ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌లలో పరాజయం లేకుండా సాగిన భారత్‌ను ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఒక్కసారిగా కలవరపెట్టింది. ఆ మ్యాచ్ చేజార్చుకోవడం వల్ల ఉన్నపళంగా జరిగిన నష్టమేమీ లేదు కానీ జట్టులో ఉన్న లోపాలు మాత్రం బయటపడ్డాయి. సునాయాసంగా సెమీఫైనల్ చేరే స్థితిలో కనిపించిన టీమిండియాకు ఇప్పుడు ముందుకెళ్లాలంటే మరో విజయం కావాలి. అయితే ప్రత్యర్థి ప్రమాదకరమైన బంగ్లాదేశ్ రూపంలో ఎదురుగా నిలిచింది. గతంలో బంగ్లాదేశ్ సాధించిన సంచలనాలు, ఈ టోర్నీలో ఆ జట్టు ప్రదర్శనపరంగా చూస్తే భారత్‌కు ఇదేమీ సులువైన మ్యాచ్ కాబోదు. మన మిడిలార్డర్ సమస్యను ప్రత్యర్థి లక్ష్యంగా మార్చుకుంటే హోరాహోరీ పోరు ఖాయం. గత మ్యాచ్ ఓటమిని పక్కన పెట్టి అదే వేదికపై సరైన వ్యూహంతో తమ స్థాయికి తగ్గట్లుగా ఆడితే మాత్రం కోహ్లి సేనకు ఎదురుండదు.
బర్మింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో ఒక రోజు విరామంతో భారత్ మరో ప్రధాన పోరుకు సన్నద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో నేడు జరిగే తమ ఎనిమిదో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడుతుంది. బలాబలాల పరంగా చూస్తే ఇప్పటికీ భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లను ఓడించడంతో పాటు తాము పరాజయంపాలైన మ్యాచ్‌లలో కూడా ఎంతో మెరుగైన ప్రదర్శన చేసిన బంగ్లాను తక్కువగా అంచనా వేయలేం. ముఖ్యంగా వరల్డ్ కప్‌లో చెలరేగిపోతున్న షకీబ్‌ను ఆపడం భారత్‌కు ఎంతో కీలకం.
భువీకి చాన్స్...
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి రోహిత్, కోహ్లిల బ్యాటింగే భారత్‌ను ఆదుకుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు విఫలమైతే పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చు. బంగ్లా కూడా ఈ రెండు వికెట్లే లక్ష్యంగా ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు. మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌కు జట్టుతో చేరే అవకాశం లేదు కాబట్టి రాహుల్ ఓపెనర్‌గానే కొనసాగుతాడు. నాలుగో స్థానంలో పంత్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, చెలరేగేందుకు పాండ్యా సిద్ధంగా ఉన్నాడు. అయితే భారత్‌కు ధోని బ్యాటింగే పెద్ద ఆందోళనగా మారింది. ఇంగ్లండ్‌తో చివర్లో భారీ షాట్లు ఆడలేకపోగా, గత రెండేళ్లుగా స్పిన్‌ను ఎదుర్కోవడంలో ధోని రికార్డు పేలవంగా ఉంది.
ఈ ప్రపంచకప్‌లోనైతే అతను స్పిన్నర్ల బౌలింగ్‌లో 87 బంతులు ఎదుర్కొని ఒకే ఒక ఫోర్‌తో 41 పరుగులే చేశాడు! బంగ్లా త్రయం షకీబ్, మెహదీ, మొసద్దిక్‌లను అతను ఎలా ఆడతాడన్నది కీలకం. భారత్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చిన లెగ్ స్పిన్నర్ చహల్ స్థానంలో భువనేశ్వర్‌ను ఆడించవచ్చు. ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో పాటు భువీ బ్యాటింగ్ అదనపు బలం కానుంది. కేదార్ జాదవ్ స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా చోటు దక్కవచ్చు. జాదవ్ కంటే దూకుడుగా ఆడగలగడంతో పాటు కట్టుదిట్టమైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్ అతనికి తొలి అవకాశం కల్పించవచ్చు. బుమ్రా, షమీ పదునైన బౌలింగ్‌పై కూడా టీమిండియా నమ్మకం పెట్టుకుంది. మిడిల్, లోయర్ బలహీనతను అధిగమించగలిగితే మిగతా పనిని మన బౌలర్లు పూర్తి చేయగలరు.
అదే జట్టుతో...
ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ ఆటతీరు ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా సాగుతోంది. షకీబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోతుండగా... సీనియర్లు ముష్ఫికర్, తమీమ్ తమ స్థాయిని ప్రదర్శించారు. ఆ జట్టు ఇప్పటి వరకు మూడు విజయాలే సాధించినా... ఇతర మ్యాచ్‌లలో కూడా గట్టి పోటీనిచ్చింది. అదృష్టం కలిసిరాక ఓటమి పాలైనా, తమదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించగలదు. గత మూడు ఐసీసీ టోర్నీలలో కూడా భారత్‌ను ఓడించేందుకు ఆ జట్టు చివరి వరకు ప్రయత్నించింది కానీ గెలుపు మాత్రం దక్కలేదు. ఈసారి అవకాశం చేజార్చుకోకూడదని టీమ్ పట్టుదలగా కనిపిస్తోంది.
లిటన్ దాస్, సౌమ్య సర్కార్ కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆల్‌రౌండర్ మహ్ముదుల్లా గాయం నుంచి కోలుకోవడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరో 53 పరుగులు చేస్తే మహ్ముదుల్లా వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. బౌలింగ్‌లో భారత్‌ను దెబ్బ తీయగల సత్తా ముస్తఫిజుర్‌కు ఉంది. టోర్నీలో నిలకడగా రాణిస్తున్న మరో పేసర్ సైఫుద్దీన్‌ను భారత్ ఎప్పుడూ ఎదుర్కోలేదు కాబట్టి అది బంగ్లాకు కొంత అనుకూలాంశం. కెప్టెన్ కాబట్టి మొర్తజా జట్టులో కొనసాగుతున్నాడు తప్ప అతని బౌలింగ్‌లో ఏమాత్రం పస లేదు. ఆరు మ్యాచ్‌లలో మొర్తజా తీసింది ఒకే ఒక వికెట్! ఈ మ్యాచ్‌లోనైనా అతను తన అనుభవంతో రాణిస్తే బంగ్లాకు అంతకు మించి ఆనందం ఉండదు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పంత్, ధోని, పాండ్యా, జాదవ్/జడేజా, భువనేశ్వర్, షమీ, కుల్దీప్, బుమ్రా.
బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), తమీమ్, సర్కార్, షకీబ్, ముష్ఫికర్, లిటన్ దాస్, మçహ్ముదుల్లా, మొసద్దిక్, మెహదీ, సైఫుద్దీన్, ముస్తఫిజుర్.
ముఖాముఖి
వన్డేల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు 35 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 29 మ్యాచ్‌ల్లో భారత్... 5 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలిచాయి. మరో మ్యాచ్ రద్దయింది. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య మూడుసార్లు పోరు జరిగింది. రెండుసార్లు భారత్, ఒకసారి బంగ్లాదేశ్ విజయం సాధించాయి.
పిచ్, వాతావరణం
ఆదివారం భారత్, ఇంగ్లండ్ ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ జరగనుండటం విశేషం. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. ఒకవైపు 59 మీటర్లే ఉన్న బౌండరీ లక్ష్యంగా ఇంగ్లండ్ పరుగులు సాధించిందని విమర్శించిన కోహ్లి... ఇప్పుడు అదే అనుభవంతో తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ మ్యాచ్‌కు వర్ష ప్రమాదం లేదు.
5: మరో 5 వికెట్లు తీస్తే బుమ్రా వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.
8: మరో 8 వికెట్లు తీస్తే కుల్దీప్ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.
తప్పులు సరిచేసుకుంటారా?
Published Tue, Jul 2 2019 4:39 AM | Last Updated on Tue, Jul 2 2019 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment