మనకూ తగిలింది వరుణుడి దెబ్బ | India, New Zealand share points after another washout | Sakshi
Sakshi News home page

మనకూ తగిలింది వరుణుడి దెబ్బ

Published Fri, Jun 14 2019 4:45 AM | Last Updated on Fri, Jun 14 2019 4:49 AM

India, New Zealand share points after another washout - Sakshi

చిత్తడిగా మారిన మైదానం, డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లి నిరీక్షణ

నాటింగ్‌హామ్‌: ప్రపంచ కప్‌ను నీడలా వెంటాడుతున్న వరుణుడు భారత్‌కూ అడ్డుతగిలాడు. దీంతో గురువారం ఇక్కడ న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. తొలుత తడిగా ఉన్న ఔట్‌ ఫీల్డ్, శీతల వాతావరణ ప్రభావంతో టాస్‌ ఆలస్యమైంది. అరగంట తర్వాత సిద్ధమవబోతుండగా వాన ప్రారంభమైంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇదేమంత అడ్డంకి కాకపోయేది. కానీ, మంగళ, బుధవారాల్లో నాటింగ్‌హామ్‌లో కురిసిన భారీ వర్షాలకు ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానం ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది.

దీనికి గురువారం వాన తోడవడం, ఎండ ఏమాత్రం లేకపోవడంతో మ్యాచ్‌ ఆడే వీల్లేకపోయింది. ‘వచ్చారు... చూశారు... వెళ్లారు’ తరహాలో అప్పటికీ  ఇంగ్లండ్‌ కాలమానం ప్రకారం 11.30కు, 12.30కు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చివరి సారిగా పరిస్థితిని సమీక్షించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్‌ల ద్వారా (మూడు విజయాలు, ఒక రద్దు) ఏడు పాయింట్లు సాధించిన న్యూజిలాండ్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లో ఉండగా, మూడు మ్యాచ్‌లాడిన భారత్‌ రెండు విజయాలు, ఒక మ్యాచ్‌ రద్దుతో ఐదు పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.

గత మూడు ప్రపంచ కప్‌లలో భారత్, కివీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగలేదు. చివరిసారి 2003 కప్‌లో సెంచూరియన్‌ వేదికగా టీమిండియా నెగ్గింది. కప్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగ్గా భారత్‌ మూడు, కివీస్‌ నాలుగు గెలిచాయి. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో... గురువారం మ్యాచ్‌ సాగి ఉంటే టీమిండియాకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది. కీలక ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరమైన నేపథ్యంలో కూర్పును పరీక్షించుకునే అవకాశమూ చిక్కేది.

పాక్‌తో మ్యాచ్‌కు సైతం ముప్పు!
వారం వ్యవధిలో టోర్నీలో వర్షం కారణంగా రద్దయిన నాలుగో మ్యాచ్‌ ఇది. వీటిలో మూడింట  టాస్‌ అయినా పడకపోగా, మరోదాంట్లో గంటకు మించి ఆట సాగలేదు. వాతావరణం చూస్తుంటే శుక్రవారం నాటి వెస్టిండీస్, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ సహా ఇదే బాటలో మరిన్ని మ్యాచ్‌లు ప్రభావితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్‌ జట్లు ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వర్షం ఎదురవ్వలేదు. అన్నింటికీ మించి టోర్నీకే పెద్ద ఆకర్షణ అయిన భారత్‌–పాకిస్తాన్‌ మ్యాచ్‌కూ వరుణుడి గండం తప్పేలా లేదు. మాంచెస్టర్‌లో ఆదివారం ఈ మ్యాచ్‌ జరగాలి. నాటింగ్‌హామ్‌కు వందపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అక్కడ సైతం వాతావరణం ఇదే తీరుగా ఉంది.

అభిమానుల ఆవేదన...
ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌లో వర్షం అభిమానులకు మరో రూపంలో ఆవేదన మిగులుస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ ప్రారంభం కాకుంటే ప్రేక్షకులకు టిక్కెట్‌ డబ్బు వెనక్కిస్తారు. అయితే, ఎక్కువశాతం మంది బ్లాక్‌లో టిక్కెట్లు కొంటున్నారు. దీంతో మ్యాచ్‌ రద్దయినా వీరికి డబ్బు తిరిగి రావడం లేదు. ‘కివీస్‌తో మ్యాచ్‌కు రూ.70 వేలు పెట్టి బ్లాక్‌లో టిక్కెట్‌ కొన్నా. ఇదంతా పోయినట్లే. పాక్‌తో మ్యాచ్‌కైతే రూ.1.80 లక్షలు చెబుతున్నారు. నేను దీనిని భరించే స్థితిలో లేను’ అని సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వాపోయాడు. మరోవైపు ‘మేం నాలుగు రోజులైంది సూర్యుడిని చూసి...! భారత్‌తో మ్యాచ్‌ రద్దు మాకేం ఆశ్చర్యం కలిగించలేదు. విశ్రాంతి దొరుకుతున్నందున ఒకందుకు ఇది మంచిదే అనుకోవాలి’ అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ అన్నాడు.  

చెరో పాయింట్‌ సంతోషమే
‘కివీస్‌తో మ్యాచ్‌ రద్దు సరైన నిర్ణయమే. విజయాలు సాధించి ఉన్నాం కాబట్టి చెరో పాయింట్‌ దక్కడం ఏమంత ఇబ్బందికరమేం కాదు. పాక్‌తో ఆదివారం మ్యాచ్‌ గురించి ఆలోచిస్తున్నాం. మా ప్రణాళికలు మాకున్నాయి. మైదానంలో వాటిని అమలు చేయాలి. ధావన్‌ చేతికి కొన్ని వారాల పాటు ప్లాస్టర్‌ తప్పనిసరి. లీగ్‌ మ్యాచ్‌ల చివరి దశలో లేదా సెమీస్‌కు అతడు అందుబాటులోకి వస్తాడు. అతడు తిరిగి ఆడాలని కోరుకుంటున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement