మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 ఎడిషన్ ఫిక్చర్లు, గ్రూప్‌ల వివరాలను ఐసీసీ ఇవాళ (మే 5) ప్రకటించింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి.
గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్దులు భారత్, పాక్‌లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, క్వాలిఫయర్-1 ఉండగా.. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్-2 జట్లు పోటీపడనున్నాయి. రెండు గ్రూప్‌ల్లోని జట్లు తమతమ గ్రూప్‌ల్లోని ఇతర జట్లతో చెరో మ్యాచ్ ఆడతాయి.
గ్రూప్ దశ అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 20న ఫైనల్ జరుగుతుంది. రెండు సెమీస్‌లకు, ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేస్ ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. 19 రోజుల పాటు జరిగే ఈ మెగా సమరం ఢాకా, సిల్హెట్ మైదానాల్లో జరుగనుంది.
ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిక్చర్స్ లాంచింగ్ ప్రోగ్రాంను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తాన్ ప్రారంభించారు.
దాయాదుల సమరం ఎప్పుడంటే..
పొట్టి ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు సిల్హెట్ మైదానం వేదిక కానుంది. భారత్ మ్యాచ్‌లు అక్లోబర్ 4 (న్యూజిలాండ్), 9 (క్వాలిఫయర్-1), 13 (ఆస్ట్రేలియా) తేదీల్లో జరుగనున్నాయి.
మరోసారి హాట్ ఫేవరెట్‌గా ఆసీస్..
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. మహిళల పొట్టి ప్రపంచకప్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు జరగగా.. ఆసీస్ ఏకంగా ఆరుసార్లు జగజ్జేతగా నిలిచింది. 2009లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా.. తొలి ఎడిషన్‌లో ఇంగ్లండ్.. 2016 ఎడిషన్‌లో వెస్టిండీస్ విజేతలుగా నిలిచాయి.
2016 ఎడిషన్‌లోనూ ఆసీస్ ఫైనల్ వరకు చేరింది అయితే తుది సమరంలో విండీస్ ఆసీస్‌కు ఊహించని షాక్ ఇచ్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆసీస్ 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఎడిషన్లలో విజేతగా నిలువగా.. భారత్ 2020లో ఫైనల్ దాకా వెళ్లి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.
Comments
Please login to add a commentAdd a comment