Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. అంచనాలు లేకుండా బరిలోకి దిగి..! | CHAMPIONS TROPHY 2025, AUS VS ENG: HIGHEST EVER SUCCESSFUL RUN CHASE IN THE HISTORY OF ICC EVENTS BY REIGNING WORLD CHAMPIONS AUSTRALIA | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. అంచనాలు లేకుండా బరిలోకి దిగి..!

Published Sun, Feb 23 2025 11:45 AM | Last Updated on Sun, Feb 23 2025 11:50 AM

CHAMPIONS TROPHY 2025, AUS VS ENG: HIGHEST EVER SUCCESSFUL RUN CHASE IN THE HISTORY OF ICC EVENTS BY REIGNING WORLD CHAMPIONS AUSTRALIA

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు (Australia Cricket Team) చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నీల్లో (ICC ODI Tourneys) అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఛాంపియన్స్‌​ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 352 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

ఐసీసీ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ టోర్నీల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు పాకిస్తాన్‌ పేరిట ఉండింది. 2023 వరల్డ్‌కప్‌లో ఆ జట్టు శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

ఐసీసీ టోర్నీల్లో అత్యధిక లక్ష్య ఛేదనలు..
ఆస్ట్రేలియా 352 వర్సెస్‌ ఇంగ్లండ్‌, లాహోర్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ
పాకిస్తాన్‌ 345 వర్సెస్‌ శ్రీలంక, హైదరాబాద్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌
ఐర్లాండ్‌ 329 వర్సెస్‌ ఇంగ్లండ్‌, బెంగళూరు, 2011 వన్డే వరల్డ్‌కప్‌

శ్రీలంక రికార్డు బద్దలు
ఈ మ్యాచ్‌తో ఆసీస్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండింది. 2017 ఎడిషన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 322 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక లక్ష్య ఛేదనలు..
ఆస్ట్రేలియా 352 వర్సెస్‌ ఇంగ్లండ్‌, లాహోర్‌, 2025
శ్రీలంక 322 వర్సెస్‌ భారత్‌, ద ఓవల్‌, 2017
ఇంగ్లండ్‌ 308 వర్సెస్‌ బంగ్లాదేశ్‌, ద ఓవల్‌, 2017

ఆసీస్‌ వన్డే హిస్టరీలో రెండో అత్యుత్తమ లక్ష్య ఛేదన
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛేదించిన 352 పరుగుల లక్ష్యం, ఆ దేశ వన్డే హిస్టరీలోనే రెండో అత్యధికం. వన్డేల్లో ఆసీస్‌ అత్యుత్తమ లక్ష్య ఛేదన 2013లో రికార్డైంది. అప్పట్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 359 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.

పాక్‌ గడ్డపై రెండో అత్యధిక ఛేదన
ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఛేదించిన లక్ష్యం​.. పాక్‌ గడ్డపై రెండో అత్యధికం. పాక్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన ఘనత పాక్‌ ఖాతాలోనే ఉంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 355 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. వన్డేల్లో ఇదే పాక్‌కు అత్యధిక లక్ష్య ఛేదన.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇంగ్లిస్‌ (120 నాటౌట్‌) మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్‌ మరో 15 బంతులు మిగిలుండగానే ఊదేసింది. స్టార్‌ ప్లేయర్ల గైర్హాజరీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆసీస్‌.. రికార్డు లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌ ఛాంపియన్స్‌ అనిపించుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌.. శ్రీలంక చేతిలో 0-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. బెన్‌ డకెట్‌ (143 బంతుల్లో 165; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్‌ (68) అర్ద శతకంతో రాణించాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ (10 బంతులోల​ 21 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో ఇంగ్లండ్‌ 350 పరుగుల మార్కును తాకగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిష్‌ 3, లబూషేన్‌, జంపా తలో 2, మ్యాక్స్‌వెల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జోస్‌ ఇంగ్లిస్‌ మెరుపు శతకంతో విజృంభించి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. మాథ్యూ షార్ట్‌ (63), అలెక్స్‌ క్యారీ (69), లబూషేన్‌ (47), మ్యాక్స్‌వెల్‌ (32 నాటౌట్‌) ఇంగ్లిస్‌కు సహకరించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వుడ్‌, ఆర్చర్‌, కార్స్‌, రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ తీశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement