భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట కూడా రద్దైంది. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఇవాళ (సెప్టెంబర్ 29) ఒక్క బంతి కూడా పడలేదు. ఈ రోజు ఉదయం నుంచి వర్షం పడనప్పటికీ.. నిర్వహకులు గ్రౌండ్‌ను సిద్దం చేయలేకపోయారు. మ్యాచ్ పూర్తిగా రద్దు కావడం వరుసగా ఇది రెండో రోజు. తొలి రోజు ఆటలో కూడా కేవలం 35 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
వర్షం కురువడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జాకిర్ హసన్ (0), షద్మాన్ ఇస్లాం (24), నజ్ముల్ హసన్ షాంటో (31) ఔట్ కాగా.. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీం (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో (చెన్నై) భారత్ 280 పరుగుల తేడాతో గెలుపొందింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం అంతరాయాల నడుమ నిదానంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.
ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు రోజులు ఆట కూడా సజావుగా సాగే అవకాశాలు లేవు. టెస్ట్ సిరీస్ అనంతరం టీ20 సిరీస్ మొదలవుతుంది. అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.
చదవండి: ధోనిని చిన్న పిల్లాడిలా మార్చిన విజయం..!
Comments
Please login to add a commentAdd a comment