విజయం అదిరె... | India Beat Bangladesh By 28 Runs | Sakshi
Sakshi News home page

విజయం అదిరె...

Published Wed, Jul 3 2019 5:03 AM | Last Updated on Wed, Jul 3 2019 8:18 AM

India Beat Bangladesh By 28 Runs - Sakshi

ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ జోరు, భారత్‌ స్కోర్లను చూస్తుంటే ఇక టీమిండియాకు తిరుగులేదనే అనిపిస్తుంది. తాజాగా బంగ్లా పనిపట్టింది. చక్కగా సెమీఫైనల్‌ చేరింది. ఈ టోర్నీలో మేటి జట్లకు దీటుగా రాణిస్తున్న బంగ్లాదేశ్‌ ఆట లీగ్‌ దశలోనే ముగిసింది. ఇక కోహ్లి సేన లక్ష్యం అగ్రస్థానంలో నిలవడమే! ఆఖరి మ్యాచ్‌లో లంకను ఓడిస్తే సెమీస్‌ పరీక్షను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చని భావిస్తోంది.  

బర్మింగ్‌హామ్‌: ఒక్క పరాజయం ఎదురైందో లేదో వెంటనే టీమిండియా పుంజుకుంది. బంగ్లాదేశ్‌పై అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. సగర్వంగా భారత్‌ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ (92 బంతుల్లో 104; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మళ్లీ సెంచరీతో చెలరేగాడు. కేఎల్‌ రాహుల్‌ (92 బంతుల్లో 77; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

ముస్తఫిజుర్‌ రహ్మాన్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్‌ (74 బంతుల్లో 66; 6 ఫోర్లు), సైఫుద్దీన్‌ (38 బంతుల్లో 51 నాటౌట్‌; 9 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీశాడు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. టీమిండియా తరఫున కుల్దీప్, కేదార్‌ స్థానాల్లో భువనేశ్వర్, దినేశ్‌ కార్తీక్‌ బరిలోకి దిగారు. రుబెల్‌ హొస్సేన్, షబ్బీర్‌ రహ్మాన్‌ బంగ్లా తుదిజట్టులోకి వచ్చారు.

సూపర్‌ హిట్‌ జోడి...
ధావన్‌ గాయపడగానే భారత్‌కు పెద్ద దెబ్బనుకున్నాం. కానీ ఆ లోటు మాత్రం లేనేలేదు. రాహుల్, రోహిత్‌లిద్దరు కీలకమైన మ్యాచ్‌ల్లో శుభారంభాలిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ అదే చేశారు. టాస్‌ నెగ్గగానే కోహ్లి బ్యాటింగ్‌కే ఓటేశాడు. ఆ వెంటే రాహుల్, రోహిత్‌ల జోడి బలమైన భాగస్వామ్యానికి ధాటిగా పునాదులు వేశారు. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఫోర్లు, సిక్సర్లు అవలీలగా బాదుతుంటే స్కోరు జోరందుకుంది. తొలి 10 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 69 పరుగులు చేసిన భారత ఓపెనర్లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొలిపే పనిలో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రోహిత్‌ 45 బంతుల్లో, రాహుల్‌ 57 బంతుల్లో ఫిఫ్టీలు చేశారు. చేతిలో ఉన్న బౌలింగ్‌ వనరులన్నీ ఉపయోగించినా... 20 ఓవర్లు పూర్తయినా... ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయిన బంగ్లా బౌలర్లు మరింత నీరసించారు.

రోహిత్‌ శతకం
బంగ్లా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన రోహిత్‌... వీలుచిక్కితే సిక్స్, కుదిరితే బౌండరీలుగా బాదుతుంటే స్కోరు అమాంతం పెరుగుతూ పోయింది. 23.1 ఓవర్లోనే భారత్‌ స్కోరు 150కి చేరింది. రోహిత్‌ 90 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో అతనికిది నాలుగో సెంచరీ కావడం విశేషం. పైగా 29వ ఓవర్లోనే సెంచరీ కొట్టడంతో అభిమానులు డబుల్‌ సెంచరీకి అవకాశముందనుకున్నారు. అందుకేనేమో 30వ ఓవర్లో అతను ఔట్‌ కాగానే భారత ప్రేక్షకులు తీవ్రంగా నిరాశచెందారు. సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో రోహిత్‌ వెనుదిరగడంతో 180 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. స్వల్పవ్యవధిలో రాహుల్‌ను రూబెల్‌ పెవిలియన్‌ చేర్చాడు.

ముస్తఫిజుర్‌ దెబ్బ...
భారత్‌ జోరు, స్కోరు చూస్తే 350 పైచిలుకు గ్యారంటీ అనే అనుకున్నారంతా కానీ ముస్తఫిజుర్‌ బౌలింగ్‌ నైపుణ్యం భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసింది. ఓపెనర్లు ఔటయ్యాక కెప్టెన్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌ స్కోరు పెంచే బాధ్యతను తీసుకున్నారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌ వేసిన ముస్తఫిజుర్‌... కోహ్లి (26), హార్దిక్‌ పాండ్యా (0)లను ఔట్‌ చేయడంతో స్కోరు వేగం మందగించింది. ధాటిగా ఆడుతున్న పంత్‌ (41 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్‌)ను షకీబ్‌ పెవిలియన్‌ చేర్చగా, మిగతా బ్యాట్స్‌మెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (8), భువనేశ్వర్‌ (2), షమీ (1) తేలిపోయారు. ధోని (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఆఖరి ఓవర్‌దాకా ఉన్నా మళ్లీ విమర్శలపాలయ్యే ఆటే ఆడాడు. ఆఖరి 10 ఓవర్లలో కేవలం 63 పరుగులే చేసిన భారత్‌ 5 వికెట్లను కోల్పోయింది.  

షకీబ్‌ మరో అర్ధసెంచరీ...
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు పదో ఓవర్‌ నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్, సౌమ్య సర్కార్‌ల జోరు లేకపోయినా... క్రీజులో పాతుకుపోతున్న దశలో షమీ తొలిదెబ్బ తీశాడు. తమీమ్‌ (22)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో సర్కార్‌కు సూపర్‌ ఫామ్‌లో ఉన్న షకీబ్‌ అల్‌ హసన్‌ జతయ్యాడు. 12వ ఓవర్లో జట్టు 50 పరుగులను అధిగమించింది. 16వ ఓవర్‌ వేసిన హార్దిక్‌... సర్కార్‌ (38 బంతుల్లో 33; 4 ఫోర్లు)ను ఔట్‌ చేయడంతో 74 పరుగుల వద్ద రెండో వికెట్‌ కూలింది. అనంతరం షకీబ్, ముష్ఫికర్‌ జట్టు స్కోరును వందకు చేర్చారు.

ముష్ఫికర్‌

మూడో వికెట్‌కు 47 పరుగులు జతయ్యాయో లేదో ముష్ఫికర్‌ (23 బంతుల్లో 24, 3 ఫోర్లు)ను చహల్‌ ఔట్‌ చేశాడు. ఇలా భారత బౌలర్లు  ప్రత్యర్థి జట్టు బలమైన భాగస్వామ్యాలు నమోదు చేయకుండా తలా ఒక చెయ్యివేశారు. 30వ ఓవర్లో పాండ్యా బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌ (24 బంతుల్లో 22; 1 సిక్స్‌) ఔట్‌ కావడంతో బంగ్లా ఆశలు ఆవిరయ్యాయి. 58 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న షకీబ్‌ ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. మొసద్దిక్, షకీబ్‌ వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో 179 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లు షబ్బీర్‌ (36 బంతు ల్లో 36; 5 ఫోర్లు), సైఫుద్దీన్‌ కాసేపు పోరాడినప్పటికీ లక్ష్యానికి అవేమాత్రం సరిపోలేదు. ఒకే ఓవర్లో రూబెల్‌ (9), ముస్తఫిజుర్‌ (0)లను బౌల్డ్‌ చేసిన బుమ్రా బంగ్లా ఇన్నింగ్స్‌ను ముగించాడు.

ఔటెందుకివ్వరు
భారత కెప్టెన్‌ కోహ్లి ఫీల్డు అంపైర్లతో వాదనకు దిగాడు. సౌమ్య సర్కార్‌ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ను ఔటెందుకు ఇవ్వరని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షమీ వేసిన ఇన్నింగ్స్‌ 12 ఓవర్లో బంతి సర్కార్‌ ప్యాడ్లను తాకింది. వెంటనే భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్‌ చేసినా ఫీల్డ్‌ అంపైర్‌ ఎరాస్మస్‌ తిరస్కరించాడు. దీనిపై ఆలస్యంగా... అసహనంతో డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. పలుమార్లు రీప్లే చూశాక నాటౌట్‌ అని ప్రకటించారు. అయితే గత మ్యాచ్‌లో రోహిత్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు ఔటిచ్చారు కదాని కాస్త గట్టిగానే వాదించాడు.

9 పరుగుల వద్ద బతికిపోయి...
రోహిత్‌ పరుగుల ఖాతా సిక్సర్‌తో మొదలైంది. అలా మొదలైన ఇన్నింగ్స్‌ 9 పరుగుల వద్దే ముగియాల్సింది. దురదృష్టం తమీమ్‌ చేతుల్లోంచి జారితే... అదృష్టం రోహిత్‌ బ్యాట్‌ను తాకింది. తమీమ్‌ క్యాచ్‌ మిస్‌ చేయడం. తదనంతరం అతను మూడంకెల స్కోరు దాకా చెలరేగడం జరిగిపోయాయి. తొలిఓవర్లోనే స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ కొట్టాడు రోహిత్‌. ఐదో ఓవర్‌ను ముస్తఫిజుర్‌ వేసే సమయానికి  మరో మూడే పరుగులు జతచేశాడు. నాలుగో బంతిని డీప్‌ స్కేర్‌ లెగ్‌లో గాల్లోకి లేపాడు. తమీమ్‌ సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేయడంతో బతికిపోయిన హిట్‌మ్యాన్‌ శతక్కొట్టాడు. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై సాధించిన సెంచరీలు కూడా క్యాచ్‌ మిస్‌అయ్యాకే సాధించాడు.

87 ఏళ్ల అభిమానం!
భారత్, బంగ్లా మధ్య మ్యాచ్‌లో ఒక వృద్ధ మహిళా అభిమాని ఉత్సాహం అందరినీ ఆకర్షించింది. 87 ఏళ్ల ఆమె పేరు చారులత పటేల్‌. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చిన్నపిల్లలకు ఏమాత్రం తగ్గకుండా బూర ఊదుతూ ఆమె చూపించిన జోష్‌కు అటు ఆటగాళ్లు, ఇటు కామెంటేటర్లు ఫిదా అయ్యారు. 1983లో కపిల్‌ డెవిల్స్‌ లార్డ్స్‌లో ప్రపంచ కప్‌ గెలిచినప్పుడు అక్కడే ఉన్నానని చెప్పిన ‘ఫ్యాన్‌ ఆఫ్‌ ద డే’...మ్యాచ్‌ తర్వాత తన వద్దకు అభిమానంతో వచ్చిన కోహ్లి, రోహిత్‌లపై ఆప్యాయత కురిపిస్తూ భారత్‌ మళ్లీ టైటిల్‌ గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) ముష్ఫికర్‌ (బి) రూబెల్‌ 77; రోహిత్‌ (సి) లిటన్‌ దాస్‌ (బి) సర్కార్‌ 104; కోహ్లి (సి) రూబెల్‌ (బి) ముస్తఫిజుర్‌ 26; రిషభ్‌ (సి) మొసద్దిక్‌ (బి) షకీబ్‌ 48; హార్దిక్‌ (సి) సర్కార్‌ (బి) ముస్తఫిజుర్‌ 0; ధోని (సి) షకీబ్‌ (బి) ముస్తఫిజుర్‌ 35; దినేశ్‌ కార్తీక్‌ (సి) మొసద్దిక్‌ (బి) ముస్తఫిజుర్‌ 8; భువనేశ్వర్‌ రనౌట్‌ 2; షమీ (బి) ముస్తఫిజుర్‌ 1; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50ఓవర్లలో 9 వికెట్లకు) 314.

వికెట్ల పతనం: 1–180, 2–195, 3–237, 4–237, 5–277, 6–298, 7–311, 8–314, 9–314.
బౌలింగ్‌: మొర్తజా 5–0–36–0, సైఫుద్దీన్‌ 7–0–59–0, ముస్తఫిజుర్‌ 10–1–59–5, షకీబ్‌ 10–0–41–1, మొసద్దిక్‌ 4–0–32–0, రూబెల్‌ 8–0–48–1, సౌమ్య సర్కార్‌ 6–0–33–1.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ (బి) షమీ 22; సర్కార్‌ (సి) కోహ్లి (బి) హార్దిక్‌ 33; షకీబ్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) హార్దిక్‌ 66; ముష్ఫికర్‌ (సి) షమీ (బి) చహల్‌ 24; లిటన్‌ దాస్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) హార్దిక్‌ 22; మొసద్దిక్‌ (బి) బుమ్రా 3; షబ్బీర్‌ (బి) బుమ్రా 36; సైఫుద్దీన్‌ నాటౌట్‌ 51; మొర్తజా (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 8; రూబెల్‌ (బి) బుమ్రా 9; ముస్తఫిజుర్‌ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం ( 48 ఓవర్లలో ఆలౌట్‌) 286.

వికెట్ల పతనం: 1–39, 2–74, 3–121, 4–162, 5–173, 6–179, 7–245, 8–257, 9–286, 10–286.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9–0–51–1, బుమ్రా 10–1–55–4, షమీ 9–0–68–1, చహల్‌ 10–0–50–1, హార్దిక్‌ 10–0–60–3.
 
2: సచిన్‌ (రెండు సార్లు) తర్వాత ఒకే ప్రపంచకప్‌లో 500కు పైగా పరుగులు చేసిన రెండో భారత ఆటగాడు రోహిత్‌ శర్మ. సచిన్‌ 1996 (523 పరుగులు), 2003 (673 పరుగులు)లలో ఈ ఘనత సాధించాడు.  
2: కుమార సంగక్కర (2015లో) తర్వాత ఒకే ప్రపంచ కప్‌లో 4 సెంచరీలు చేసిన రెండో ఆటగాడు రోహిత్‌ శర్మ. గత ప్రపంచకప్‌లో బంగ్లాపై చేసిన సెంచరీతో కలిపి రోహిత్‌ చేసిన మొత్తం శతకాల సంఖ్య 5. సచిన్‌ మాత్రమే 6 సెంచరీలు సాధించాడు. 
26: రోహిత్‌ వన్డే సెంచరీల సంఖ్య. ఓవరాల్‌ జాబితాలో సచిన్‌ (49), కోహ్లి (41), పాంటింగ్‌ (30), జయసూర్య (28), ఆమ్లా (27) తర్వాత అతను ఆరో స్థానంలో ఉన్నాడు.  
230: వన్డేల్లో రోహిత్‌ సిక్సర్ల సంఖ్య. ధోని (228)ని అధిగమించగా... అఫ్రిది (351), గేల్‌ (326), జయసూర్య (270) మాత్రమే ముందున్నారు.  
1: ఒకే ప్రపంచకప్‌లో 500కు పైగా పరుగులు చేసి కనీసం 10 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement