భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ వన్డేలో సెంచరీతో చెలరేగిన ఈ ముంబై బ్యాటర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్-2024లోనూ ఫామ్‌ను కొనసాగించింది. ఈ ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో కలిపి 142కు పైగా స్ట్రైక్‌రేటుతో 144 పరుగులు సాధించింది.
ఇక స్మృతి మంధాన తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో బిజీ కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. ఆసీస్‌తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మృతి గనుక 310 పరుగులు సాధిస్తే.. వన్డేల్లో 4000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల క్లబ్‌లో చేరుతుంది.
మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు
అంతేకాదు భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలుస్తుంది. కాగా ఇంతకు ముందు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్... 112 మ్యాచ్‌లలో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకుంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో 2011నాటి వన్డేలో ఈ ఘనత సాధించింది.
ఇక స్మృతి మంధాన ఇప్పటి వరకు 88 వన్డేలు ఆడి 3690 పరుగులు సాధించింది. ఇందులో ఎనిమిది శతకాలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో స్మృతి ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా 310 రన్స్ చేస్తే.. మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టగలుగుతుంది.
టాప్‌లో ఉన్నది వీరే
కాగా ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల క్లబ్‌లో చేరిన క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ముందు వరుసలో ఉంది. ఆమె 86 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసింది. బెలిండా తర్వాతి స్థానాల్లో... మెగ్ లానింగ్(89 ఇన్నింగ్స్), లారా వొల్వర్ట్(96 ఇన్నింగ్స్), కరేన్ రాల్టన్(103 ఇన్నింగ్స్), సుజీ బేట్స్(105 ఇన్నింగ్స్), స్టెఫానీ టేలర్(107 ఇన్నింగ్స్), టామీ బీమౌంట్(110 ఇన్నింగ్స్) ఈ జాబితాలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టు మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డిసెంబరు 5న బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment