కౌలాలంపూర్: ఆసియా కప్ టి20 టోర్నీలో భారత మహిళల జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో భారత జట్టుకు షాక్ ఇచ్చింది. మహిళల క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా బంగ్లాదేశ్ చేతిలో భారత్‌కిదే తొలి ఓటమి. ఈ ఆసియా టోర్నీలో 2012 తర్వాత భారత్‌కు ఎదురైన తొలి పరాజయం కూడా ఇదే. టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్లు మిథాలీ రాజ్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు), స్మృతి మంధాన (2) విఫలమవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (37 బంతుల్లో 42; 6 ఫోర్లు), దీప్తి శర్మ (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు.
పూజ వస్త్రాకర్ (20 బంతుల్లో 20; 4 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రుమానా అహ్మద్ 3 వికెట్లు తీసింది. తర్వాత బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షమీమా సుల్తానా (23 బంతుల్లో 33; 7 ఫోర్లు), ఫర్జానా హక్ (46 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రుమానా అహ్మద్ (34 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఫర్జానా, రుమానా అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 93 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను గెలిపించారు. భారత బౌలర్లు పూజ, రాజేశ్వరి, పూనమ్ తలా ఒక వికెట్ తీశారు. గురువారం జరిగే తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. మిగతా లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 23 పరుగులతో లంకను, థాయ్‌లాండ్ 9 వికెట్లతో మలేసియాను ఓడించాయి.
భారత మహిళలకు షాక్
Published Thu, Jun 7 2018 1:27 AM | Last Updated on Thu, Jun 7 2018 1:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment