బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాను రేపు (సెప్టెంబర్ 9) ప్రకటించనున్నారని తెలుస్తుంది. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం భారత సెలెక్టర్లు, టీమిండియా హెడ్ కోచ్, కెప్టెన్ రోహిత్ శర్మ రేపు ముంబైలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతమున్న సమాచారం మేరకు రిషబ్ పంత్ చాలాకాలం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను ధృవ్ జురెల్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీలో జురెల్ ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లు పట్టి వికెట్‌కీపింగ్ పరంగా పర్వాలేదనిపించగా.. పంత్ అటు బ్యాట్‌తోనూ, వికెట్‌కీపింగ్‌లోనూ మెప్పించాడు.
పేస్ బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. బుమ్రా, సిరాజ్ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. కొత్తగా ఆకాశ్‌దీప్ పేస్ టీమ్‌లోకి జాయిన్ కావచ్చు. షమీ అందుబాటులో ఉండేది లేనిది రేపటి వరకు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ సెలెక్టర్లు షమీని ఎంపిక చేస్తే ఆకాశ్‌దీప్‌కు నిరాశ తప్పదు. ఆకాశ్‌దీప్.. షమీతో పాటు ముకేశ్ కుమార్ నుంచి సైతం పోటీ ఎదుర్కొంటాడు. తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆకాశ్‌దీప్ 9 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ కూడా పర్వాలేదనిపించాడు.
స్పిన్ విభాగం విషయానికొస్తే.. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఆస్కారం ఉంది. కుల్దీప్ అవకాశాలను సైతం కొట్టిపారేయడానికి వీళ్లేదు. అక్షర్ తాజాగా ముగిసిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ రాణించడంతో అతనికి కాస్త వెయిటేజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర్‌ను జట్టులోకి తీసుకుంటే జడేజాను పక్కకు పెడతారా లేక కుల్దీప్‌ను తప్పిస్తారా అన్నది చూడాలి.
ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ విభాగమే టీమిండియా సెలెక్టర్లకు అతి పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తొలి నాలుగు స్థానాలకు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ఖాయమని అనుకుంటే మిడిలార్డర్ ఎంపిక భారత సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది.
మిడిలార్డర్‌లో స్థానంలో కోసం సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. తాజాగా రేసులోకి సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా వచ్చాడు. ముషీర్.. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారీ శతకం బాది సెలెక్టర్లకు సవాలు విసిరాడు. మొత్తంగా చూస్తే.. బంగ్లాతో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు అంత తేలికైన పనైతే కాదు.
Comments
Please login to add a commentAdd a comment