7 స్ట్రయిక్‌ రేట్‌తో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగుసార్లు అతని బౌలింగ్‌లో ఔటయ్యాడు.

 

3-3
ప్రపంచకప్‌లో ఆరుసార్లు సెమీఫైనల్‌ చేరిన భారత్‌ 3సార్లు ఓడి (1987, 1996, 2015) మూడుసార్లు ఫైనల్‌ చేరింది. ఇందులో 2003 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. 1983, 2011లలో విజేతగా నిలిచింది.

 1-6
ప్రపంచ కప్‌లో ఏడుసార్లు సెమీస్‌ చేరిన న్యూజిలాండ్‌ 2015లో ఫైనల్‌ చేరడం మినహా మిగతా ఆరు సార్లు (1975, 1979, 1992, 1999, 2007, 2011) సెమీస్‌లోనే ఓడింది. అత్యధికంగా ఆరు సార్లు సెమీస్‌లో ఓడిన రికార్డు కివీస్‌ పేరిటే ఉంది.

4-3
ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయం దక్కింది. ఈ రెండు జట్లు 2003 తర్వాత మళ్లీ ఓ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండటం విశేషం. 2003 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఏడు వికెట్లతో గెలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement