డు ప్లెసిస్
మాంచెస్టర్: ప్రపంచ కప్ ఆసాంతం నిరాశజనక ప్రదర్శన కనబర్చిన దక్షిణాఫ్రికా తమ ఆఖరి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. శనివారం ఇక్కడ జరిగిన ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలవడం 1992 తర్వాత ఇదే తొలిసారి. 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ (117 బంతుల్లో 122; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీ చేసినా... అలెక్స్ క్యారీ (69 బంతుల్లో 85; 11 ఫోర్లు, సిక్స్) మెరిసినా ఫలితం లేకపోయింది. ఫించ్ (3), స్మిత్ (7), స్టొయినిస్ (22), మ్యాక్స్‌వెల్ (12) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ (3/56), ప్రిటోరియస్ (2/27), ఫెలుక్వాయో (2/22) రాణించారు. 4 వికెట్లకు 119 పరుగులతో కష్టాల్లో పడిన ఆసీస్‌ను వార్నర్ ఆదుకున్నాడు. అలెక్స్ క్యారీతో కలిసి ఐదో వికెట్‌కు 108 పరుగులు జోడించాడు.
దక్షిణాఫ్రికా శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే 40వ ఓవర్లో ప్రిటోరియస్ బౌలింగ్‌లో మోరిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో వార్నర్ ఔటయ్యాడు. దాంతో ఆసీస్ జట్టు విజయంపై ఆశలు వదులుకుంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (94 బంతుల్లో 100; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి సెంచరీ సాధించాడు. డుసెన్ (97 బంతుల్లో 95; 4 ఫోర్లు, 4 సిక్స్‌ల) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు.
ఓపెనర్ డికాక్ (51 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ (2/59), లయన్ (2/53) రెండేసి వికెట్లు తీశారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక భారత్ 15 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలువగా... 14 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. 12 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో, 11 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఈనెల 9న మాంచెస్టర్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్; బర్మింగ్‌హామ్‌లో 11న జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment